జాంబవంతుల రాజ్యం

ABN , First Publish Date - 2021-02-21T17:30:54+05:30 IST

దీవుల్ని చూడాలంటే మాల్దీవులకు వెళతాం. బీచ్‌ల కోసం గోవాకు చెక్కేస్తాం. సఫారీ చేస్తే ఆఫ్రికాలోనే చేయాలనుకుంటాం. కానీ, మన తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఒక ప్రత్యేకమైన అభయారణ్యం ఉంది. ఆసియా ఖండంలోనే ఇలాంటిది మరొకటి లేదంటే...

జాంబవంతుల రాజ్యం

దరోజీ కరడీధామ

దీవుల్ని చూడాలంటే మాల్దీవులకు వెళతాం. బీచ్‌ల కోసం గోవాకు చెక్కేస్తాం. సఫారీ చేస్తే ఆఫ్రికాలోనే చేయాలనుకుంటాం. కానీ, మన తెలుగు రాష్ట్రాలకు పొరుగున ఒక ప్రత్యేకమైన అభయారణ్యం ఉంది. ఆసియా ఖండంలోనే ఇలాంటిది మరొకటి లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే ఎక్కడెక్కడి నుంచో దీన్ని చూసేందుకు తరలొస్తారు పర్యాటకులు. విదేశీయులైతే పనిగట్టుకుని మరీ వస్తారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆ పర్యాటక ప్రాంతం కర్ణాటకలోని దరోజీ కరడీధామ. ఇది కేవలం ఎలుగుబంట్ల కోసం వెలసిన అరుదైన అభయారణ్యం. సుమారు ఐదువేల ఎకరాల్లో వెలసిన ఈ వింత జాంబవంతుల రాజ్యాన్ని ప్రత్యక్షంగా తిలకించవచ్చు..


అడవిని చూసినప్పుడల్లా మరిచిపోయిన పుట్టినిల్లులా అనిపిస్తుంది. అడవితో తెలియని మార్మిక బంధమేదో గుర్తుకొస్తూ ఉంటుంది. బహుశా మన ఆదిమానవుని జీవన మూలాలు ఆ అడవి నుంచే మొదలయ్యాయనేమో?.. సరిగ్గా ఇలాంటి వాక్యాలు ప్రముఖ నవలా రచయిత డా.కేశవరెడ్డి రాసిన ఒక నవలలో కనిపిస్తాయి. అడవి ఆదిమానవుని తొలి ఆవాసం. అంటే మన తాతముత్తాతలు, వాళ్ల పూర్వీకులు, మరికొన్ని తరాలు, అంతకు ముందున్న ఆదిమజాతి అక్కడి నుంచే మొదలైంది కదా!. ఇరుకిరుకు నగరాల్లో బతుకుతున్న మనలో ఇంకా ఆ జీవారణ్య జన్యు మూలాలు శిథిలం కాలేదు. అందుకే అడవిని చూస్తూనే అంతులేని ఆనందం కలుగుతుంది. అరణ్యం మానవ పూర్వాశ్రమంలా అనిపిస్తుంది. ఆ చెట్లుపుట్టల మధ్య తిరుగాడుతుంటే... పుట్టింటికి వెళ్లిన అనుభూతిని పొందుతాం. పచ్చటి చెట్లు, నిశ్శబ్ధ వాతావరణం, కొండలు, గుట్టలు, రాళ్లు, జంతువులు, పక్షుల మధ్య కాసేపు ఊపిరి పీల్చుకుంటే చాలు.. ఒత్తిడి మటుమాయం అవుతుంది. అందుకే కొందరు సముద్రతీర అందాలను చూసి సంతోషించవచ్చు, మరికొందరు ఆలయాల దర్శనంతో తరించవచ్చు... కానీ, అరణ్య పర్యటనతో అందరూ ఆనందిస్తారు. ప్రకృతి అంటే పరవశించని వారుండరు. స్వేచ్ఛగా, సహజంగా జీవించే జంతువులు, పక్షుల్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు కలిగే అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే - కర్ణాటకలోని హంపి, బళ్లారిలకు నడుమ ఉన్న ఎలుగుబంట్ల అభయారణ్యం ‘దరోజీ కరడీధామ’కు ప్రపంచ పర్యాటకులందరూ తరలివస్తుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఆసియాలోనే ఏకైక ఎలుగుబంట్ల అభయారణ్యం ఇది. ఒకరకంగా చెప్పాలంటే మనకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా సఫారీలాంటిదన్న మాట. 


