America ను అతలాకుతలం చేస్తున్న టోర్నడోలు.. 100 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం!

ABN , First Publish Date - 2021-12-13T16:44:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. టోర్నడోల దెబ్బకు పలు రాష్ట్రాలు, కౌంటీలు చిగురుటాకుల వణికిపోతున్నాయి.

America ను అతలాకుతలం చేస్తున్న టోర్నడోలు.. 100 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేస్తున్నాయి. టోర్నడోల దెబ్బకు పలు రాష్ట్రాలు, కౌంటీలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. టోర్నడో విధ్వంసంతో అగ్రరాజ్యంలో ఎటు చూసినా దెబ్బతిన్న భవనాలు, పైకప్పులు ఎగిరిపోయిన పరిశ్రమలు, కుప్పకూలిన స్తంభాలు, పడిపోయిన భారీ వృక్షాలతో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. టోర్నడో కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని అంచనా. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము దాకా.. ప్రధానంగా ఆరు రాష్ట్రాలపై టోర్నడోలు పంజా విసిరాయి. సుమారు 30 దాకా టోర్నడోలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించాయి. మరో రెండు రోజులు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికతో ప్రజలు భయపడుతున్నారు. 


టోర్నడోలు అంటే..?

టోర్నడోలు అంటే బలమైన సుడిగాలులు. ఉరుములకు అనుసంధానంగా ఏర్పడే ఈ సుడిగాలులు గంటకు ఏకంగా 300 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ఈ గాలుల ధాటికి భవనాలు ధ్వంసం కావడం, భారీ వృక్షాలు సైతం ధ్వంసం కావడం జరుగుతోంది. అందుకే భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. టోర్నడోలు సాధారణంగా నిమిషాల్లో శక్తిహీనమవుతుంటాయి. తాజా ఉదంతంలో మాత్రం అవి కొన్ని గంటల పాటు సాగాయి. అందువల్లే అది దాదాపు 322 కిలోమీటర్ల దూరం పయనించినట్లు తెలుస్తోంది. కాగా, అమెరికాలో ఏటా 1200 టోర్నడోలు సంభవిస్తున్నాయని సమాచారం. 


ఇక కెంటకీ రాష్ట్రం పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. భీకరమైన గాలులు పశ్చిమ కెంటకీలోని మాఫీల్డ్‌లో ఉన్న ఓ కొవ్వొత్తుల పరిశ్రమ పైకప్పును పూర్తిగా కూల్చేశాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో 110 మంది పనిచేస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బేషీర్‌ తెలిపారు. ఇక్కడ 50 మందిదాకా చనిపోయి ఉంటారని.. తమ రాష్ట్రంలో మొత్తం 70కిపైగా మరణాలు సంభవించి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మరణాల సంఖ్య 100ను దాటే ప్రమాదముందన్నారు. నిరాశ్రయులకు స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఆశ్రయం కల్పించామన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కెంటకీతో పాటు ఆర్క్‌న్సస్‌, ఇల్లినాయిస్‌, మస్సోరీ, మిసిసిప్పీ, టెనెస్సీ రాష్ట్రాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు కూడా కుప్పకూలింది. ఆ సమయంలో 100 మంది వరకు లోపల విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా టోర్నడోలు గంటకు 200 మైళ్ల వేగంతో విరుచుకుపడడంతో ఈ ఆరు రాష్ట్రాల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. చాలాచోట్ల రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్క కెంటకీలోనే 60 వేల ఇళ్లు అంధకారంలోకి జారుకున్నాయి. 


వందేళ్లలో ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో ఈ టోర్నడో నేలపై కొనసాగిందని సమాచారం. దీంతో భారీ నష్టం జరిగినట్లు అంచనా. యూఎస్‌లో డిసెంబరులో భీకర తుపాన్లు చాలా అరుదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఇదో కొత్త కేటగిరీ కిందకు వస్తుందని వారు చెబుతున్నారు. ఇక విపత్తుపై సమీక్ష నిర్వహించిన అధ్యక్షుడు జో బైడెన్.. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని బైడెన్‌ పేర్కొన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్లు ప్రకటించారు. అయితే, టోర్నడో ఇంతలా విరుచుకుపడటానికి వేడి వాతావరణం ఓ ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-13T16:44:05+05:30 IST