Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 23 Nov 2021 02:54:46 IST

డిస్కమ్‌లకు గండం!

twitter-iconwatsapp-iconfb-icon
డిస్కమ్‌లకు గండం!

 • విద్యుత్తు సవరణ బిల్లు ఆమోదం పొందితే పంపిణీ సంస్థలకు గడ్డు కాలమే
 • దరఖాస్తు చేసుకున్నవారికి విద్యుత్తు వ్యాపారానికి అనుమతి
 • గ్యాస్‌ సిలిండర్‌ తరహాలోనేకరెంటు రాయితీ
 • తొలుత బిల్లు కట్టి... తర్వాతే సబ్సిడీ పొందాలి
 • డిస్కమ్‌లకు నష్టాలు.. సర్కారీ కొలువులకు దెబ్బ!
 • సవరణ బిల్లుతో విద్యుత్తు సంస్థల్లో గుబులు
 • ఢిల్లీలో రైతులు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో విద్యుత్తు సవరణ బిల్లు రద్దు కూడా ఒకటి
 • సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు
 • ప్రకటించినా.. దీనిపై పెదవి విప్పని ప్రధాని మోదీ
 • ఏడున్నరేళ్లుగా ఈ బిల్లుపై పట్టువదలని కేంద్రం
 • తెలంగాణ సహా పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకం
 • గత ఏడాది జూన్‌లోనే ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ
 • బిల్లుతో విద్యుత్తుపై సర్వాధికారాలూ కేంద్రానివే!


హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘‘‘విద్యుత్‌ సవరణ బిల్లు 2021’ను ఉపసంహరించుకోవాలి’’.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీశివార్లలో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఆదివారం ప్రధానికి పెట్టిన ఆరు డిమాండ్లలో రెండోది ఇది! ఇప్పుడే కాదు.. మొదట్నుంచీ వారు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. కానీ.. సాగు చట్టాలను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిన మోదీ ఈ బిల్లు గురించి మాత్రం పెదవి విప్పలేదు. విద్యుత్‌పై సర్వాధికారాలూ కేంద్రానికే కట్టబెట్టే ఈ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ గత ఏడాది జూన్‌లోనే సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమని ఆ తర్వాత అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇలా ఈ బిల్లును తెలంగాణతో సహా 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌ మధ్యేమార్గాన్ని ఎంచుకుంది. బీజేపీ/ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు ఈ బిల్లును సమర్థిస్తున్నాయి. నిజానికి ఈ బిల్లును చట్టంగా మార్చడానికి కేంద్రం దాదాపు ఏడున్నరేళ్లుగా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తోంది. 2014లో ఎన్నికల అనంతరం విద్యుత్‌ సవరణ బిల్లు-2014ను సిద్ధం చేసి.. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే విపక్షాలు దీన్ని స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేయాలని చెప్పడంతో.. బిల్లు స్టాండింగ్‌ కమిటీ వద్దకు వెళ్లింది. కమిటీ 2015లో తన నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత ఆ బిల్లు మరుగున పడింది. మళ్లీ 2018లో ఈ బిల్లు ముసాయిదాను సవరించిన కేంద్రం.. పలు రాష్ట్రాలకు పంపించి అభిప్రాయాలు సేకరించింది. రెండుసార్లు దీనిపై కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. పార్లమెంటు గత సమావేశాల్లో.. సభలో ప్రవేశపెట్టే బిల్లులో జాబితాలో ఇది కూడా ఉంది. కానీ ప్రవేశపెట్టలేదు. 


తాజాగా ఈ బిల్లుకు ఇంధన శాఖ, కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్‌ ఇచ్చాయి. దాంతో ఏ క్షణంలోనైనా బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ నెల 29వ తేదీన దేశవ్యాప్తంగా రాజధాని నగరాల్లో నిరసనలు వ్యక్తం చేస్తామని, బిల్లు పెట్టిన రోజు మెరుపు సమ్మె చేపడతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అయితే రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తాజాగా వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన, రైతుల డిమాండ్‌ నేపథ్యంలో విద్యుత్‌బిల్లుపై కేంద్రం ముందుకే వెళుతుందా? ఎన్నికలు అయ్యేదాకా వేచిచూస్తుందా తేలాల్సి ఉంది. బిల్లు గనుక సభలోకి వెళితే ఎన్‌డీఏ బలాబలాల ప్రకారం రెండు సభల్లోనూ ఆమోదించే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు బిల్లులో ఏముంది? విద్యుత్‌ సంస్థలపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలను పరిశీలిస్తే...


