హైదరాబాద్‌లో సైబర్ నేరాలు ఫుల్.. రికవరీ నిల్

ABN , First Publish Date - 2021-04-16T16:51:22+05:30 IST

ఆన్‌లైన్‌ నేరాలను కట్టడి చేయడంలో పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్‌ నేరాలను నియంత్రిచడంలో

హైదరాబాద్‌లో సైబర్ నేరాలు ఫుల్.. రికవరీ నిల్

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ నేరాలను కట్టడి చేయడంలో పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్‌ నేరాలను నియంత్రిచడంలో చతికిలపడుతున్నారు. తెలంగాణ పోలీసులు మాత్రమే సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎంత తీవ్రంగా కృషి చేసినా ప్రతి ఏటా నమోదవుతున్న కేసుల్లో కేవలం 10-30 శాతం కేసులు కూడా ఛేదించలేకపోతున్నారు.


డేంజరస్‌ నేరగాళ్లు..

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారిలో నైజీరియన్స్‌తో పాటు.. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, ఉతరప్రదేశ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, బిహార్‌, తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. సైబర్‌ నేరాల్లో కేవలం సాంకేతిక ఆధారాలు తప్ప.. ఇక ఎలాంటి సమాచారం పోలీసుల వద్ద ఉండదు. సేకరించిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌లో నిందితుడు ఏ ఒక్కటి ధ్వంసం చేసినా.. కేసు తిరిగి మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కో కేసులో అన్ని రకాల ఎవిడెన్స్‌లు సేకరించి, నిందితుల ఆచూకీ గుర్తించడానికి సుమారు నెలరోజుల సమయం పడుతుంది. ఈ లోపు మరో 20 సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదవుతున్నాయి. అదే సైబర్‌ నేరగాళ్లు పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడుతున్నారని పోలీసుల అంటున్నారు. ఇంతా కష్టపడి సేకరించిన ఆధారాలతో నిందితులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పోలీస్‌ బృందాలకు స్థానికంగా సపోర్టు దొరకడంలేదు.


ముక్కు ముఖం తెలియని రాష్ట్రంలో 15-30 రోజులు మకాం వేసి ఎంతో చాకచక్యంగా నిందితులను పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిందితులు దొరకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో రికవరీ చేయడం అసాధ్యం అవుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దోచేసిన సొత్తును సైబర్‌ నేరగాళ్లు క్షణాల్లో ఇతర ఈ వ్యాలెట్స్‌లోకి బదిలీ చేస్తారు. వాటిని రికవరీ చేయడం అసాధ్యం అవుతుంది. అన్నిటికంటే షాకింగ్‌ విషయం ఏమిటంటే..! సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నిందితులు కేవలం 5- 10వ తరగతిలోపు చదువుకున్న వారు కావడం గమనార్హం. కేవలం టెక్నాలజీపై పట్టుసాధించి, ఎదుటి వారిని మాటలతో నమ్మించి బుట్టలో వేసుకునే సామర్ధ్యంతో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు.


రూ. లక్ష మించితేనే ఎఫ్‌ఐఆర్‌.. 

రోజు రోజుకూ సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ప్రతి కేసు ఎఫ్‌ఐఆర్‌ చేయడం కష్టంగా మారుతోంది. రూ. లక్షకు పైగా పోగొట్టుకున్న ఫిర్యాదును మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు. మిగిలిన  మోసాలకు సంబంధించిన పిటిషన్‌లు తీసుకొని కేసులు నమోదు చేస్తున్నారు. కేసుల ఛేదనలో మాత్రం ఎక్కువ మొత్తంలో సొత్తు పోయిన కేసులపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితుల ఆటకట్టిస్తున్నారు.

Updated Date - 2021-04-16T16:51:22+05:30 IST