మోదీకి కన్ను కుట్టింది

ABN , First Publish Date - 2022-07-17T08:58:39+05:30 IST

‘‘అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టింది. నిబంధనల పేరుతో ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారు.

మోదీకి కన్ను కుట్టింది

  • అందుకే.. తెలంగాణను ఆర్థికంగా అణచివేయాలని కుట్ర
  • 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ
  • తొలుత రూ.53 వేల కోట్లు అప్పు తెచ్చుకోవచ్చన్నారు
  • తర్వాత కుట్రపూరితంగా 23 వేల కోట్లకు కుదించారు
  • అప్పులతో దేశాన్ని దివాలా తీయిస్తున్నది కేంద్రమే
  • ధాన్యం కొనకపోవడం దుర్మార్గం.. ద్వంద్వ వైఖరి
  • రాష్ట్రంలోనూ ఉపాధి హామీ పథకం రద్దుకు కుట్ర
  • బీజేపీ జాతీయ నేతలది రాజకీయ దిగజారుడుతనం
  • తెలంగాణకు వ్యతిరేక నిర్ణయాలు సోషల్‌ మీడియాకు
  • పార్లమెంటు వేదికగా కేంద్రం తీరుపై గళమెత్తండి
  • కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకోండి
  • అవసరమైతే నేను కూడా ఢిల్లీకి వస్తాను
  • టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్‌
  • పీఎస్‌యూల భూములు మనకే.. వేలం అడ్డుకోండి
  • 16 అంశాలతో ఎజెండా.. ప్రతులు ఎంపీలకు


హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ‘‘అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోదీకి కన్ను కుట్టింది. నిబంధనల పేరుతో ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత వైఖరిని అనుసరిస్తోంది. దీనిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో గళం విప్పండి. బీజేపీ అసంబద్ధ వైఖరిని ఎండగట్టేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్సీపీ, డీఎంకే, ఆప్‌ తదితర కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకోండి’’ అని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అవసరమైతే తాను కూడా ఢిల్లీ వచ్చి కలిసొచ్చే విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతానన్నారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో జరిగింది. పార్టీ ఎంపీలంతా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే  కుట్రలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ‘‘దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నాయి.


 పరిధికి లోబడే తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు నడుపుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లలో ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్‌ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్‌ రికార్డు తెలంగాణ సొంతం. ఆర్బీఐ ఆధ్వర్యంలో జరిగే బిడ్ల వేలంలో తెలంగాణ బిడ్లకే ఎక్కువ డిమాండ్‌ పలుకుతున్న విషయం వాస్తవం కాదా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఏటా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం ప్రకటిస్తుందని, దానిపై ఆధారపడి ఆ తర్వాత రాష్ట్రాలు బడ్జెట్లను రూపొందించుకుంటాయని తెలిపారు. ‘‘ఈ క్రమంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం తెలంగాణ రూ.53 వేల కోట్ల రుణాలు తెచ్చుకోవచ్చని తొలుత కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా మాట మార్చింది. కక్షపూరితంగా అప్పుల్లో కోత కోసి పరిమితిని రూ.23 వేల కోట్లకు కుదించింది. ఇది కుట్ర కాదా?’’ అని ప్రశ్నించారు. ఇలాంటి దివాలాకోరు, తెలివితక్కువ వ్యవహారాలపై పార్లమెంటులో బీజేపీని నిలదీస్తూ.. దాని నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేయాలని ఎంపీలకు సూచించారు. 


ఎఫ్‌ఆర్‌బీఎం.. కేంద్రానికో రూలు.. రాష్ట్రాలకు మరొకటా?

అప్పులు తెచ్చుకోవడానికి నిర్దేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు కేంద్రానికి ఒక మాదిరి, రాష్ట్రాలకు మరో మాదిరి ఉండడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘రాష్ట్రాల జీఎ్‌సడీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పరిమితిని 3 శాతంగా విధించింది. కేంద్రానికి మాత్రం ఏకంగా 6.4 శాతంగా నిబంధనలు సడలించింది. ఇదెక్కడి న్యాయం? ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం వచ్చి 19 ఏళ్లయింది. 18 ఏళ్లపాటు కేంద్ర ప్రభుత్వాలు ఆ పరిధిని మించే అప్పులు చేశాయి. ఏటా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తనకు తానే సడలించుకుంటూ కేంద్రమే దేశాన్ని దివాలా తీయిస్తోంది. సవరణల పేరిట రాజ్యాం గ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ విషయాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లండి’’ అని నిర్దేశించారు. మిమ్మల్ని అడిగేవాళ్లు ఎవరూ లేరని అనుకుంటున్నరా? అంటూ కేంద్రంపై మండిపడ్డారు.  


ధాన్యం కొనకపోవడం దుర్మార్గం

తెలంగాణ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా కేంద్రం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని కేసీఆర్‌ మండిపడ్డారు. వడ్లు పండించాలని ఒకసారి, వద్దని మరోసారి, కొంటామని ఒకసారి, కొనడం లేదని మరోసారి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తప్పుబట్టారు. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్‌ పెరుగుతోందని, వరి ఎక్కువగా పండించాలంటూ నాలుగు రోజులుగా ప్రచారం చేస్తూ అయోమయానికి గురి చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ గోల్‌మాల్‌, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బెంగాల్‌ తరహాలో తెలంగాణలోనూ ఉపాఽధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. ఆ పథకాన్ని అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా అమలు చేస్తోందని ఇప్పటి వరకూ ప్రశంసిస్తూ వచ్చిన కేంద్రం ఇప్పుడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. విద్యుత్తు సంస్కరణలపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు ఆయన సూచించారు.


గోప్యంగా ఉంచాల్సిన అంశాలు సోషల్‌ మీడియాకా?

తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్‌ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉంచాల్సిన ఆర్థిక వ్యవహారాలను ఉద్దేశపూర్వకంగా లీక్‌ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం కక్షపూరిత చర్య అని మండిపడ్డారు. ఇదంతా రాజకీయ దిగజారుడుతనంతో బీజేపీ చేస్తున్న వ్యవహారమన్నారు. తెలంగాణ పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం చౌకబారు రాజకీయాలను ఆశ్రయించడం దురదృష్టకరమన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3,65,737 కోట్లు వెళితే.. కేంద్రం నుంచి తెలంగాణకు అందినవి రూ.1,96,449 కోట్లు మాత్రమేనని, దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. ఇందులోనూ రూ.1,17,797 కోట్లు రాష్ట్రాల వాటా కింద రాజ్యాంగబద్ధంగా వచ్చాయని, మిగిలిన 78 వేల కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయని తెలిపారు. అంటే, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా సగటున రూ.9000 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. ‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ఎందాక పోవాల్నో అందాకా పోవాల్సిందే’’ అని ఎంపీలకు నిర్దేశించారు. సమావేశంలో టీఆర్‌ఎ్‌సపీపీ నేత నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభ పక్ష నేత కె.కేశవరావు, ఎంపీలు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-17T08:58:39+05:30 IST