క్వారీలపై.. ‘డెడ్‌ రెంట్‌’ బాంబు!

ABN , First Publish Date - 2021-08-27T08:36:25+05:30 IST

గనుల యజమానులతో జగన్‌ సర్కారు చెడుగుడు ఆడుతోంది. అడ్డగోలుగా జరిమానాలు విధించడమే..

క్వారీలపై.. ‘డెడ్‌ రెంట్‌’ బాంబు!

ఏకంగా 16 రెట్లు పెంపు

క్వారీ నడవకున్నా అద్దె కట్టాల్సిందే

ఇందులో ఐదు రెట్లు డిపాజిట్‌ చేయాలి

ఇంకో నెల అద్దె అడ్వాన్సుగా చెల్లించాలి

గనులను వదులుకునేలా చేసేందుకే?

చిన్న చిన్న వాళ్లను తరిమేసిపెద్దలకు కట్టబెట్టే ఎత్తుగడ!!

క్వారీ, మెటల్‌ నిర్వాహకుల గగ్గోలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): గనుల యజమానులతో జగన్‌ సర్కారు చెడుగుడు ఆడుతోంది. అడ్డగోలుగా జరిమానాలు విధించడమే గాకుండా.. ఇప్పుడు డెడ్‌ రెంట్‌ పేరుతో వారిని పీల్చిపిప్పి చేయాలని నిర్ణయించింది. క్వారీలు నడవకున్నా లక్షల్లో అద్దె చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వారంత వారు వాటిని వదిలేసుకునే పరిస్థితులు కల్పిస్తోంది.


చిన్న గనుల యజమానులపై వైసీపీ ప్రభుత్వం ‘డెడ్‌ రెంట్‌’ రూపంలో పే..ద్ద బాంబు వేసింది. వారు చెల్లించాల్సిన అద్దెను.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 రెట్లు పెంచేసింది. క్వారీలు నడవకున్నా అద్దె మాత్రం కట్టాల్సిందే. దీనినే డెడ్‌ రెంట్‌ అంటారు. గతంలో ఒక హెక్టారుకు గ్రావెల్‌ క్వారీకి సుమారు రూ.20 వేల డెడ్‌ రెంట్‌ ఉందనుకుంటే.. ఇప్పుడు దానిని 16 రెట్లు అంటే రూ.3.2 లక్షలు చెల్లించాలన్న మాట. ఇందులో రూ.లక్ష (ఐదు రెట్లు) డిపాజిట్‌గా కట్టాలి. మరో నెల అద్దె (రూ.20 వేలు) అడ్వాన్సుగా చెల్లించాలని ఇటీవల ఆదేశాలు జారీచేసింది. క్వారీ నడవకున్నా ఇంతింత చెల్లించడం కంటే దానిని వదులుకోవడమే ఉత్తమమన్న స్థాయికి చిన్న క్వారీదారులను తెచ్చేస్తున్నారు. మరోవైపు.. పలు క్వారీలకు గత కొంతకాలంగా పర్యావరణ అనుమతులే ఇవ్వడం లేదు. వాటికోసం ఎదురుచూస్తూ.. ఎప్పుడో ఒకప్పుడు రాకపోతాయా అన్న ఆశతో ఇన్నాళ్లూ డెడ్‌రెంట్‌ను కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దానిని అమాంతం 16 రెట్లు పెంచడంతో క్వారీదారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని గనుల లీజుదారులు వాపోతున్నారు. ఎక్కడైనా 25 శాతమో, 50 శాతమో పెంచుతారని.. కానీ 1600 శాతం పెంచడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న లీజుదారులను తప్పించేసి.. గనులన్నీ పెద్దల చేతుల్లోకి తీసేసుకోవడానికే ఈ ఎత్తుగడ వేశారా అన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు అప్పుడే క్షేత్ర స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేశారు. 


అభివృద్ధి పనుల్లేవు.. ఆపై కొవిడ్‌..

క్వారీలకు గత రెండేళ్ల నుంచి పెద్దగా డిమాండ్‌ లేదనే వాదన ఉంది. ఒకపక్క అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించడం, మరోపక్క కరోనా కారణంగా డిమాండ్‌ తగ్గింది. ఇదే సమయంలో ఇసుక, సిమెంటు తదితర ధరలూ పెరగడంతో నిర్మాణ కార్యక్రమాలు తగ్గాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైంది. సొంతింటి నిర్మాణాలు గానీ, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు గానీ కొత్తగా ప్రారంభించడం చాలామంది మానేశారు. ఈ ప్రభావం స్టోన్‌ క్రషర్లు, గ్రావెల్‌, రోడ్డు మెటల్‌ తదితర గనుల లీజులపైనా పడింది. ఇలాంటి స్థితిలో డెడ్‌ రెంట్‌ను భారీగా పెంచేయడం దారుణమని లీజుదారులు అంటున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల వరకు రోడ్డు మెటల్‌, గ్రావెల్‌, స్టోన్‌ క్రషర్లు భారీగా ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ క్వారీలు ఎక్కువే ఉన్నాయి. వీటిపై కేవలం యజమానులే కాకుండా.. లారీల యజమానులు, కూలీలు ఆధారపడి ఉన్నారు. ఒక్కో స్టోన్‌ క్రషర్‌పై వందల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచన ఉంటే.. ఎంతో కొంత పెంచడంలో తప్పులేదని.. కానీ ఇంత భారీ బాంబు వేయడం ఏమిటని వాపోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున డెడ్‌ రెంట్‌ పెంచడం వల్ల మళ్లీ ఆ భారం కూడా వినియోగదారులపైనే పడితే ఇంక అంతే సంగతులు. ఇప్పటికే పెరిగిన ఇసుక, సిమెంట్‌ ధరలకు తోడు కంకర ధరలు కూడా ఆకాశానికంటితే ఇక నిర్మాణాల సంగతి దేవుడెరుగు అన్నట్లుగా పరిస్థితి తయారవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


మరోవైపు పర్యావరణ నిబంధనలు కఠినంగా ఉండడంతో చాలామంది క్వారీదారులు తాము లీజు తీసుకున్న గని విస్తీర్ణాన్ని ఐదు హెక్టార్లలోపునకు కుదించుకుంటున్నారు. ఐదు హెక్టార్లలోపు మైనర్‌ మినరల్స్‌ అయితే పర్యావరణ నిబంధనలు సరళంగా ఉండడమే దీనికి కారణం. ఇలా తగ్గించుకుందామనుకున్నవారిమీదా డెడ్‌రెంట్‌ ప్రభావం పడనుంది. డిపాజిట్‌ను ఐదు రెట్లు పెంచి కట్టాలి. ఇప్పటికే కట్టింది ఉంటే.. ఐదు రెట్ల మొత్తంలో నుంచి దానిని తీసివేసి మిగతా మొత్తం కట్టాల్సిందే. అదేవిధంగా కొందరు లీజు మంజూరైనా.. అనేక ఇబ్బందుల వల్ల మైనింగ్‌ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటివారంతా మైనింగ్‌ చేయకున్నా ఇంత భారీగా డెడ్‌రెంట్‌ కట్టాలంటే సాధ్యమవుతుందా? ప్రభుత్వం కూడా ఆలోచించి సవరణలు చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2021-08-27T08:36:25+05:30 IST