అప్పులు తగ్గాయంట.. సుప్రీం కళ్లకూ గంతలు!

ABN , First Publish Date - 2022-08-20T08:43:00+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తగ్గాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను, పరిమితులను మా రాష్ట్రం పక్కాగా పాటిస్తోంది!’’.

అప్పులు తగ్గాయంట.. సుప్రీం కళ్లకూ గంతలు!

  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలోనే ఉన్నాయి.. వైసీపీ పిటిషన్‌’’
  • ప్రభుత్వాన్ని అడిగితే పార్టీ స్పందన
  • సాయిరెడ్డి ఇంటర్వీన్‌ పిటిషన్‌లో అబద్ధాలు
  • రూ.4.13 లక్షల కోట్లకు చేరిన పబ్లిక్‌ డెట్‌
  • కార్పొరేషన్ల ద్వారా అడ్డగోలు అప్పులు
  • రాజ్యాంగ నిబంధనలకూ తూట్లు
  • అసలు, వడ్డీ కింద ఏటా 55 వేల కోట్ల చెల్లింపు
  • అయినా అంతా సక్రమమే అని వైసీపీ పిటిషన్‌


‘ఉచిత హామీలు, సంక్షేమ పథకాలపై మీ వైఖరి ఏమిటి?’ అని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అడిగింది. కానీ... రాష్ట్ర ప్రభుత్వంకంటే ముందుగా ‘నేనున్నాను’ అంటూ అధికార పార్టీ వైసీపీ స్పందించింది. ‘తగుదునమ్మా’ అని ఇంటర్వీన్‌ పిటిషన్‌ వేయడం ఒక ఎత్తైతే... అందులో అన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే పొందుపరచడం మరో ఎత్తు! సర్కారుకు సంబంధించిన విషయంలో పార్టీ జోక్యం ఏమిటో... అందులో సుప్రీంకోర్టు కళ్లకూ గంతలు కట్టే ప్రయత్నం ఏమిటో అర్థంకాక అధికారులే తలలు బాదుకుంటున్నారు! ఆ వింత కథ ఏమిటో మీరూ చదవండి!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తగ్గాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను, పరిమితులను మా రాష్ట్రం పక్కాగా పాటిస్తోంది!’’... ఇదీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికార పార్టీ వైసీపీ ఇచ్చిన ‘సర్టిఫికెట్‌’. అది కూడా ‘ఇంటర్వీన్‌ పిటిషన్‌’ రూపంలో సుప్రీంకోర్టుకు చెప్పిన సంగతి. ఉచిత హామీలు, పథకాలపై వైఖరి చెప్పాలంటూ అన్ని రాష్ర్టాలకూ సుప్రీంకోర్టు గతంలో నోటీసులు పంపించింది. అయితే, దీనిపై రాష్ట్ర ప్రభుత్వంకంటే ముందు వైసీపీ స్పందించింది. పార్టీ జనరల్‌ సెక్రటరీ హోదాలో ఎంపీ విజయసాయి రెడ్డి ఇంటర్వీన్‌ పిటిషన్‌ వేశారు. ‘రాష్ట్రంలో ఆర్థికంగా అంతా బాగుంది’ అని చెప్పుకొచ్చారు. ‘మేం విద్య, వైద్యంపై ఖర్చుపెడుతున్నాం. ఇలా వ్యయం చేయడం అభివృద్ధే’ అని తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు లెక్కలు పంపుతూనే ఉంది. ఇప్పుడు... ఆ పార్టీ అదే తప్పుడు లెక్కలతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసేసింది. అందులో ‘రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తగ్గాయి’ అని చెప్పడం విశేషం. ఇదో పెద్ద అబద్ధం. ఎందుకంటే... రాష్ట్ర విభజన నాటికి నవ్యాంధ్ర వాటాగా వచ్చిన అప్పు దాదాపు రూ.లక్ష కోట్లు. ఆ తర్వాత ఐదేళ్లలో చంద్రబాబు సర్కారు 1.58 లక్షల కోట్లు అప్పు చేసింది. అంటే... వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అప్పు (పబ్లిక్‌ డెట్‌) రూ.2.58 లక్షల కోట్లు. కానీ... జగన్‌ సర్కారు మూడేళ్ల పాలనలోరాష్ట్ర పబ్లిక్‌ డెట్‌ రూ.4.13 లక్షల కోట్లకు చేరింది. కార్పొరేషన్‌ అప్పులు, పెండింగ్‌ బిల్లులు మరో లక్ష కోట్లకుపైగానే! మరి... సుప్రీంకోర్టుకు అప్పులు తగ్గాయని అధికార పార్టీ ఏ లెక్కన చెప్పిందో!


కార్పొరేషన్‌ అప్పుల మాటేమిటి?

