వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లోకి అనుమతి

ABN , First Publish Date - 2021-08-27T09:57:54+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న విద్యార్థులనే డిగ్రీ, ఇంజనీరింగ్‌ తరగతులకు అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను

వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే.. డిగ్రీ, ఇంజనీరింగ్‌ కాలేజీల్లోకి అనుమతి

సర్టిఫికెట్‌ చూపిన విద్యార్థులకే తరగతులు

కనీసం ఒక్క డోస్‌ అయినా తీసుకొని ఉండాలి

అన్ని వర్సిటీల పరిధిలో అమలుకు నిర్ణయం


హైదరాబాద్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న విద్యార్థులనే డిగ్రీ, ఇంజనీరింగ్‌ తరగతులకు అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఇతర కాలేజీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం యూనివర్సిటీల అధికారులతో ఉన్నత విద్యా మండలి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ముఖ్యంగా హస్టళ్ల నిర్వహణ, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ మేరకు ప్రస్తుతం వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నందున, విద్యార్థులందరూ తప్పనిసరిగా వేయించుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.


కనీసం ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ అయినా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్‌ చూపించిన విద్యార్థులనే కాలేజీల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు. అవసరమైతే ఆయా కాలేజీల పరిధిలోనే రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అన్ని కాలేజీలకు స్పష్టం చేయాలని యూనివర్సిటీల అధికారులకు ఉన్నత విద్యా మండలి అధికారులు సూచించారు.


ఈడబ్ల్యూఎస్‌ కోటాకు 10శాతం సీట్లు!

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో 10శాతం సీట్లను అదనంగా పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల వారీగా పెంచాల్సిన సీట్లపై అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతున్నందున ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ 10 శాతం సీట్లను పెంచాలని నిర్ణయించారు. అలాగే, మిగిలిన కోర్సుల్లోనూ 10 శాతం సీట్లను ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కేటాయించనున్నారు.

Updated Date - 2021-08-27T09:57:54+05:30 IST