పిటిషనర్‌ ఎన్‌వోసీ ఇచ్చినా ముద్దాయికి బెయిలివ్వలేం: హైకోర్టు

ABN , First Publish Date - 2020-09-22T08:33:44+05:30 IST

పిటిషనర్‌ ఎన్‌వోసీ ఇచ్చినా ముద్దాయికి బెయిలివ్వలేం: హైకోర్టు

పిటిషనర్‌ ఎన్‌వోసీ ఇచ్చినా ముద్దాయికి బెయిలివ్వలేం: హైకోర్టు

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఫిర్యాదుదారు నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చినంత మాత్రాన సెషన్స్‌ కేసులో జైలు శిక్ష పడ్డ ముద్దాయికి బెయిలు మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుల ఎన్‌వోసీ ఆధారంగా బెయిలు మంజూరు చేస్తే... హత్యలు చేసిన వారు సైతం అంగబలం, అర్థబలం ఉపయోగించి ఫిర్యాదుదారులను భయపెట్టి బెయిలివ్వడానికి అభ్యంతరం లేదని చెప్పిస్తారని, ఇటువంటి అంశాలను ప్రోత్సహించవద్దంటూ పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని గుర్తుచేసింది. ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన బెత్తరి శ్రీనివాస్‌ తన న్యాయవాది ద్వారా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ టి. వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జయారెడ్డి వాదిస్తూ...బాధితుడి తండ్రి నిరభ్యంతర పత్రం ఇచ్చినందున సెషన్స్‌ జడ్జి విధించిన జైలు శిక్షను సస్పెండ్‌ చేసి ముద్దాయికి బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఈ వాదనలకు అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జె. శ్రీదేవి అడ్డుచెప్పారు. ఫిర్యాదు దారు ఎన్‌వోసీ ఇచ్చారనే కారణంతో జైలుశిక్ష పడిన ముద్దాయికి బెయిలు మంజూరు చేయరాదన్నారు. ఇలా చేస్తే తీవ్ర నేరాలు చేసిన వారుసైతం ఫిర్యాదుదారులను లొంగదీసుకుని ఎన్‌వోసీ ఇచ్చేలా వారిపై ఒత్తిడి చేస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అదనపు పీపీ వాదనలతో ఏకీభవిస్తూ ముద్దాయి బెయిలు పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

Updated Date - 2020-09-22T08:33:44+05:30 IST