సిమోన్‌..ద హీరో

ABN , First Publish Date - 2021-06-14T09:47:28+05:30 IST

కరోనాతో ఏడాది తర్వాత ఉత్సాహంగా ప్రారంభమైన యూరో కప్‌లో ఆదిలోనే అపశ్రుతి ఏర్పడింది.

సిమోన్‌..ద హీరో

క్షణాల్లో స్పందించి ఎరిక్సన్‌ను కాపాడి..

 డెన్మార్క్‌  సాకర్‌ జట్టు సారథికి ప్రశంసలు


కోపెన్‌హెగెన్‌: కరోనాతో ఏడాది తర్వాత ఉత్సాహంగా ప్రారంభమైన యూరో కప్‌లో ఆదిలోనే అపశ్రుతి ఏర్పడింది. ఫిన్లాండ్‌తో ఆరంభ మ్యాచ్‌లో డెన్మార్క్‌ స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ క్రిస్టియన్‌ ఎరిక్సన్‌ మైదానంలో కుప్పకూలడంతో యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచం నివ్వెరపోయింది. అత్యవసర చికిత్స అనంతరం ఎరిక్సన్‌ (29)ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉంది. ఇకపోతే.. 42వ నిమిషంలో ఎరిక్సన్‌ మైదానంలో పడిపోయిన వెంటనే డెన్మార్క్‌ కెప్టెన్‌ సిమోన్‌ క్యా తక్షణం స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎరిక్సన్‌ను కాపాడిన సిమోన్‌ను హీరోగా అభివర్ణిస్తున్నారు. నాయకుడంటే మైదానంలో జట్టును నడిపించడమేకాదు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎలా స్పందించాలో సిమోన్‌ నిరూపించాడని కూడా కొనియాడుతున్నారు. ఇంతకీ సిమోన్‌ ఏం చేశాడంటే.. ఎరిక్సన్‌ కుప్పకూలిన మరుక్షణమే అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.


ఎరిక్సన్‌ పల్స్‌ను పరిశీలించాడు. అతడు గాలిీ పల్చుకోవడానికి నాలుక అడ్డుపడడంలేదని నిర్ధారించుకున్నాడు. బోర్లాపడిఉన్న ఎరిక్సన్‌ను తిప్పిపడుకోబెట్టి సీపీఆర్‌ (కార్డియో పల్మొనరీ రిససిటేషన్‌ అంటే..చాతిపై చేయివేసి అదమడం ద్వారా రోగికి ప్రాణవాయువును పునరుద్ధరించడం) నిర్వహించాడు.ఈలోపు వైద్య సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చి ఎరిక్సన్‌కు అత్యవసర చికిత్స నిర్వహించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఘటనతో స్టేడియంలోనే ఉన్న ఎరిక్సన్‌ భార్య సబ్రినా తీవ్ర ఆందోళనకు లోనైంది దాంతో ఆమె వద్దకు వెళ్లి ఓదార్చడంతోపాటు సిమోన్‌ ధైర్యం చెప్పాడు. 



Updated Date - 2021-06-14T09:47:28+05:30 IST