‘ఎలుక’కు పట్టం!

ABN , First Publish Date - 2021-07-16T08:27:03+05:30 IST

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరవడంతో శిశువు మృతిచెందిన విషయం గుర్తుందా...

‘ఎలుక’కు పట్టం!

టెర్మినేట్‌ అయిన కంపెనీకి టెండర్‌ 

జీజీహెచ్‌లో శిశివు మృతి ఘటనలో  టీడీపీ ప్రభుత్వ హయాంలో చర్యలు

ఆ కంపెనీకే ఇప్పుడు ప్రాధాన్యం.. ఇష్టారాజ్యంగా నిబంధనల్లో మార్పులు 

శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ పనుల కోసం నాలుగుసార్లు రీటెండర్‌

4వ సారి టెర్మినేషన్‌ కంపెనీలకు చాన్స్‌ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరవడంతో శిశువు మృతిచెందిన విషయం గుర్తుందా... దీనిపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు నానా హంగామా చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎలుకను పట్టుకోవడానికి రూ.వేలల్లో చెల్లించారని ఆరోపణలు గుప్పించారు. ఆ సమయంలో పెస్ట్‌ కంట్రోల్‌ నిర్వహిస్తున్న కంపెనీని టెర్మినేట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం టెర్మినేట్‌ చేసిన కంపెనీకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎ్‌సఐడీసీ) అధికారులు శానిటేషన్‌ టెండర్‌ కట్టబెట్టారు! అస్మదీయ కంపెనీలకు మేలు చేసేందుకు అధికారులే అడ్డగోలుగా నిబంధనలు మార్చేయడంతో టెండర్లలో 80శాతం టెర్మినేషన్‌, బ్లాక్‌లిస్ట్‌ కంపెనీలే పాల్గొన్నాయి. 


రీటెండర్లకు వెళ్లాల్సిందే... 

ఏపీఎంఎ్‌సఐడీసీలో టెండర్ల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అధికారుల తీరుతో ఏడాదిన్నరగా కార్పొరేషన్‌లో ఏ టెండర్‌ పిలిచినా రీటెండర్లకు వెళ్లడం పరిపాటిగా మారింది. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, ఎస్‌ఎన్‌సీయూ టెండర్లలో అక్రమాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఇదే తరహాలో శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ విషయంలో కూడా నాలుగుసార్లు టెండర్లు పిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతిసారీ టెండర్‌ నిబంధనలు మార్చి, టెర్మినేషన్‌ కంపెనీలకు అర్హత కల్పించి ఈ మొత్తం ప్రక్రియను అధికారులు గందరగోళంగా మార్చేశారు. తొలుత టెండర్లు ఆహ్వానించిన సమయంలో అందులో పాల్గొనే కంపెనీలు చివరి ఐదేళ్లలో ఎక్కడా టెర్మినేట్‌ కాకూడదన్న నిబంధన విధించారు. అయినా పాల్గొంటే ఆ కంపెనీలను బ్లాక్‌లి్‌స్టలో చేరుస్తామని నిబంధనల్లో పొందుపరిచారు. అయితే ఏపీఎంఎ్‌సఐడీసీ అధికారులే వాటిని తుంగలో తొక్కుతూ అర్హత లేని మూడు కంపెనీలకు అర్హత కల్పించేలా నిబంధనల్లో ఇష్టారాజ్యంగా మార్పుచేర్పులు చేశారు. పైగా ఆరోగ్యశాఖ నియమించిన కమిటీ అనుమతితోనే నిబంధనలు మార్చామని సమర్థించుకున్నారు. చివరకు తాము అనుకున్న కంపెనీలకే టెండర్లు కట్టబెట్టారు. 


అది కూడా నాలుగుసార్లు రీటెండర్లు చేసి మూడు వారాల క్రితం ఫైనల్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో శానిటేషన్‌ పనుల కోసం టీడీపీ హయాంలో టెర్మినేట్‌ అయిన కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేసింది. మరో మాటకు తావులేకుండా అధికారులు దాన్నే ఎంపిక చేసేశారు. ఇప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాస్పత్రుల సూపరిటెండెంట్లతో అగ్రిమెంట్లు చేసుకునే పనిలో ఉన్నారు. టెర్మినేషన్‌ కంపెనీలకు కూడా అనుమతి ఇవ్వడం వల్లే ఆ కంపెనీ టెండర్లలో పాల్గొనే అర్హత సాధించింది. ప్రస్తుతం శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ కోసం ఎంపికైన కంపెనీల్లో రెండు మినహా మిగిలినవన్నీ టెర్మినేషన్‌లో ఉన్నవే కావడం గమనార్హం. దీనివెనుక భారీగా లావాదేవీలు జరిగినట్లు అధికార వర్గాలే చర్చించుకుంటున్నాయి.


జిల్లాల్లో జోరుగా ఫైరవీలు 

శానిటేషన్‌, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోల్‌ టెండర్లను శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ ప్యాకేజీ-1, పశ్చిమగోదావరి నుంచి నెల్లూరు వరకూ ప్యాకేజీ-2, రాయలసీమ జిల్లాలు మొత్తం ప్యాకేజీ-3గా విభజించారు. డీఎంఈలో శానిటేషన్‌ 3ప్యాకేజీలు, సెక్యూరిటీ 3ప్యాకేజీలు, పెస్ట్‌ కంట్రోల్‌ 3ప్యాకేజీలు, అలాగే ఏపీవీవీపీలో ఈ మూడు పనులకు మూడేసి ప్యాకేజీలుగా నిర్ణయించారు. ఒక్కో ప్యాకేజీకి ఒక్కో కంపెనీ ఎల్‌-1 వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా... ఇప్పుడే అసలైన ఫైరవీలు ప్రారంభమయ్యాయి. ఎల్‌1 కంపెనీలు జిల్లాల్లో కాంట్రాక్ట్‌ పనులు నిర్వహించవు. స్థానికంగా మరో కంపెనీకి సబ్‌ కాంట్రాక్ట్‌ అప్పగిస్తాయి. ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం, పనుల పర్యవేక్షణ మొత్తం సబ్‌ కాంట్రాక్టర్‌ చూసుకుంటారు. ఇప్పుడు ఈ సబ్‌ కాంట్రాక్ట్‌ పనుల కోసం ఏపీఎంఎ్‌సఐడీసీలో ఒక కీలకమైన వ్యక్తి, ఒక అధికారి చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎల్‌1 కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి తాము చెప్పిన కంపెనీలకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వాలని బెదిరిస్తున్నారు. దీనికోసం సబ్‌ కాంట్రాక్ట్‌ కంపెనీల నుంచి రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎల్‌1 కంపెనీలపై సదరు వ్యక్తి, అధికారి తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. వారి దెబ్బకు ఎల్‌1 కంపెనీల ప్రతినిధులు బెంబేలెత్తుతున్నారు.

Updated Date - 2021-07-16T08:27:03+05:30 IST