మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్!
ABN , First Publish Date - 2021-06-27T09:32:30+05:30 IST
మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర యాక్షన్ టీం కమాండర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం
సాంబయ్య అలియాస్ ఆజాద్ పేరూ తెరపైకి
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి): మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర యాక్షన్ టీం కమాండర్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. హరిభూషణ్ మృతితో కొత్త కార్యదర్శిని ఎంపిక చేయాల్సి వచ్చింది. అంతేకాక నెలలోనే ఐదుగురు అగ్ర నేతలను కోల్పోయిన క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం కోసం చూస్తోంది. తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. భద్రాద్రి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ ములుగు జిల్లావారే. 1993లో పీపుల్స్ వార్లో చేరిన దామోదర్ది ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి. ఆజాద్ది గోవిందరావుపేట మండలం మోద్దులగూడెం. 1995లో పార్టీలో చేరారు.