మరణ శాసనం

ABN , First Publish Date - 2021-02-25T05:41:13+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌, హసన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షబ్నమ్‌ది సైఫీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఉన్నత కుటుంబం. ఇద్దరు అన్నలు,

మరణ శాసనం

కన్నీటి  కథ

 ఆ ఊరి ప్రజలు ఆమె పేరును బహిష్కరించారు!

బంధువులు ఆ పేరున్న మనిషి మరణం కోసం ఎదురు చూస్తున్నారు! 

అంతటి ఏహ్యత సంపాదించుకున్న  ఆ పేరే... షబ్నమ్‌!

ఏడుగురు కుటుంబసభ్యులను ఊచకోత కోసి, ఉరికంబానికి అతి చేరువలో ఉన్న మహిళ ఆమె!

స్వతంత్ర భారతదేశంలో మరణశిక్ష ఎదుర్కోబోతున్న తొలి మహిళగా...

మన దేశ 70 ఏళ్ల చరిత్రలో ఉరికంబం ఎక్కబోతున్న మొట్టమొదటి మహిళగా వార్తల్లోకెక్కిన షబ్నమ్‌ అలీ కథ ఇది!


ఉత్తర్‌ప్రదేశ్‌, హసన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షబ్నమ్‌ది సైఫీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఉన్నత కుటుంబం. ఇద్దరు అన్నలు, వదినలు, తల్లిదండ్రులతో కలిసి జీవించే షబ్నమ్‌ ఇంగ్లీషు, జాగ్రఫీలలో డబుల్‌ ఎమ్మే చేసి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్థిరపడింది. ఆమె ఇంటికి ఎదురుగా ఉండే కలప యూనిట్‌లో రంపపు పని చేసే పఠాన్‌ కమ్యూనిటీకి చెందిన సలీంతో ఆమెకు ఏర్పడిన పరిచయం క్రమేపీ ప్రేమగా మారింది. వారి విషయం షబ్నమ్‌ కుటుంబీకులకు తెలియడంతో చీవాట్లు పెట్టి, ఆ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. అది ఇష్టం లేని షబ్నమ్‌ సలీంతో కలిసి కుటంబసభ్యుల హత్యకు పథకం రచించింది.


2008 ఏప్రెల్‌ 14 రాత్రి, పాలల్లో మత్తు మందు కలిపి, వారితో తాగించి, మత్తులోకి జారుకున్న తర్వాత అందర్నీ వరుసబెట్టి ఊచకోత కోసింది. ఆ హత్యలకు ప్రియుడు సలీం సహకరించాడు. చనిపోయిన వారిలో షబ్నమ్‌ తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, ఇద్దరు వదినలతో పాటు 10 నెలల వయసున్న మేనల్లుడు కూడా ఉన్నాడు. అందరూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత సలీంను దొడ్డిదారిన పంపించి, రక్తం అంటుకున్న దుస్తులు మార్చుకుని, ఇరుగుపొరుగుకు వినపడేలా కేకలు వేసింది. గుర్తు తెలియని వ్యక్తులు తన కుటుంబసభ్యులను అందరినీ పొట్టన పెట్టుకున్నారనీ, ఆ సమయంలో తను మేడ మీద గాఢ నిద్రలో ఉండడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాననీ నమ్మబలికింది. అయితే పోలీసు విచారణలో ఐదు రోజుల్లోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 



ఏ క్షణమైనా మరణశిక్ష 

కుటుంబంపై అంతటి దారుణానికి ఒడిగట్టిన సమయంలో షబ్నమ్‌ ఏడు నెలల గర్భవతి. అదే ఏడాది డిసెంబర్‌లో, జైల్లో ఆమె మగబిడ్డను ప్రసవించింది. అయితే దోషులకు పుట్టిన పిల్లలు ఆరేళ్లకు మించి జైల్లో ఉండే వీలు లేకపోవడం వల్ల, షబ్నమ్‌ కొడుకు తాజ్‌కు, ఉస్మాన్‌ సైఫీ అనే జర్నలిస్టు పెంపుడు తండ్రిగా వ్యవహరించి, పిల్లాడి పెంపకం బాధ్యతలు తీసుకున్నాడు. హత్యలు జరిగిన రెండేళ్ల తర్వాత, 2010లో అమ్రోహా సెషన్స్‌ కోర్టు షబ్నమ్‌, సలీంలకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను అలహాబాదు హైకోర్టులో షబ్నమ్‌ సవాలు చేసింది. 2013లో అలహాబాద్‌ హైకోర్టు ఆమెకు విధించిన మరణశిక్షను ధ్రువీకరించింది. 2015 మేలో సుప్రీం కోర్టు కూడా ఆ తీర్పుకు మద్దతు పలికింది. దాంతో చివరి ప్రయత్నంగా షబ్నమ్‌ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి క్షమాభిక్ష పిటీషన్‌ పెట్టుకున్నా, ప్రబణ్‌ దాన్ని తిరస్కరించారు.




తాజాగా షబ్నమ్‌ కొడుకు 12 ఏళ్ల మొహమ్మద్‌ తాజ్‌, తన తల్లికి క్షమాభిక్ష పెట్టవలసిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అప్పీలు చేసుకున్నాడు. ‘‘మా అమ్మను నేను ప్రేమిస్తున్నాను. ప్రెసిడెంట్‌ అంకుల్‌కు నాది ఒకే ఒక వినతి. అమ్మ ఉరిశిక్షను ఆయన ఆపాలి’’ అని రాసి ఉన్న పలకను చేతులతో ఎత్తి పట్టుకుని, అందరికీ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు.


