సీఎం తప్పిదాలతోనే మరణ మృదంగం

ABN , First Publish Date - 2022-01-30T08:49:45+05:30 IST

సీఎం కేసీఆర్‌ తప్పిదాల వల్లే రాష్ట్రంలో మరణ మృదంగం కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

సీఎం తప్పిదాలతోనే మరణ మృదంగం

రాష్ట్ర ప్రజల పాలిట యమ కింకరుడు కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

మహబూబాబాద్‌/మంచిర్యాల, జనవరి 29(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ తప్పిదాల వల్లే రాష్ట్రంలో మరణ మృదంగం కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల కారణంగా వివిధ వర్గాలకు చెందినవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజలు ఇష్టపడి ఎన్నుకున్న సీఎం కేసీఆర్‌ ప్రజల పాలిట యమకింకరుడిగా మారారని ధ్వజమెత్తారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మబలిదానాలతో సమస్యలు పరిష్కారం కావని, ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డ పర్వతగిరి మిర్చి రైతు నారమల్ల సంపత్‌, లక్ష్మాతండ గిరిజన రైతు అజ్మీర శ్రీను, నెల్లికుదురు మండలం సంధ్య తండాకు చెందిన ఉపాధ్యాయుడు బానోత్‌ జేత్‌రాం, బయ్యారానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్‌ కుటుంబాలను రేవంత్‌ శనివారం పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమాజం అశాంతి, అభద్రత నడుమ కొట్టుమిట్టడుతోందని వాపోయారు. 


ఉద్యోగుల పాలిట శాపంగా మారిన 317 జీవో రద్దుపై పార్లమెంట్‌లో నిలదీస్తామని స్పష్టం చేశారు.  మిర్చి పంటకు వైరస్‌ సోకి నష్టపోయిన రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారికి నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు కనీసం వైరస్‌ నియంత్రణకు శాస్త్రవేత్తలను అప్రమత్తం చేయకపోవడం దారుణమన్నారు. మరో 18 నెలలు ఓపిక పడితే వచ్చేది సోనియమ్మ రాజ్యం వస్తుందని, అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతుందని రేవంత్‌ భరోసా ఇచ్చారు. కాగా, కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం లేక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే)ను తెరపైకి తెచ్చాడని రేవంత్‌ అన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి ఉంటే పీకే లాంటి వ్యక్తుల అవసరం ఉండేదా? అని ప్రశ్నించారు. వరి పండిస్తే ఉరేనని భయపెట్టడంతో వరంగల్‌, ఖమ్మం రైతులు మిర్చి సాగు చేసి తీవ్రంగా నష్టపోయారన్నారు. 18 నెలల సమయంలో కేసీఆర్‌ను పొలిమేరలు దాటే వరకు తరుముతామని స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-30T08:49:45+05:30 IST