‘రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను పాటిస్తోంది’ అని వైసీపీ చెప్పడం మరో పెద్ద జోక్‌! ఇది సుప్రీంకోర్టును పూర్తిగా తప్పుదారి పట్టించడమే. ఎందుకంటే... కేవలం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు చిక్కకుండా అప్పులు చేసేందుకే కార్పొరేషన్లను సృష్టించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి మరీ ఈ అప్పులు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌  (ఏపీఎ్‌సడీసీ) ద్వారా రూ.23,200 కోట్లు అప్పు తెచ్చారు. రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.6,000 కోట్లు అప్పు తెచ్చారు. ప్రస్తుతం సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రుణం రూ.42వేల కోట్లకు చేరుకుంది. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వం వాడుకున్నదే. మార్క్‌ఫెడ్‌ను ముందుపెట్టి వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రభుత్వమే వాడుకుంది. అలాగే, మారిటైమ్‌ బోర్డు ద్వారా రూ.5,000 కోట్ల అప్పులు తెచ్చి... ఆ డబ్బులూ తానే వాడేసుకుంది. తాజాగా బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు అప్పులివ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో... మార్కెట్లో ఎన్‌సీడీలు జారీ చేసి రూ.8,300 కోట్ల అప్పులు తెచ్చారు. ఇవికాకుండా విద్యుత్తు సంస్థల నాన్‌ గ్యారెంటీలోన్లే దాదాపు రూ.80,000 కోట్లు అప్పులున్నాయి. ఈ అప్పులన్నింటినీ తీర్చే శక్తిసామర్థ్యాలు ఆ సంస్థలకు లేవు. ప్రభుత్వం నుంచి ఏటా రావాల్సిన సొమ్ములు వాటికి అందడమే లేదు. అంటే... ఆ విద్యుత్‌ సంస్థల అప్పులను కూడా ప్రభుత్వ అప్పులుగానే భావించాల్సి ఉంటుంది.

 

అన్నీ దాచేసి...: కార్పొరేషన్ల అప్పులపై మూడున్నరేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం ఒక్కసారి కూడా తగిన సమాచారం ఇవ్వలేదు. కార్పొరేషన్ల అప్పులు చెప్పాలని ఏజీ కార్యాలయం అనేకసార్లు అడిగింది. ఇంకా అడుగుతూనే ఉంది. అయినా సర్కారు స్పందించడంలేదు. ఎందుకంటే... ఆ సమాచారం బయటపెడితే తప్పుడు అప్పులూ బయటికి వస్తాయి. ఇక రాష్ర్టానికి కొన్నేళ్లపాటు అప్పులు పుట్టవు. అప్పులు పుట్టని మరుసటి రోజే ప్రభుత్వం ఆర్థికంగా కుప్పకూలుతుంది. ఈ అప్పులన్నీ దాచేసి, లొసుగులన్నీ పూడ్చేసి  అప్పులు తగ్గాయి, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సక్రమంగా పాటిస్తున్నామని విజయసాయిరెడ్డి ఇంటర్వీన్‌ పిటిషన్‌ వేయడం  అత్యున్నత న్యాయస్థానం కళ్లకు గంతలు కట్టడమే!


ఏటా రూ.55,000 కోట్ల చెల్లింపులు

ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వం అప్పులపై అసలు, వడ్డీలు కలిపి ఏడాదికి రూ.54,000 కోట్ల నుంచి రూ.55,000 కోట్ల వరకు చెల్లిస్తోంది. ఇందులో కార్పొరేషన్ల అప్పుల అసలు, వడ్డీలే రూ.15,000 కోట్లకు పైగా ఉన్నాయి. పబ్లిక్‌ డెట్‌కి సంబంధించి చెల్లించాల్సిన వడ్డీలు రూ.24,000 కోట్ల వరకు ఉన్నాయి. వీటికి సంబంధించిన అసలు వాయిదా రూ.15,000 కోట్లకు పైమాటే.  గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,50,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.55,000 కోట్ల వరకు అప్పుల అసలు, వడ్డీల చెల్లింపులకే పోయింది. మిగిలిన మొత్తంతో  నెలానెలా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. అప్పు తేకుండా ఏ నెలా ఉద్యోగులకు జీతాలివ్వలేకపోతోంది. కేంద్రం అనుమతితో ఆర్‌బీఐ నుంచి తెస్తున్న అప్పులు చాలక వేల కోట్ల దొంగ అప్పులు తెస్తున్నారు. కాబట్టి ఏడాదికి కట్టాల్సిన అప్పుల అసలు, వడ్డీలే రూ.లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. 


ప్రభుత్వం వేయదా?

ఉచితాలపై రాష్ట్ర ప్రభుత్వంకంటే ముందుగా వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు రాష్ర్టానికి నోటీసు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకుని పార్టీ తరఫున పిటిషన్‌ ఎందుకు వేశారు? కోర్టుకు అబద్ధాలు చెప్పేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శులు, సీఎస్‌ వెనుకాడారా? అందుకే పార్టీ తరఫున విజయసాయి రెడ్డి పిటిషన్‌ వేశారా? అన్న అనుమానాలను కొందరు నిపుణులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రెస్‌మీట్లలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ చెప్పే తప్పుడు లెక్కలే విజయసాయి రెడ్డి వేసిన పిటిషన్‌లోనూ ఉన్నాయి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది కాబట్టి రాష్ట్రం కూడా పిటిషన్‌ వేస్తుందని... అందులో సాయిరెడ్డి పిటిషన్‌లో ఉన్న సమాచారమే ఉంటుందని మరికొందరు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-08-20T08:43:00+05:30 IST