అవును... గాడిదల్ని కాస్తున్నాడు!

ABN , First Publish Date - 2022-06-19T17:59:48+05:30 IST

దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామ పంచాయితీ పరిధిలోని పర్లడ్కకు వెళితే అక్కడ ఒక పెద్ద షెడ్డు కింద గాడిదలు మేస్తూ కనిపిస్తాయి. అదొక గాడిదల

అవును... గాడిదల్ని  కాస్తున్నాడు!

కోళ్లను పెంచుకునే వాళ్లను చూసి ఉంటారు... గొర్రెలు, గేదెలను పెంచుకునేవారిని చూసి ఉంటారు. పందులను పెంచుకునేవారు అక్కడక్కడ ఉంటారు. కానీ గాడిదల పెంపకానికి ఓ కేంద్రం నిర్వహిస్తున్నాడంటే... సమ్‌థింగ్‌ స్పెషల్‌. ఆ కేంద్రాన్ని చూడాలంటే కర్ణాటకలోని పర్లడ్కకు వెళ్లాల్సిందే...


దక్షిణ కన్నడ జిల్లా ఇరా గ్రామ పంచాయితీ పరిధిలోని పర్లడ్కకు వెళితే అక్కడ ఒక పెద్ద షెడ్డు కింద గాడిదలు మేస్తూ కనిపిస్తాయి. అదొక గాడిదల పెంపక కేంద్రం. ఐటీ రంగంలో కొంతకాలం సేవలందించి ఇరా గ్రామంలో స్ధిరపడ్డ యువ రైతు శ్రీనివాసగౌడ వాటిని పెంచుతున్నారు. వివిధ రకాల జాతుల గాడిదలు అక్కడ 20కి పైగా కనిపిస్తాయి. వాటిలో 12 గాడిదలు పాలిస్తాయి. గాడిద పాలలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి రోగనిరోధక శక్తికి బాగా పనిచేస్తాయి. ‘‘అంతేకాదు... గాడిద పాలలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. గాడిద పాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించా. త్వరలోనే గాడిదల సంఖ్య 100కు పెరుగుతుంది’’ అంటున్నారు శ్రీనివాసగౌడ. 


2 లక్షల లోపే...

గాడిద పాలను ఆయన 30, 60, 100, 200 మిల్లీ లీటర్ల బాటిళ్ల ద్వారా మార్కెట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందు కోసం సొంత బాట్లింగ్‌ తయారీ యూనిట్‌ కోసం కృషి చేస్తున్నారు. ‘ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అనిమల్‌ హెల్త్‌ అండ్‌ వెర్నటరీ బయోలాజికల్‌ సంస్థ’ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.శ్రీనివాస గౌడ నుంచి స్ఫూర్తి పొంది తాను గాడిదల పెంపక కేంద్రానికి రూపకల్పన చేసినట్లు శ్రీనివాసగౌడ వివరించారు. 

దేశంలో గాడిదల స్థితిగతులపై ఆయన జరిపిన ప్రత్యేక అధ్యయనంలో వాటిసంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతోందని తేలింది. ‘రెండు దశాబ్దాల కాలంలోనే గాడిదల సంఖ్య ఏకంగా 61.2 శాతం తగ్గిపోయింద’ని శ్రీనివాసగౌడ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల  ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల లోపు గాడిదలు మాత్రమే ఉన్నాయని తేలింది.


కష్టమే కానీ...

ఆవులు, గేదెలు, కోళ్ళు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపక కేంద్రాలతో పోల్చితే గాడిదల పెంపకం చాలా కష్టమని శ్రీనివాస గౌడ అంటున్నారు. ప్రస్తుతం ఇరా గ్రామంలోని తన 2.5 ఎకరాల ‘ఐసిరి ఫామ్‌’లో గుజరాత్‌కు చెందిన హలరి జాతి గాడిదలు, ఆంధ్రప్రదేశ్‌ జాతి గాడిదలను పెంచుతున్నా రాయన. గాడిదల పెంపకంలో ఆయన ప్రత్యేకంగా ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. ‘‘ఇంతకాలం మన దేశంలో గాడిదలను కేవలం రవాణా సాధనంగానే వినియోగిస్తూ వచ్చారు. అయితే గాడిద పాలలో షుగర్‌ వ్యాధిని నియంత్రించే గుణముంది. సౌందర్య సాధనాల తయారీ లోనూ గాడిద పాలను వాడుతున్నారు. గాడిద పాల ధర లీటర్‌ రూ 5వేల నుండి రూ 7వేల వరకు పలుకుతోంది. అలాగే గాడిద మూత్రాన్ని కూడా ఔషధంగా వినియోగిస్తారు. దీని ధర లీటర్‌ రూ 500 నుండి రూ 600 వరకు ఉంది. నా ఫామ్‌లో కనీసం వెయ్యి మేలిరకం జాతులకు చెందిన గాడిదలను పెంచాలనుకుంటున్నా. విదేశాల నుండి కూడా కొన్ని గాడిదలను దిగుమతి చేసుకునే ఆలోచన ఉంది’’ అని శ్రీనివాసగౌడ  అన్నారు. 


పనీర్‌కు భలే డిమాండ్‌

సాధారణంగా ఆవు, గేదెపాలతో చేసిన పనీర్‌ ధర కిలో రూ 300 నుండి రూ 600 వరకు ఉంటుంది. అయితే గాడిద పాలతో చేసిన పనీర్‌ ధర అక్షరాలా కిలో 78 వేల రూపాయలు ఉంటుంది. విదేశాల్లో గాడిద పాల పనీర్‌కు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. గాడిద పాలతో సబ్బులను కూడా తయారు

చేస్తున్నారు. 


పోషక విలువలు అధికం..

గాడిదల సగటు జీవితకాలం 30-40 ఏళ్లుగా ఉంటుంది. ఇందులో ఉత్పాదనా వయస్సు 9 సంవత్సరాలు. ఏడాదిలో పది నెలలపాటు గాడిదలు పాలను ఇస్తాయి. గాడిద పాలలో ఉన్న పౌష్టికాంశాల దృష్ట్యా దాదాపుగా తల్లి పాలతో సమానమని చెబుతుంటారు. ఈ పాలలో విటమిన్‌ ఏ, డి, బి1, బి12, ఇ పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో నైట్రిక్‌ యాక్సైడ్‌ను పెంచే సామర్థ్యం గాడిద పాలకు ఉంది. బీపీని నియంత్రించడంతోపాటు రక్త నాళాల పనితనాన్ని పెంచేలా చేసి, హృద్రోగాల బారి నుంచి రక్షిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కావునే గాడిదపాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. ‘‘రాష్ట్రంలో తొలి గాడిదల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. అయితే వాటి పాలతో, మూత్రంలో అనుబంధ ఉత్పత్తుల వైపు నా ప్రయాణం సాగుతోంది. తప్పకుండా సక్సెస్‌ అవుతాననే నమ్మకం ఉంది’’ అంటున్న శ్రీనివాస గౌడ గాడిదల పెంపకానికి సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి గలవారు 96322 64308 నెంబరును సంప్రదించవచ్చు.

- అబ్దుల్‌ రజాక్‌, బెంగళూరు

Updated Date - 2022-06-19T17:59:48+05:30 IST