Abn logo
Feb 22 2020 @ 02:04AM

ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి వికేంద్రీకరణ

విశాఖపట్టణం పారిశ్రామిక నగరమైనప్పటికీ రాష్ట్ర జనాభాకు సరిపడా అవసరాలు తీరనందునే ఇతర రాష్ట్రాలు, నగరాలు, దేశాలకు మనయువత పొట్టచేత పట్టుకుని వలస పోవడం జరిగింది. విశాఖపట్టణంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మరో మహానగరం అవసరం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని..  13జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక హోదా.. ఇదే మన నినాదం కావాలి. ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు, రామాయపట్నం మేజర్‌పోర్టు, కాకినాడ పెట్రోలియం రిఫైనరీ మరియు కెమికల్‌ కాంప్లెక్స్‌ చేపట్టినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


ఆరు సంవత్సరాల క్రితం పార్లమెంటులో నాటి ప్రధానమంత్రి డా. మన్‌మోహన్‌ సింగ్‌ అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ప్రకటించారు. ఈ ప్రత్యేక హోదా ప్రకటించడానికి చెప్పిన సహేతుక కారణాలను తదనంతరం కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విస్మరించడం వల్ల ఆరు సంవత్సరాల అనంతరం కూడ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, ఆర్థిక, సామాజిక అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పులలో కూరుకుపోతూ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. విభజన జరిగినప్పుడు నెలకొన్న వాతావరణమే సాగుతూ రాష్ట్ర భవిషత్తు అంధకారబంధురమైనది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ తెలంగాణకే దక్కడంతో విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే దక్కుతున్నందువల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు 5సంవత్సరాలు ప్రత్యేక హోదాను ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్‌ ఆమోదం కూడా పొందింది. ఆర్డినెన్స్‌ జారీచేయాలనే ప్రయత్నం ఎన్నికల నియమావళి కారణంగా సాధ్యంకాలేదని తదుపరి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుందని ఆనాడు ప్రధానమంత్రి చెప్పారు. దానితో షరతులతో కూడిన రాష్ట్ర విభజన జరిగింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని ముగిసిపోయిన అధ్యాయం అంటూ తేలిక భావంతో చూసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తి విస్మరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లే విధంగా అపహాస్యం చేసింది. రాజకీయ వైఖరులు, వైరుధ్యాల దుష్ప్రభావం అభివృద్ది పైనా పరిపాలపైనా పడని విధంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ వ్యవస్థకు చోటు చేసే విధంగ ప్రవర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఆంధ్రప్రదేశ్‌ను దీనావస్థకు దిగజార్చింది.


