సాహితీవేత్త డాక్టర్‌ తిరునగరికి ‘దాశరథి’ పురస్కారం

ABN , First Publish Date - 2020-07-20T09:17:42+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్యకవి డాక్టర్‌ తిరునగరి రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య సాహితీ

సాహితీవేత్త డాక్టర్‌ తిరునగరికి ‘దాశరథి’ పురస్కారం

  • దాశరథితో 20ఏళ్ల సాన్నిహిత్యం: తిరునగరి

యాదాద్రి/హైదరాబాద్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, పద్యకవి డాక్టర్‌ తిరునగరి రామానుజయ్యకు దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న దాశరథి జయంతి సందర్భంగా అవార్డుతో పాటు నగదు బహుమతిని కూడా అందజేయనుంది. డాక్టర్‌ తిరునగరి.. తెలుగు, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యులు. అయిదు దశాబ్దాలుగా మానవీయ, ఆధ్యాత్మిక, జీవనతత్వం, మానవ సంబంధాల గురించి తన కవిత్వం, పద్యాలు, ప్రసంగ వ్యాసాల్లో చాటిచెబుతున్నారు. ’సముద్ర మథనం’ వచన కవిత్వ సంపుటి, ’తిరునగరీయం’ పద్య కవిత్వాన్ని ఇటీవలే ఆయన వెలువరించారు. 1945లో జన్మించిన తిరునగరి.. జూనియర్‌ లెక్చరర్‌గా 1999లో ఉద్యోగ విరమణ చేశారు. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేట కాగా, ఉద్యోగరీత్యా ఆలేరులో స్థిరపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చింతల్‌లో తన కుమారుడితో కలిసి ఉంటున్నారు.


దాశరథితో 20 ఏళ్ల సాన్నిహిత్యం

దాశరథి కృష్ణమాచార్యతో తనకు 20 ఏళ్ల సాన్నిహిత్యం ఉందని ‘ఆంధ్రజ్యోతి’తో తిరునగరి రామానుజయ్య చెప్పారు. తాను అమితంగా అభిమానించే వ్యక్తి, గురువు దాశరథి కృష్ణమాచార్య అని, ఆయన అవార్డుకు ఎంపిక కావడం జ్ఞానపీఠ్‌ అవార్డు పొందినంత ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 100కిపైగా అవార్డులు అందుకున్నా.. దాశరథి పురస్కారం ప్రత్యేకమైనదని చెప్పారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-07-20T09:17:42+05:30 IST