డిస్కమ్‌లకు కష్టాలు..

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీకి రెండే డిస్కమ్‌లు ఉన్నాయి. ఒకటి దక్షిణ తెలంగాణలో, మరొకటి ఉత్తర తెలంగాణలో. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీ/వ్యాపారం చేయడానికి ఈ సంస్థలు లైసెన్సులు తీసుకొని కరెంటు అందిస్తున్నాయి. ‘విద్యుత్‌ సవరణబిల్లు-2021’ ఆమోదం పొందితే ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యాపారానికి లైసెన్సు కావాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. వారి వ్యాపారానికి అనుమతి దొరకనుంది. ఈఆర్‌సీ కూడా పక్కాగా అనుమతి ఇస్తేనే వ్యాపారం చేసుకోవాలనే రూలేం లేదు. ఈఆర్‌సీలో దరఖాస్తు పెట్టుకున్న 60 రోజుల్లోగా అప్లికేషన్‌ను ఆమోదించకపోతే... ‘డీమ్డ్‌ టూ అప్రూవల్‌’ కింద ఆమోదం దొరుకుతుంది. దాంతో నచ్చిన చోటులో, నచ్చిన ప్రాంతంలో కరెంట్‌ను అమ్ముకోవచ్చు. కేబుల్‌ కనెక్షన్లు, ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు ఇస్తున్నట్లు.. ఇంటింటికీ తిరిగి.. తక్కువ ధరకే కరెంట్‌ ఇస్తామని, విద్యుత్‌ అంతరాయం జరిగితే ఏ క్షణంలోనైనా సేవలందిస్తామని చెప్పి.. కనెక్షన్లు ఇవ్వొచ్చు. ప్రస్తుతం విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ఆర్టిజన్‌/జూనియర్‌ లైన్‌మెన్‌ను కలిసి, రికార్డులన్నీ అందించి... మీటర్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ పెట్టుకున్నా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మీటర్‌ ఇంటికొస్తుంది. విద్యుత్‌ సవరణ బిల్లు వల్ల డిస్కమ్‌ల ఆధిపత్యం మాయమవుతుంది. విద్యుత్‌ వ్యాపారం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. అదే జరిగితే మీటర్ల కోసం/కొత్త కనెక్షన్‌ కోసం వినియోగదారులు కార్యాలయాలకు వెళ్లనక్కర్లేదు. ప్రైవేట్‌ వారే ఇంటికే వచ్చి కొత్త కనెక్షన్‌కు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేస్తారు. దీంతో డిస్కమ్‌ల వినియోగదారులు తగ్గిపోతారు.


ఫ్రాంచైజీ టూ ప్రైవేట్‌

ప్రస్తుతం దేశంలో ఒడిశాలో ప్రైవేట్‌ డిస్కమ్‌లు ఉండగా.. బిహార్‌ లోని గయ, యూపీలోని కాన్పూర్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, ఉజ్జయిని, ఝార్ఖండ్‌లోని రాంచీ, జంషెడ్‌పూర్‌, మహారాష్ట్రలోని జల్‌గాఁవ్‌, ఔరంగాబాద్‌, ముంబైలో ఫ్రాంచైజీ విధానం ఉంది. ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ బిల్లులు తగ్గుతాయని ప్రాంచైజీలు ఇచ్చిన కొత్తలో చెప్పినా... ఆ తర్వాత తగ్గలేదు. ముంబై కరెంట్‌ బిల్లులపై గతంలో పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ కూడా జరిగింది. వాస్తవానికి తెలంగాణలో ప్రధానంగా నష్టాలు వచ్చే డివిజన్లు/సర్కిళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. విద్యుత్‌ సవరణల బిల్లు ఆమోదం పొందితే.. ఫ్రాంచైజీ విధానంలో లాగా ఒక ప్రాంతాన్ని ఒకరు గంపగుత్తగా తీసుకోకుండా ఒకలైనులో ఎంత మంది వ్యాపారులైనా కరెంట్‌ను విక్రయించుకునే అధికారం పొందనున్నారు. ఇదే జరిగితే లాభాలు వచ్చే వినియోగదారులంతా (పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు) ప్రైవేట్‌ వైపు మొగ్గుచూపితే.. నష్టాలు వచ్చే వారంతా (రైతులు, పేదలు) ప్రభుత్వ రంగ సంస్థలకు మిగిలే అవకాశం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పీక ల్లోతు నష్టాలు/అప్పుల్లో ఉన్న డిస్కమ్‌లు వినియోగదారులు లేక మూతపడితే.. విద్యుత్‌ ఉద్యోగుల కొలువులు కూడా ప్రశ్నార్థకం అయ్యే ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.