మనకు తెలియని అభయారణ్యం..

భారత్‌లో ఈ మాత్రమైన జీవ వైవిధ్యం ఉందంటే కారణం - విశాలమైన అభయారణ్యాలు. మన దేశంలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్‌, రాజస్తాన్‌లోని రణథంబోర్‌, కర్ణాటకలోని బండీపూర్‌, అస్సోంలోని కజిరంగా, పశ్చిమబెంగాల్‌లోని సుందర్‌బన్స్‌, గుజరాత్‌లోని గిర్‌, కేరళలోని సైలెంట్‌వ్యాలీ. మహారాష్ట్రలోని తడోబా... తదితర జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు చాలా ఉన్నాయి. వీటి పుణ్యాన రకరకాల పక్షులు, పులులు, ఏనుగులు, సింహాలు, నెమళ్లు, జింకలు ఎన్నో వైవిధ్యమైన జీవులు ఇంకా బతికిబట్టకడుతున్నాయి. జీవవైవిధ్యం అంతరించిపోవడం లేదు. లక్షల ఎకరాల్లో విస్తరించిన ఈ అరణ్యాలు కేవలం పక్షులు, జంతువుల ఆవాసాలుగానే కాదు, మానవాళికి ప్రాణవాయువును అందిస్తున్న సంజీవనిగా ఉపయోగపడుతున్నాయి. వాతావరణ సమతుల్యత ఈ మాత్రమైనా ఉంది. భూగోళ ఉష్టోగ్రతలు పెరగకుండా, కరువుకాటకాలు రాకుండా, వర్షాభావం తలెత్తకుండా కాపాడుతున్నది ఈ జంతు ఆవాసాలైన అడవులే. కొన్ని జంతువులు, పక్షులు కొన్ని ప్రాంతాలకే పరిమితం. అందుకు భౌగోళిక పరిస్థితులు, వాతావరణం కారణం. కర్ణాటకలోని బళ్లారి, హంపీల మధ్య ఉన్న దరోజీ పరిసరాలు వందల ఏళ్ల నుంచీ ఎలుగుబంట్లకు ప్రసిద్ధి. అందుకు కారణాలను ఇప్పటికీ పరిశోధకులు అన్వేషిస్తూనే ఉన్నారు. ఎంతోమంది వన్యప్రాణుల ప్రేమికులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు అధ్యయనాలు చేసి, విలువైన పుస్తకాలను, డాక్యుమెంటరీలను సైతం తీసుకొచ్చారు. ఆసియా ఖండంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఎలుగుబంట్లు ఎందుకు నివశిస్తున్నాయనేందుకు ఆధారాలు లేకపోయినా... ఇతిహాసాల మూలాలు ఉన్నాయంటున్నారు ఆ ప్రాంతవాసులు.


దీనికీ ఓ చరిత్ర ఉంది..

