పాడి రైతుల గోస పట్టదా!

ABN , First Publish Date - 2020-08-29T06:00:00+05:30 IST

పాలు, పాల ఉత్పత్తులతో సమాజానికి నిత్యం బలవర్థకమైన ఆహారాన్నందిస్తూ కోట్లాది కుటుంబాలకు ఉపాధినిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్న పాడి పరిశ్రమ నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది.

పాడి రైతుల గోస పట్టదా!

పాలు, పాల ఉత్పత్తులతో సమాజానికి నిత్యం బలవర్థకమైన ఆహారాన్నందిస్తూ కోట్లాది కుటుంబాలకు ఉపాధినిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతున్న పాడి పరిశ్రమ నేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. తెలంగాణలో పాడి రైతులు అనేక కష్టాలతో బతుకులీడుస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఒక్కో కుటుంబానికి రోజుకు లీటరు చొప్పున సుమారు కోటి లీటర్ల పాలు అవసరం. కానీ 54.2 వేల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అవసరమైన మిగతా పాలు ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ఈ లోటును తీర్చడానికి 1677.11 కోట్లు ఖర్చుతో 50శాతం సబ్సిడీపై ఇంటికో గేదెను కొనుగోలు చేసి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గేదెలు ఇవ్వడమే కాకుండా పాలు నిలువ చేయడానికి, గడ్డి కోయడానికి మిషన్లను కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు విజయ డెయిరీతోపాటు మదర్‌, కరీంనగర్‌, ముల్కనూర్‌ డెయిరీల్లో పాలు పోసే రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు ప్రోత్సాహకాన్ని ఇస్తామన్నారు. కానీ 2016 నుంచి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కేవలం 8 నెలలకు మాత్రమే ప్రభుత్వం నగదు వేసింది. రైతులకు దాణా, మినరల్‌ విక్షర్‌, కాల్షియం, ఎదకు రావడానికి ఇంజక్షన్‌లు ఇవ్వడం కోసమని ప్రతి లీటరుకు 20 పైసలు కోత విధిస్తున్నారు. ఈ మొత్తం డబ్బులు జిల్లా యూనియన్‌ల అక్కౌంట్‌లలో నిల్వ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం పంపిణీ చేయడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విజయ డెయిరీ ద్వారా పాల సేకరణ ఎక్కువగా జరుగుతోంది. ఈ డెయిరీ సహకార సంస్థ అయినప్పటికీ లాభాల వాటాలను మాత్రం రైతులకు పంచకుండా నిర్లక్ష్యం చేస్తోంది. 


తెలంగాణలో జిల్లాలవారీగా ఉన్న విజయ డెయిరీతోపాటు కరీంనగర్‌, మదర్‌, ముల్కనూర్‌ డెయిరీల ద్వారా పాల సేకరణ చేస్తున్నారు. వేసవిలో కొరత ఉన్నప్పుడు పోటీపడి మరీ పాలను కొనుగోలు చేసే డెయిరీలు వానాకాలంలో పాల ఉత్పత్తి, లభ్యత పెరగడంతో పాల సేకరణ తీరు మారుతుంది. దాంతో రైతులకిచ్చే ప్రోత్సాహకాలు తగ్గించేస్తున్నాయి. పాడి రైతులు అనేక కష్టాలకోర్చి పాల ఉత్పత్తి చేసినప్పటికీ ఆ పాలను వినియోగదారునికి నేరుగా అమ్ముకునేది అతి తక్కువ. ప్రాసెసింగ్‌ చేసిన పాలను, రకరకాల పాల పదార్థాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేది మధ్య దళారీలు మాత్రమే. ఈ దళారీ పాత్రను డెయిరీ ఏజెన్సీలు, కొంతమంది పాల వ్యాపారస్తులు, ప్రైవేట్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీలు పోషిస్తున్నాయి. వాటికి వివిధ ఉత్పత్తుల ద్వారా రెట్టింపు లాభాలు వస్తున్నా, లీటరు పాలకు రైతులకు చెల్లించే ధర మాత్రం కేవలం 35 రూపాయలే. ఇతర దేశాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్న కార్పొరేట్‌ కంపెనీలు ఇక్కడి రైతులకు మాత్రం పాలసేకరణ ధరలు పెంచడంలేదు. ప్రభుత్వాలు ఈ దిగుమతి దారులతో లాలూచీపడి ఇక్కడి పాల రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. పాడి పశువుల నిర్వహణ, దాణా ఖర్చుల వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు ఐదు లీటర్ల పాల ద్వారా రూ.150 ఆదాయం తెచ్చే గేదెకు దాణా, పశుగ్రాసం, వైద్యఖర్చుల కోసం సుమారు రూ.138 ఖర్చవుతుండగా రైతు శ్రమకు రూ.12లు మిగులుతుంది. ఈ ఖర్చులు పెరిగిన తరుణంలో ప్రస్తుతం చెల్లిస్తున్న పాల ధరలు పాడి రైతుల్ని నష్టాల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. 


ప్రభుత్వం పాడి రైతుల స్థితిగతులు మెరుగుపడేలా చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన పాలు తక్కువ ధరలో అందించాలంటే పాల ఉత్పత్తి పెంచేలా పశుపోషకులకు విరివిగా సబ్సిడీలు అందించాలి. దేశీయ పాలను, పాల పదార్ధాల ఉత్పత్తులను పెంచడంతోపాటు దేశీయ వినియోగాన్ని కూడా పెంచుకోవాలి. దిగుమతులను నిషేధించాలి, లేదా దిగుమతి సుంకాలను ఇక్కడి ఉత్పత్తి ఖర్చులకు సమానంగా పెంచి నియంత్రించాలి. రాష్ట్ర ప్రభుత్వం పాడిపశువుల కొనుగోలు పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబా నికి పాడి పశువులను పంపిణీ చేయాలి. తెలంగాణ ఉష్ణోగ్రతల్ని తట్టుకునే జాతులను ఎంపిక చేసుకునే అవకాశమివ్వాలి. రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని కొనసాగించాలి. ప్రతీ 15 రోజులకు ఒకసారి రైతులకు చెల్లించే పాల బిల్లుతోపాటు నగదు రూపంలో చెల్లించాలి. అధిక ఉత్పాదకత కోసం వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల్లో పశువుల పెంపకం చేపట్టే విధంగా పాడి రైతులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కల్పించాలి. ఉపాధి లేని యువతను ఈ రంగం వైపు ప్రోత్సహించాలి. మౌలిక పశువైద్య వసతులు కల్పించాలి. కృత్రిమ గర్భధారణ సేవలను విస్తృతపరచాలి. పశు భీమా పథకాన్ని అమలు చేస్తూ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. మార్కెట్‌ ధరలకనుగుణంగా రైతులకు పాల ధరలు పెంచాలి. పశు దాణాను, కరువు పరిస్థితులను తట్టుకునే పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేయాలి. ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల పాకలు, షెడ్లను ఏర్పాటు చేయాలి. మిల్క్‌ టెస్టర్లు, చాఫ్‌ కట్టర్‌లు, మిల్క్‌ అనలైజర్లు సరఫరా చేయాలి. పాడి రైతులకు వ్యక్తిగత భీమా సౌకర్యం ప్రభుత్వ ప్రీమియంతో కల్పించాలి. పాల సేకరణ ఎక్కువగా ప్రభుత్వ సహకార డెయిరీల ద్వారా జరిగే చర్యలు చేపట్టాలి.


ఉడుత రవీందర్‌

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం

Updated Date - 2020-08-29T06:00:00+05:30 IST