రష్యాపై అమెరికా ఆంక్షలు.. కీలక పాత్ర పోషిస్తోన్న భారత సంతతి

ABN , First Publish Date - 2022-02-23T23:41:11+05:30 IST

ఉక్రెయిన్‌ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండిగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్‌పై దాడి చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలను స్వతం

రష్యాపై అమెరికా ఆంక్షలు.. కీలక పాత్ర పోషిస్తోన్న భారత సంతతి

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్‌ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండిగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్‌పై దాడి చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్ తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్ర్య రాజ్యాలుగా రష్యా గుర్తించింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా పుతిన్ స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, అమెరికా ఈ ఆంక్షలను విధించడంలో ఓ భారత సంతతి వ్యక్తి కీలక భూమిక పోషించడం విశేషం. ఆ భారత సంతతి వ్యక్తి ఎవరు? అనే వివరాల్లోకి వెళితే.


రష్యాపై ఆర్థిక ఆంక్షల వ్యవహారానికి సంబంధించి భారత సంతతి వ్యక్తి దలీప్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బైడెన్‌కు వివరించడంతోపాటు.. ఆంక్షలను ఏ మేరకు అమలు చేయాలనే అంశంపై కీలక సూచనలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన దలీప్ సింగ్.. ఉక్రెయిన్ సంక్షోభంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. రష్యాను కట్టడి చేయడానికి రాత్రికి రాత్రే జర్మనీతో సంప్రదింపులు జరిపి.. పైప్‌లైన్‌ల ఆపరేషన్లను నిలిపివేయించినట్టు చెప్పారు. ఆర్థిక ఆంక్షల్లో భాగంగా బిలియన్ డాలర్ల విలువ చేసే ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపేసినట్టు తెలిపారు. అమెరికా, యూరస్ దేశాలతో ఎలాంటి లావాదేవీలకు వీలులేకుండా చేశామని పేర్కొన్నారు. రష్యాకు కొత్త అప్పులు పుట్టవన్నారు. రష్యా ధనికులపై అదనపు చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్పారు. ఇవన్నీ పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావన్నారు. ఇకపై కూడా పుతిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామన్నారు.  ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించి రష్యాపై ఒత్తిడి పెంచనున్నట్టు పేర్కొన్నారు. 



నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌, ఇంటర్నేషనల్ ఎకనమిక్స్ విభాగానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా దలీప్ సింగ్  పని చేస్తున్నారు. మేరీల్యాండ్‌లో పుట్టిన ఈయన.. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. అంతేకాకుండా పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యల్ని అభ్యసించారు. ఒబామా హయాంలో కూడా దలీప్ సింగ్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌కు ఎంపికైన తొలి ఏషియన్ అమెరికన్ దలీప్ సింగ్ సౌంధీకి ఈయన బంధువు.




Updated Date - 2022-02-23T23:41:11+05:30 IST