రాష్ట్ర విభజన చేసిన గాయం కన్నా ఎక్కువగా వై.ఎస్‌. జగన్‌ ప్రభుత్వం చేసిన మూడు రాజధానుల ప్రకటన రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని రాజకీయపక్షాలు, అన్ని వర్గాలు, ప్రాంతాలు ప్రజలు ఆమోదించి ఆహ్వానించిన అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం ఒక విధ్వంసకర చర్య. రాజధాని అంటేనే శాసనవ్యవస్థ ఉన్నత న్యాయస్థానం, సచివాలయవ్యవస్థ మూడు పాలనా వ్యవస్థలను కలిగిఉండే ‘‘ముఖ్యపట్టణం’’. మూడు వ్యవస్థలు వేరువేరు నగరాలలో ఉంటే ఏఒక్క నగరానికి రాజధాని స్థాయి గుర్తింపు రాదు. ఉన్నత న్యాయస్థానం వేరే ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాలు కొన్ని ఉన్నప్పటికీ వాటి చారిత్రక నేపథ్యం భిన్నమైనది. ఆయా రాష్ట్రాలు పునర్విభజనకు ముందే ఆ ప్రాంతంలో ఆ వ్యవస్థలు ఏర్పడి ఉండడం కారణంగా ఒక సర్దుబాటుగా ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడినవి మాత్రమే అని గ్రహించాలి. అలహాబాద్‌లో హైకోర్టు నాగపూర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదం కారణంగా బెల్గాంలో కొద్దికాలం ఆ సమావేశాలు కర్ణాటక, ఆంధ్ర, కేరళలతో కూడిన మద్రాసు ప్రెసిడెన్సీ అనంతర కాలంలో కేంద్రస్థానం కానప్పటికీ తమిళనాడుకు మద్రాసు రాజధానిగా స్థిరపడిపోవడం ఇటువంటివే. ఒక గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నిర్మించుకొనే అవసరం, అవకాశం మనకు లభించినందు వలన మూడు వ్యవస్థలు కలిగిన లోపభూఇష్టత లేని పరిపూర్ణ రాజధానిగా అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా నిర్ణయమైంది. రాజధాని అనేది కేవలం ఒక పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను కలిపి ఉంచే ఒక ముఖ్యమైన బంధం. దేశంలోను ప్రపంచంలోను ఆ రాష్ట్రానికి గుర్తింపునిచ్చే శాశ్వత చిరునామా. రాజధాని అభివృద్ధిని ప్రాంతీయ అభివృద్ధిగా ప్రచారం చేయడం తగదు. రాజధానిలో ఉండవలసిన కార్యాలయాలను మూడు ప్రాంతాలకు విభజించడంవలన అదనంగా ఒక్క ఉద్యోగం రాదు. వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు వొరిగేదేమీలేదు. అధికార వికేంద్రీకరణ స్థానిక సంస్థల విధులలో రాజకీయ జోక్యం లేకుండా, నిధులు, విధులు బదలాయించి స్వతంత్ర నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనివ్వడంద్వారానే సాధ్యమవుతుంది. రాజధానిని మూడుముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందనేది ఆశాస్త్రీయ అద్భుతకల్పన. ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్య. మళ్ళీ రాష్ట్రం మరో విభజనకు దారితీసే పరిస్థితులకు నాటుపడిన విషభావం.


ఆయా ప్రాంతాలలో లభించే వనరుల ఆధారంగా 13జిల్లాల అభివృద్ధికి అన్ని పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్ర విభజన షరతుగా పార్లమెంటు మనకు ఇచ్చిన హక్కు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను ప్రాంతాల వారీగా విభజించి ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నీరుగార్చి ముగించివేసే కుట్రకు ఆంధ్రప్రదేశ్‌ బలికాకుండా అప్రమత్తం కావలసిన బాధ్యత మేధావులు, ప్రజసంఘాలు, ఉద్యమ సంస్థలపైనే ఉన్నది. 


ఒక పక్క ప్రపంచం వేగంగా ముందుకు కదులుతుంటే ఆంధ్రప్రదేశ్‌ అర్ధశతాబ్దం వెనుక బడిపోయింది. 33వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా ఇచ్చి సమాజపరం చేయడం నిర్ద్వంద్వంగా సమ సమాజాన్ని కాంక్షించే గొప్ప నిర్ణయం. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించుకొనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థికాబివృద్ధి సాధించుకొనే విధంగా రాజధాని అమరావతి భూములను సద్ద్వినియోగం చేసుకోవాలి. విశాఖపట్టణం పారిశ్రామిక నగరమైనప్పటికీ రాష్ట్ర జనాభాకు సరిపడా ప్రజల అవసరాలు తీరనందునే ఇతర రాష్ట్రాలు, నగరాలు, దేశాలకు మనయువత పొట్టచేత పట్టుకుని వలస పొవడం జరిగింది. విశాఖపట్టణంతో పాటు ఈ రాష్ట్ర అవసరాలకు మరో మహానగరం ఆంధ్రప్రదేశ్‌కు అవసరం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. 13జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక తరగతి హోదా.. ఇదే మన నినాదం కావాలి. ప్రభుత్వ రంగంలో కడప ఉక్కు, రామాయపట్నం మేజర్‌పోర్టు, కాకినాడ పెట్రోలియం రిఫైనరీ, కెమికల్‌ కాంప్లెక్స్‌ చేపట్టినప్పుడే నిజమైన అభివృద్ధి జరిగి అన్ని పాంతాలు అభివృద్ధి చెంది నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

అవధానుల హరి

‌కన్వీనర్, ప్రత్యేకహోదా 

ఆత్మగౌరవ పోరాట కమిటీ

Advertisement
Advertisement
Advertisement