కట్టాకే రాయితీ..

ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌కు అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) విధానాన్ని విద్యుత్‌ వినియోగదారులకు కూడా వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. అంటే.. వినియోగదారులకు పూర్తి బిల్లు వస్తుంది. ఆ తర్వాత వారికి రావాల్సిన రాయితీని వారి ఖాతాల్లోనే ప్రభుత్వాలు నేరుగా జమచేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రం విషయాన్నే తీసుకుంటే.. ఒక్కో యూనిట్‌ కరెంట్‌ అందించడానికి అవుతున్న వాస్తవిక వ్యయం రూ.7కు పైగానే ఉంది. కానీ, లోటెన్షన్‌(ఎల్టీ)-1(ఏ)లో 50 యూనిట్లలోపు వాడకానికి యూనిట్‌కు రూ.1.45, 51-100 యూనిట్లలోపు రూ.2.60, ఎల్టీ-1(బీ-1)లో 100 యూనిట్లలోపు వారికి రూ.3.30, 101-200 యూనిట్లలోపు వారికి రూ.4.30, ఎల్టీ-1(బీ-2)లో 201-300లోపు యూనిట్లకు రూ.5.00 చార్జీగా వసూలు చేస్తున్నారు. అంటే.. 50 యూనిట్లలోపు వాడే వారు ప్రస్తుతం రూ.100 లోపే బిల్లు కట్టాల్సి ఉండగా.. బిల్లు ఆమోదం పొందితే రూ.400 దాకా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీగా రూ.300ను వినియోగదారుల ఖాతాలో వేస్తుంది. కానీ.. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం అమలు చేసిన కొత్తలో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌కు రూ.400 దాకా సబ్సిడీ ఖాతాలో జమ అవుతుండగా.. ప్రస్తుతం దాదాపు రూ.50లోపే జమ అవుతోంది. వినియోగదారులు మాత్రం పూర్తి ధరను చెల్లిస్తున్నారు. ఇదే కోవలో ప్రభుత్వాలు క్రమంగా విద్యుత్‌ సబ్సిడీ విధానం నుంచి కూడా వైదొలగితే సామాన్యులకు కరెంటు బిల్లులే షాక్‌ కొట్టించే ప్రమాదం ఉంది. వాస్తవానికి ఈ విధానాన్ని వ్యవసాయ రంగానికి అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం.. రైతుల నిరసనలతో వెనక్కి తగ్గింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి, మొత్తం వినియోగం ఆధారంగా బిల్లు వేసి.. ఆ బిల్లునంతా రైతులతో కట్టించి, తర్వాత సబ్సిడీని రైతుల ఖాతాలో జమచేయాలని కేంద్రం సూచించింది. విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కనపెట్టి, వ్యవసాయానికి కరెంట్‌ తీసుకెళ్లే ఫీడర్లకు మీటర్లు బిగించాలని మరో ప్రతిపాదన ముందుకు తెచ్చింది.


క్రాస్‌ సబ్సిడీ క్రమంగా రద్దు..

