Abn logo
Oct 26 2021 @ 03:20AM

భైంసాలో దళిత సంఘాల ఆందోళన

  • అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై నిరసన


భైంసా, అక్టోబరు25 : అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా భైంసాలో సోమవారం దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. బస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు, మహిళలు బైఠాయించారు. విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. దీంతో భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే, ఆర్డీవో లోకేశ్‌ అక్కడి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. అయినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు. అక్కడి నుంచినిర్మల్‌ క్రాస్‌ రోడ్డు మార్గంలో గల జాతీయ రహదారికి చేరుకుని నిరసన చేపట్టారు.


అనంతరం అంబేడ్కర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పోలీసులు ఆందోళనకారులను స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సోమవారం వ్యాపార సంస్థలను పూర్తిగా మూసి ఉంచేలా చర్యలు తీసుకుంది. మరోవైపు భైంసాలో ఈ నెల 26 వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు ఏఎస్పీ కిరణ్‌ ఖారే ప్రకటించారు. 

క్రైమ్ మరిన్ని...