ఇదిలా ఉంటే, ఉరిశిక్షకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా మధుర జైలుకు అమ్రోహా కోర్టు నుంచి ఆదేశాలు అందాయి. ఉరి తేదీ ఏ క్షణమైనా ఖరారు కావచ్చు. దాంతో మహిళలను ఉరి తీసే గది కలిగిన మధుర జైలులో ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. 2012 డిసెంబర్‌ ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కేసులో తలారిగా వ్యవహరించిన పవన్‌కుమార్‌, ఇప్పటికే మధుర జైలును సందర్శించి ఉరి ఏర్పాట్లను పర్యవేక్షించాడు. ఉరికి ఎటువంటి ఆటంకాలు తలెత్తకపోతే, 70 ఏళ్ల భారత చరిత్రలో ఉరిశిక్షను ఎదుర్కొన్న తొలి మహిళగా షబ్నమ్‌ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 



నేరంలో పలు కోణాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాకు 20 కిలోమీటర్ల దూరంలోని బావన్‌ఖేడీ గ్రామానికి చెందిన షబ్నమ్‌ది ఉన్నత కుటుంబం. ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో వీళ్లను మించిన విద్యాధికులు లేరు. షబ్నమ్‌ తండ్రి ఊరి పెద్ద, స్థానిక ఆర్ట్‌ కాలేజీలో టీచర్‌. పెద్ద అన్న రషీద్‌ జలంధర్‌లో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. చిన్న అన్న బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. విద్యావంతుల కుటుంబానికి చెందిన షబ్నమ్‌ ప్రేమించిన వ్యక్తి కోసమే కుటుంబం మొత్తాన్నీ పొట్టన పెట్టుకుందనే వాస్తవాన్ని ఇప్పటికీ ఆమె బంధువులు అంగీకరించలేకపోతున్నారు. ఈ హత్యల్లో ఆిస్తి కోణమే ప్రధానమనేది వారి వాదన. ప్రేమించిన వ్యక్తిని వదులుకోకూడదు అనుకుంటే అతనితో కలిసి షబ్నమ్‌ ఎక్కడికైనా పారిపోయి ఉండేది.


కానీ కుటుంబం మొత్తాన్నీ బలిగొనాల్సిన అవసరం లేదు. కుటుంబం మొత్తాన్నీ అంతం చేస్తే, ఆస్తంతా తానే దక్కించుకోవచ్చన్న ఆలోచనతో షబ్నమ్‌ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందనేది ఆమె బంధువుల వాదన.  పోలీసు విచారణ సమయంలో షబ్నమ్‌, సలీంలు ఒకరి మీద మరొకరు నిందారోపణలు చేసుకున్నారు. షబ్నమ్‌ పిలవడంతోనే తాను అక్కడకు వెళ్లాననీ, అప్పటికే ఆమె కుటుంబం మొత్తాన్నీ ఊచకోత కోశానని తనతో చెప్పినట్టు సలీం చెప్పుకొచ్చాడు. కానీ షబ్నమ్‌ తాను గాఢ నిద్రలో ఉండగా సలీం చేతిలో కత్తితో పైకప్పు నుంచి ఇంట్లోకి చొరబడి, మా కుటుంబం మొత్తాన్నీ పొట్టన పెట్టుకున్నాడనీ పోలీసులకు వివరించింది. అయితే హత్య ప్రణాళికలో భాగంగా సలీం మత్తు మాత్రలను కొనుగోలు చేసినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్యలకు ముందు, తర్వాత షబ్నమ్‌, సలీంల మధ్య ఫోన్‌ కాల్స్‌ డాటాను కూడా సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు, ఇతర వివరాల సహాయంతో నేరాన్ని నిర్థారించారు.     



షబ్నమ్‌ పేరు పెట్టుకోరు

ఏళ్లు గడిచినా ఆ హత్యోదంతం ప్రభావం బావన్‌ఖేడీ గ్రామాన్ని వీడిపోలేదు. ఆ దుర్ఘటన తర్వాత ఏ ఒక్కరూ తమ పిల్లలకు షబ్నమ్‌ అనే పేరు పెట్టుకోలేదు. ఆ కాళరాత్రి తర్వాత ఆ ఊళ్లో ఒక్క షబ్నమ్‌ కూడా పుట్టలేదు.




మరణశిక్ష వరుసలో...

నేషనల్‌ లా యూనివర్శిటీ 2016 నివేదిక ప్రకారం ప్రస్తుతానికి మనదేశంలో మొత్తం 12 మంది మహిళలు మరణశిక్ష ఎదుర్కొనే వారి జాబితాలో ఉన్నారు. వీరిలో 1990 - 1996 మధ్యలో పిల్లల కిడ్నాప్‌, హత్య నేరంలో మరణ దండనకు గురై, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్‌ తిరస్కరణకు గురైన రేణుకా షిండే, సీమా మోహన్‌ గావిట్‌ అనే అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. ఈ హత్యలో వీళ్ల తల్లి అంజనా పాత్ర కూడా ఉంది. అయితే 1996లో అరెస్టయిన రెండేళ్ల తర్వాత అంజనా మరణించింది.


Updated Date - 2021-02-25T05:41:13+05:30 IST