ఢిల్లీ జోరు..చెన్నై బేజారు

ABN , First Publish Date - 2021-10-05T07:41:15+05:30 IST

తాజా సీజన్‌లో టాప్‌-2గా కొనసాగుతున్న ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ముగిసింది.

ఢిల్లీ జోరు..చెన్నై బేజారు

బౌలర్ల హవా

దుబాయ్‌: తాజా సీజన్‌లో టాప్‌-2గా కొనసాగుతున్న ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ముగిసింది. 137 పరుగుల ఛేదనలో ఢిల్లీ ఆరంభంలో తడబడినా హెట్‌మయెర్‌ (18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 28 నాటౌట్‌) రాణింపుతో మరో 2 బంతులుండగా 3 వికెట్లతో నెగ్గింది. దీంతో 20 పాయింట్లతో ఢిల్లీ.. 18 పాయింట్లతో చెన్నై తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సీఎస్‌కేకు ఇది వరుసగా రెండో ఓటమి. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. రాయుడు (55 నాటౌట్‌) అర్ధసెంచరీతో రాణించాడు. అక్షర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. ధవన్‌ (39) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. జడేజా, శార్దూల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా అక్షర్‌ పటేల్‌ నిలిచాడు.


తడబడుతూనే..:

స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ ఆఖరి ఓవర్‌ వరకు ఛేదించలేకపోయింది. హెట్‌మయెర్‌ అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. ఓపెనర్‌ పృథ్వీ షా (18) మూడో ఓవర్‌లోనే వెనుదిరగ్గా.. అటు అయ్యర్‌ (2) నిరాశపరిచాడు. కానీ దీపక్‌ చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో ధవన్‌ వరుసగా 6,4,4,6తో చెలరేగి 21 పరుగులు అందించాడు. దీంతో జట్టు పవర్‌ప్లేలోనే 51 పరుగులు సాధించింది. ఆ తర్వాత జట్టు తడబడింది. పంత్‌ (15), కొత్త ఆటగాడు రిపల్‌ పటేల్‌ (18) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. దీనికి తోడు 15వ ఓవర్‌లో శార్దూల్‌.. అశ్విన్‌ (2), ధవన్‌ వికెట్లను పడగొట్టడంతో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి 30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉండగా హెట్‌మయెర్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. బ్రావో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో అతడు 12 పరుగులు రాబట్టడం కీలకమైంది. అలాగే అదే ఓవర్‌లో అతడి క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్‌ గౌతమ్‌ వదిలేయడం కొంపముంచింది. 19వ ఓవర్‌లో హెట్‌మయెర్‌ సిక్సర్‌ బాదడంతో ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి అక్షర్‌ (5) వెనుదిరిగినా రబాడ (4 నాటౌట్‌) బౌండరీతో ఊపిరిపీల్చుకున్నారు.


అంబటి అండగా.. :

వరుసగా రెండోసారీ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగింది. ఢిల్లీ బౌలర్ల జోరుకు తొమ్మిది ఓవర్లలోపే తొలి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 17వ ఓవర్‌లో కానీ వంద పరుగులను దాటలేకపోయింది.  అంబటి రాయుడు జట్టుకు వెన్నెముకలా నిలవడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. స్పిన్నర్లు అక్షర్‌, అశ్విన్‌ సీఎ్‌సకే బ్యాటర్స్‌ను ఇబ్బందిపెట్టారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రుతురాజ్‌ (13)కు పేసర్‌ నోకియా మూడో ఓవర్‌లోనే ఝలక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత డుప్లెసి (10), మొయిన్‌ అలీ (5)లను అక్షర్‌ అవుట్‌ చేయగా.. బంతికో పరుగు చొప్పున ఆడిన ఊతప్ప (19)ను అశ్విన్‌ రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో 62/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన చెన్నైని రాయుడు, ధోనీ (18) ఆదుకున్నారు. అయితే వీరి ఆటలో వేగం లోపించడంతో మధ్యలో పది ఓవర్ల పాటు రెండు ఫోర్లు మాత్రమే వచ్చాయి. డెత్‌ ఓవర్లలో రాయుడు బ్యాట్‌ ఝళిపించాడు. 18వ ఓవర్‌లో 4,6తో 14 రన్స్‌ రాబట్టడంతో పాటు 40 బంతుల్లో అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్‌లోనూ అతడి మరో ఫోర్‌, సిక్సర్‌తో 14 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో ధోనీ అవుట్‌ కావడంతో ఐదో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.


స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్‌ (సి) అశ్విన్‌ (బి) నోకియా 13; డుప్లెసి (సి) శ్రేయాస్‌ (బి) అక్షర్‌ 10; ఊతప్ప (సి అండ్‌ బి) అశ్విన్‌ 19; మొయిన్‌ అలీ (సి) శ్రేయాస్‌ (బి) అక్షర్‌ 5; రాయుడు (నాటౌట్‌) 55; ధోనీ (సి) పంత్‌ (బి) అవేశ్‌ 18; జడేజా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 136/5. వికెట్ల పతనం: 1-28, 2-39, 3-59, 4-62, 5-132. బౌలింగ్‌: నోకియా 4-0-37-1; అవేశ్‌ 4-0-35-1; అక్షర్‌ 4-0-18-2; రబాడ 4-0-21-0; అశ్విన్‌ 4-0-20-1.


ఢిల్లీ: పృథ్వీ షా (సి) డుప్లెసి (బి) చాహర్‌ 18; ధవన్‌ (సి) అలీ (బి) శార్దుల్‌ 39; శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) గైక్వాడ్‌ (బి) హజెల్‌వుడ్‌ 2; రిషభ్‌ పంత్‌ (సి) అలీ (బి) జడేజా 15; రిపల్‌ పటేల్‌ (సి) చాహర్‌ (బి) జడేజా 18; అశ్విన్‌ (బి) శార్దుల్‌ 2; హెట్‌మయెర్‌ (నాటౌట్‌) 28; అక్షర్‌ పటేల్‌ (సి) అలీ (బి) బ్రావో 5; రబాడ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.4 ఓవర్లలో 139/7. వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-93, 5-98, 6-99, 7-135. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-34-1; హజెల్‌వుడ్‌ 4-0-27-1; రవీంద్ర జడేజా 4-0-28-2; మొయున్‌ అలీ 3-0-16-0; శార్దుల్‌ ఠాకూర్‌ 4-0-13-2; బ్రావో 1.4-0-20-1

Updated Date - 2021-10-05T07:41:15+05:30 IST