రామాయణ కాలం నాటికి వెళితే - వాలి, సుగ్రీవుల రాజ్యం కిష్కింధ. శ్రీలంకలో రావణుడు బంధించిన సీతమ్మను వెతుక్కుంటూ వెళుతున్న రాముడు కిష్కింధలోనే వానరసైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే!. అయితే ఈ వానర సైన్యంలో ఉన్నది ఒకే ఒక్క ఎలుగుబంటు. దాని పేరు జాంబవంతుడు. ఆ వంశానికి కేంద్రంగా ‘దరోజీ కరడీధామ’ను పేర్కొంటున్నారు స్థానికులు. ‘కరడీ’ అంటే ఎలుగుబంటు. ఇతిహాస ప్రాచుర్య మూలాలు ఇక్కడున్నాయన్నది వారి అభిప్రాయం. అందుకే ఒకే ప్రాంతంలో ఇన్నేసి ఎలుగుబంట్లు ఉన్నాయన్నదీ ఒక వాదన. తుంగభద్ర ఆనకట్టకు సమీపంలో నీటివనరులుండటం వల్ల ఈ ప్రాంతంలోనే ఎక్కువగా నివశిస్తున్నాయి ఎలుగుబంట్లు. కరోనా లాక్‌డౌన్‌ తరువాత అడవుల్లోని క్రూరమృగాలు, జంతువులు నగరాలు, పట్టణాల వీధుల్లో కనిపించడం చూశాం. ఆ వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, లాక్‌డౌన్‌ మూలంగా మనుషుల అలికిడి తక్కువ కావడం వల్ల... అడవి జంతువులు ఇలా ఊళ్ల మీద పడ్డాయి. అయితే కర్ణాటకలో ముప్పయి ఏళ్ల కిందటే ఇలాంటి సమస్య వచ్చింది. ప్రసిద్ధ చారిత్రక పర్యాటక కేంద్రమైన హంపీ పరిసరాల్లోని మెట్టప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించేవి. దరోజీ గ్రామం నుంచి హొస్పేట తాలూకా రామసాగరం వరకు కొండలు, గుట్టలు, గుహలు విస్తరించి ఉంటాయి. ఇవే ఆ జంతువులకు ఆవాసకేంద్రాలు.


అలా పుట్టింది ..

జీవవైవిధ్యంలో జంతువుల ప్రాధాన్యం ఎనలేనిది కానీ పొలాల్లో అవి కలిగించే నష్టం అంతాఇంతా కాదు. చిన్న రైతులు చితికిపోయేవారు. అడవులకు సమీపంలోని ఊళ్లలో రైతులు నిత్యం ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇది. దరోజీ చుట్టుపక్కల చెరకు, అరటి తోటలను ఎక్కువగా సాగు చేస్తారు. అడవుల్లో తిండిలేని ఎలుగుబంట్లు తరచూ తోటల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేయడమే కాకుండా.. రైతులపైన దాడులకు దిగేవి. ఎలుగుబంట్ల దాడిలో కొందరు రైతులు మరణించిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఇక, చేసేది లేక ప్రాణాపాయం తలెత్తినప్పుడు వాటిని కొట్టి చంపేవాళ్లు రైతులు. ఇలా నిత్యం గ్రామస్థులు, ఎలుగుబంట్ల మధ్య పెద్ద యుద్ధమే జరిగేది. ఈ విషయం సండూరు సంస్థానానికి చివరి రాజు కుమారుడైన మురారిరావు యశ్వంతరావు ఘోర్పడే (ఎంవై ఘోర్పడే) దృష్టికి వెళ్లింది. స్వతహా ప్రకృతి ప్రేమికుడైన ఆయన తీవ్రంగా స్పందించాడు. ఎలుగుబంట్లను ఇలాగే చంపుకుంటూ పోతే ఈ ప్రాంతంలో ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించాడు. ఎలాగైనా ఆ జాతిని కాపాడాలని పూనుకున్నాడు. ఫలితంగా బళ్లారి జిల్లా సండూరు తాలూకాలోని దరోజీ గ్రామానికి అనుబంధంగా ఎలుగుబంట్ల కోసం ఒక సంరక్షణ కేంద్రం వెలసింది. అదే ‘దరోజీ కరడీధామ’. కర్ణాటక అటవీశాఖ ఆధ్వర్యంలోని కమలాపురా వైల్డ్‌లైఫ్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోకి వస్తుందీ ప్రాంతం. ఒకప్పుడిది సాగుకు పనికి రాని బంజరుభూమి. నీటిజాడలు లేవు. వర్షపాతం చాలా తక్కువ. పొడి వాతావరణం కలిగి ఉండేది. కర్ణాటక ప్రభుత్వ చొరవతో అడవుల్ని పెంచారు అటవీశాఖ అధికారులు. చెట్లు ఏపుగా పెరిగాయి. పచ్చదనం పరుచుకుంది. 


