బహిష్కరణ సరైందేనని రుజువైంది
ABN , First Publish Date - 2021-04-07T08:35:09+05:30 IST
చట్టవిరుద్ధంగా పెడుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం సరైందేనని హైకోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు
ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్‌గా మారకూడదు : చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): చట్టవిరుద్ధంగా పెడుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించడం సరైందేనని హైకోర్టు తీర్పుతో రుజువైందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు పెట్టడాన్ని హైకోర్టు నిలుపుచేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయం. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకొన్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి చెంపపెట్టు. ఇప్పటికైనా జగన్‌రెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించాలి. నామినేషన్ల దాఖలు నుంచి ఈ ఎన్నికల ప్రక్రియను కొత్తగా మొదలుపెట్టాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప రబ్బర్ స్టాంప్‌గా మారకూడదు.’ అని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో చంద్రబాబు స్పష్టం చేశారు.
సున్నా నుంచి మొదలు పెట్టాల్సిందే: టీడీపీ
ఎన్నికల నిర్వహణలో కోడ్ అమలుకు వ్యవధి పెంచితే సరిపోదని, ఎన్నికలను సున్నా నుంచి మళ్లీ మొదలు పెట్టడానికే తాము పోరాడతామని టీడీపీ ప్రకటించింది. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు అశోక్‌బాబు, బుచ్చిరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికలకు 13నెలల కిందట నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవధిలో కొందరు అభ్యర్థులు చనిపోయారు. కొందరు పార్టీలు మారారు. కొందరు పోటీ నుంచి విరమించారు. ఇన్ని పరిణామాల తర్వాత అవే నామినేషన్లతో ఎన్నికలు జరపడంలో అర్థం లేదు’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు. కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ వైసీపీ ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని రుజువైందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళ్లిన టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని, పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు.