డేంజర్‌ బెల్స్‌!

ABN , First Publish Date - 2020-06-07T08:43:57+05:30 IST

రాష్ట్రం నెమ్మదిగా డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. ఇప్పుడిప్పుడే రెడ్‌జోన్‌ నుంచి బయటపడుతున్న ప్రాంతాలూ మళ్లీ ‘కట్టడి’లోకి జారుకొంటున్నాయి. వీటికి తోడు కొత్తగా మరికొన్ని ప్రాంతాల్లోను రెడ్‌ బెల్‌

డేంజర్‌ బెల్స్‌!

  • రెట్టింపైన యాక్టివ్‌ కేసులు
  • భారీగా పడిపోయిన డిశ్చార్జ్‌లు
  • కొత్త ప్రాంతాల్లోకీ రెడ్‌ జోన్లు
  • మొన్నటిదాకా కేసులు, 
  • స్వస్థత రేటు ఒకే మోతాదులో
  • అన్‌లాక్‌-1తో తలకిందులు
  • వారం రోజులుగా సెంచరీలే
  • 40 దాటని ఇంటికెళ్లే కేసులు


అమరావతి, ఆంధ్రజ్యోతి: రాష్ట్రం నెమ్మదిగా డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. ఇప్పుడిప్పుడే రెడ్‌జోన్‌ నుంచి బయటపడుతున్న ప్రాంతాలూ మళ్లీ ‘కట్టడి’లోకి జారుకొంటున్నాయి. వీటికి తోడు కొత్తగా మరికొన్ని ప్రాంతాల్లోను రెడ్‌ బెల్‌ మోగుతోంది. వారం రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే, డిశ్చార్జ్‌ రేటు మాత్రం దారుణంగా పడిపోతోంది. మరోవైపు కరోనాతో చికిత్స పొందుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా 644 మంది కరోనా బారినపడ్డారు. వారిలో డిశ్చార్జి అయింది 231 మంది మాత్రమేగాక, 13 మంది మరణించారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన తర్వాత 14 రోజుల పాటు చికిత్స అందించాలి. 15, 16 రోజుల్లో రెండు సార్లు స్వాబ్‌ తీసి కరోనా పరీక్షలు నిర్వహించాలి. వాటిల్లో రిపోర్టు నెగెటివ్‌ వస్తే డిశ్చార్జ్‌ చేయాలి. ఈ లెక్కన మే 22వ తేదీన పాజిటివ్‌ వచ్చి ఆస్పత్రిలో చేరిన వారిని శనివారం డిశ్చార్జ్‌ చేయాలి. ఆ రోజు రాష్ట్రంలో 62 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అంటే అటు ఇటుగా కనీసం 50 మంది అయినా కరోనా నుంచి బయటపడాలి. కానీ శనివారం కేవలం 29 మందే డిశ్చార్జి అయ్యారు. ఈ లెక్కల ఆధారంగా లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా తీవ్ర స్థాయిలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1192కు చేరింది.


సీన్‌ రివర్స్‌...

మే రెండో వారం వరకూ కరోనా కేసుల సంఖ్య తక్కువగా, డిశ్చార్జ్‌లు ఎక్కువగా ఉండేవి. మే 10వ తేదీనాటికి రాష్ట్రంలో 1010 యాక్టివ్‌ కేసులున్నాయి. ఆ సంఖ్య మే 19 నాటికి 691కి తగ్గింది. అంటే, వందల్లో డిశ్చార్జి అయ్యారన్నమాట! మే 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ 436 మంది కరోనా బారినపడ్డారు. ఆ పది రోజుల్లోనే కరోనా వచ్చి కోలుకొన్నవారి సంఖ్య 732. దీంతో యాక్టివ్‌ కేసులు ఈ సమయంలో చాలా వరకూ తగ్గాయి. మే 30 వరకూ ఇదే పరిస్థితి! కానీ, మే 31 నుంచి, అంటే సడలింపులను పెంచుతూ అన్‌లాక్‌ తొలిదశను అమల్లోకి తెచ్చిన నాటినుంచి, ఈ పరిస్థితి తిరగబడింది. ఈ వారం రోజులుగా రోజుకు వంద కేసులకుపైగా నమోదవుతుండగా, డిశ్చార్జ్‌లు మాత్రం 40కి మించడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపులతో కరోనా పట్ల ప్రజల్లో భయం తగ్గిపోయింది. ప్రభుత్వ కాలేజీల్లోనూ  మాస్కులు, శానిటైజర్లు కనిపించడంలేదు. చివరికి సచివాలయంలోనూ ఇదే పరిస్థితి! దీంతో అక్కడ కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పట్ల ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదంలో పడినట్లే. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోకపోతే కరోనా నుంచి బయటపడ్డ వారి సంఖ్య కంటే పాజిటివ్‌ కేసుల సంఖ్య పదుల రెట్లు పెరిగే ప్రమాదం ఉంది.

Updated Date - 2020-06-07T08:43:57+05:30 IST