కనువిందు చేసే జీవవైవిధ్యం

ఎలుగుబంట్ల అభయారణ్యం సుమారు 82.7 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీనిని ప్రత్యేకంగా ఎలుగుబంట్ల సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం విశేషం. సుమారు పాతికేళ్ల కిందట అంటే - 1994 అక్టోబర్‌ 17న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దరోజీ కరడీధామ సందర్శకులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎలుగుబంట్ల శాంక్చురీ అయినప్పటికీ - ఇక్కడ చిరుతపులులు, హైనాలు, నక్కలు, నెమళ్లు, అడవిపందులు, ముళ్ల పందులు, పాంగోలియన్‌లు, నక్షత్ర తాబేళ్లు, కోతులు, కుందేళ్లు... ఇలా రకరకాల జంతుజాలం జీవిస్తోంది. ఇదివరకటితో పోల్చితే వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇంచుమించు 70 రకాల పక్షులు కనువిందు చేస్తాయిక్కడ. రంగురంగుల సీతాకోక చిలుకలు ప్రత్యేక ఆకర్షణ. దరోజీ సహజంగా ఏర్పడిన అభయారణ్యం. మెట్టప్రాంతం. రాళ్లురప్పలు, కొండలు గుట్టలు, ముళ్ల పొదలు, గుహలు ఎక్కువ. పెద్ద పెద్ద బండరాళ్ల మాటున ప్రకృతి సహజంగా ఏర్పడిన గుహలు ఎలుగుబంట్లకు అద్బుతమైన ఆవాసాలుగా ఏర్పడ్డాయి. 


ప్రత్యక్షంగా తిలకించవచ్చు..

దరోజీ కరడీధామ అభయారణ్యంలో ఎలుగుబంట్లను ప్రత్యక్షంగా చూడటం కొత్త అనుభవం. అయితే వీటిని తిలకించేందుకు ఎంతో సహనం అవసరం. గంటల తరబడి నిరీక్షించాలి. అరణ్యంలో కరడికల్లు గుట్టకు ఎదురుగా ఒక వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానిపైకి ఎక్కి బల్లలపై నింపాదిగా కూర్చుని, బైనాక్యులర్స్‌తో దూరంగా ఉన్న ఆ జంతువులను దగ్గరగా చూడొచ్చు. టవర్‌ నుంచి చూస్తే మొత్తం అభయారణ్యం కనువిందు చేస్తుంది. ఈ అపురూప దృశ్యం చూసేందుకు విదేశీ పర్యాటకులు సైతం వస్తుంటారు. ‘‘వీటిని చూడాలంటే ఓపిక అవసరం. అడవుల్లోని బండరాళ్లు, పొదల మాటున సేదతీరుతుంటాయి ఎలుగుబంట్లు. అవి ఎప్పుడంటే అప్పుడు బయటికి రావు.  గుహలు, పొదల్లో నుంచీ బయటికి వచ్చే సమయం ఒకటి ఉంటుంది. ఎలుగుబంట్ల జీవనశైలి ప్రత్యేకమైనది. అవి పగలంతా బద్దకంగా, మగతగా ఒకే చోట ఉండిపోతాయి. రాత్రి పొద్దుపోయే ముందు వేటాడటం, పగలంతా విశ్రాంతి తీసుకోవడం వీటి లక్షణం. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆహారం కోసం బయటికి వస్తాయి. అప్పుడు మాత్రమే సందర్శకులు చూడొచ్చు...’’ అన్నారు అటవీశాఖ ఉద్యోగులు. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే ఆ జీవులను చూస్తున్నప్పుడు ఆఫ్రికాలో సఫారీ చేసిన అనుభూతి కలుగుతుందంటారు పర్యాటకులు. ‘అభివృద్ధి అనేది అభయారణ్యాలను కూడా మింగేస్తోంది. దరోజీకీ ఆ ముప్పు తప్పడం లేదు. సుమారు ఐదువేల ఐదొందల ఎకరాల్లో స్వేచ్ఛగా జీవిస్తున్న ఎలుగుబంట్లకు అక్రమ గనుల తవ్వకాలు హాని కలిగిస్తున్నాయి. ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి మన పుట్టినిల్లు కాబట్టి అప్పుడప్పుడు వెళ్లి ఆ అనుబంధాన్ని గుర్తుచేసుకుని.. పర్యాటకం పూర్తయినట్లు భావించకుండా... ఆ మూగజీవాలను ప్రేమిద్దాం. అభయారణ్యాల్ని కాపాడదాం. ఒకప్పుడు మనం కలిసి బతికిన జంతుజాలం బంధుగణం అయితే.. అడవి మన ఆత్మబంధువు. 

- అబ్దుల్‌ రజాక్‌, బెంగళూరు


విలక్షణ జంతువు

ప్రతి జంతువుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఎలుగుబంట్లకు కూడా ఎన్నో విలక్షణ లక్షణాలు ఉన్నాయి. ఇవి మూడు అడుగుల ఎత్తు, ఆరు అడుగుల పొడవుతో ఉంటాయి. వీటి వెనక కాళ్ల కంటే ముందు కాళ్లు కాస్త పొడవు ఎక్కువ. దాంతో సులభంగా చెట్లు కూడా ఎక్కగలవు. శరీరం మొత్తం నల్లబొచ్చు కప్పుకుని భీతి గొలిపేలా కనిపిస్తాయి. మగవి 140, ఆడవి 75 కిలోల బరువు పెరుగుతాయి. మగ, ఆడ ఎలుగుబంట్లు వేసవి కాలంలో మాత్రమే శారీరక కలయికకు ప్రయత్నిస్తాయి. జత కట్టే సమయంలో పోట్లాటకు దిగడం వీటి స్వభావం. వేసవిలో కలిసి శీతాకాలంలో పిల్లల్ని కంటాయి. ఆడది రెండు మూడు పిల్లలకు జన్మనిస్తుంది. తల్లి తన పిల్లలను కనీసం రెండుమూడేళ్లు కంటికి రెప్పలా కాపాడుతుంది. వీటి జీవిత కాలం నలభై నుంచీ యాభై ఏళ్లు. ముఖ్యంగా రాత్రి పూట సంచరించే జంతువులివి. శాఖాహారమే ఎక్కువ ఇష్టంగా తింటాయి. పండ్లు, తేనె, చెదలు, దుంపలు, కీటకాలు, చెరకు, మొక్కజొన్న, ఇప్ప పండ్లు వంటివన్నీ వీటికి ఆహారం. వీటికి కళ్లు, చెవులు చాలా చిన్నవి. వినికిడి శక్తి తక్కువ. చూపు కూడా అంతంత మాత్రమే. అయితే పొడవాటి మూతికున్న ముక్కు మాత్రం ఎంత దూరం నుంచైనా వాసన పసిగట్టగలదు.


ఈ యువరాజుదే ఆలోచన 

‘దరోజీ కరడీధామ’ ఏర్పాటుకు సండూరు యువరాజు ఒక కారణంగా చెబుతారు. సండూరు సంస్థానంలో చివరి రాజు కుమారుడైన మురారిరావు యశ్వంతరావు ఘోర్పడే కర్ణాటక రాజకీయ నేతల్లో ప్రముఖుడు. అక్కడి ప్రజలకు ఆయన ఎంవై ఘోర్పడేగా సుపరిచితులు. సండూరు యువరాజుగా పేరొందిన ఆయనకు  వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రం పట్టా పుచ్చుకున్న ఘోర్పడే చాలాకాలం పాటు సండూరు మాంగనీస్‌, ఐరన్‌ ఓర్‌ కంపెనీ చైర్మన్‌గా సేవలందించారు. రాయచూరు ఎంపీగా కూడా పనిచేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా సేవలందించిన ఆయన ఒకసారి అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీస్తున్నప్పుడు తీవ్ర గాయాలతో ఉన్న ఓ ఎలుగుబంటును చూశాడు. సమీపంలోని గ్రామస్థులు తమ పంటలను నాశనం చేస్తున్నదని దాన్ని తీవ్రంగా గాయపర్చినట్లు తెలుసుకున్నాడు. తరచూ ఇలాంటి ఘటనలు ఆయన దృష్టికి వస్తూనే ఉండేవి. ఇప్పుడు కళ్లారా చూశాక గుండె తరుక్కుపోయింది. ఆ మూగజీవి ప్రాణం కూడా మనిషి ప్రాణం లాంటిదే కదా. ఈ భూమ్మీద వాటికీ నివశించే హక్కు ఉంది కదా... అనిపించింది. తమ ప్రాంత ప్రత్యేకతను చాటుతున్న ఎలుగుబంట్ల రక్షణకు ఏదైనా చేయాలనుకున్నాడు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెదికే ప్రయత్నంలో ఆయన ఎంతో కృషి చేశాడు. ఆ కారణంగానే ప్రత్యేక ఎలుగుబంట్ల అభయారణ్యం ఆవిర్భవించింది. ఇది ఏర్పడ్డాక ఇటు ఎలుగుబంట్లకు ఆహార సమస్య తీరడమేగాక, అటు రైతులకు దాడుల ముప్పు తప్పింది. అన్నిటికంటే ముఖ్యంగా - ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. 


ఎలా వెళ్లాలి?

కర్ణాటకలోని ‘దరోజీ కరడీధామ’కు వెళ్లేందుకు చాలా మార్గాలున్నాయి. జిందాల్‌లోని విజయనగర విమానాశ్రయం నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉందీ ప్రాంతం. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన దరోజీకి చేరుకోవచ్చు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి 344 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాపినాయకనహళి రైల్వేస్టేషన్‌కు 15 కిలోమీటర్లే దూరం. హోస్పేట, తోరణగల్లు రైల్వేస్టేషన్‌ నుంచి కరడీధామకు సులభంగా చేరుకోవచ్చు. హుబ్బళ్లి, గుంతకల్లు జంక్షన్‌ల నుంచి హోస్పేట, తోరణగల్లు వరకు రోజూ రైళ్లు ఈ ప్రాంతానికి నడుస్తాయి. రోడ్డు మార్గంలో బళ్లారి, హోస్పేటల మీదుగా కూడా చేరుకోవచ్చు. సందర్శకుల సౌకర్యార్థం నేరుగా బస్సులను కూడా నడుపుతున్నారు. ఇక్కడికి సమీపంలోని హంపీని కూడా దర్శించుకోవచ్చు. క్వీన్స్‌ ప్యాలెస్‌, స్టోన్‌ చారియట్‌, మాతంగ హిల్‌, విరూపాక్ష దేవాలయం కూడా చూడదగ్గ సమీప పర్యాటక ప్రాంతాలే. తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అనువైన టూరిస్ట్‌ డెస్టినేషన్‌. 

Updated Date - 2021-02-21T17:30:54+05:30 IST