వాస్తవానికి పేద వర్గాలు.. అందులోనూ లోటెన్షన్‌(ఎల్టీ)లో 200 యూనిట్లలోపు వాడేవారినిఆదుకోవడానికి డిస్కమ్‌లు ఓపెన్‌యాక్సె్‌స(బహిరంగ విపణి)లో కరెంట్‌ కొంటున్నవారి నుంచి క్రాస్‌ సబ్సిడీని (భరించే వర్గాల నుంచి వసూలు చేసి... భరించలేని పేద వర్గాలకు సబ్సిడీ ఇవ్వడం) వసూలు చేస్తున్నాయి. క్రాస్‌ సబ్సిడీ కింద హెచ్‌టీ వినియోగదారుల నుంచి 11 కేవీ అయితే యూనిట్‌కు రూ.1.63 నుంచి రూ.2.03 దాకా, 33 కేవీకి రూ.1.44-రూ.1.46దాకా, 132 కేవీకి రూ.1.30-రూ.1.31 దాకా వసూలు చేస్తూ.. ఆ సొమ్మును పేద వర్గాలకు రాయితీతో కరెంట్‌ ఇచ్చేందుకు ఖర్చుపెడుతున్నాయి. కానీ, తాజా బిల్లులో క్రాస్‌ సబ్సిడీ విధానం క్రమంగా రద్దుకావాలనే క్లాజు ఉంది. క్రమక్ర మంగా క్రాస్‌ సబ్సిడీని ఎత్తివేయాల్సి ఉంటుందని కేంద్రం ఇదివరకే గుర్తు చేసింది. అదే జరిగితే పేద వర్గాలకు కరెంట్‌ భారంగా మారి... గుడి సెల్లో చీకట్లు అలుముకోనున్నాయి. అంతేకాదు.. డిస్కమ్‌ల మనుగడ అంతా హెచ్‌టీ వినియోగదారుల మీదే ఆధారపడి ఉంటుంది. ఎల్‌టీ వినియోగదారుల నుంచి అందులోనూ 200 యూనిట్లలోపు వారికి కరెంట్‌ ఇవ్వడం వల్ల డిస్కమ్‌లకుపెద్దగా గిట్టుబాటు కాదు. కొత్త బిల్లు వస్తే.. హెచ్‌టీ వినియోగదారులను ప్రైవేట్‌ వర్గాలు ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. నష్టాలు వచ్చే వ్యవసాయ వినియోగదారులతో పాటు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారే డిస్కమ్‌లకు మిగిలే అవకాశాలున్నాయి. దీనివల్ల క్రమంగా డిస్కమ్‌లు ఆర్థిక సాధికారతను కోల్పోయి.. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఉద్యోగుల కొలువులు పోతాయనేఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


జెన్‌కోలకూ శాపం..

రెన్యువబుల్‌ పవర్‌ పర్చేస్‌ ఆబ్లిగేషన్‌(ఆర్‌పీవో) విధానం ప్రకారం.. కొనుగోలు చేసే విద్యుత్‌లో 7.5 శాతం వాటా సంప్రదాయేతర ఇంధన వనరులది ఉండాలని కేంద్రం ఇదివరకే షరతుపెట్టింది. దాంతో తెలంగాణలో ఆ మేరకు సౌర, పవన విద్యుత్‌ను కొంటున్నారు. ప్రతిపాదిత సవరణ బిల్లులో ఈ వాటా 20 శాతానికి చేరనుంది. దీనికోసం జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ను (ఎన్‌ఎల్‌డీసీ) శక్తిమంతం చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రైవేట్‌ సంస్థలు పెద్దఎత్తున సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్‌లు పెడతుండటంతో వాటి నుంచే కరెంట్‌ కొనుగోలు చేసి, జెన్‌కో కేంద్రాలను బ్యాక్‌డౌన్‌ చేయడం దీని ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి ఎంత మేర విద్యుత్‌ కావాలి? ఎవరి నుంచి విద్యుత్‌ ఇవ్వాలనేది ఎన్‌ఎల్‌డీసీ చూసుకోనుంది. అంతేకాకుండా బహిరంగ విపణి నుంచి కరెంట్‌ కొనుగోలు చేయాలన్నా దీని అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ను క్రమబద్ధం చేయడమే దీని బాధ్యత కాగా.. కరెంట్‌ సరఫరాపై పూర్తి అజమాయిషీ ఎన్‌ఎల్‌డీసీకి ఇవ్వాలనేది కేంద్రం ప్రతిపాదన. దాంతో కరెంట్‌ కొనుగోలు చేసేవారు లేక జెన్‌కో కేంద్రాలన్నీ మూతపడి... క్రమంగా ఆ సంస్థలో ఉద్యోగులు కూడా రోడ్డున పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. పూర్తి అజమాయిషీ ఎస్‌ఎల్‌డీసీ చేతికే వెళ్తే విద్యుత్‌పై అధికారాలన్నీ రాష్ట్రాల నుంచి కేంద్రం చేతికి వెళ్తాయి.


విద్యుత్‌ సవరణ బిల్లుకు అనుకూల రాష్ట్రాలు

ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్‌, గోవా, అసోం సహా ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాక్షికంగా అనుకూలంఆంధ్రప్రదేశ్‌వ్యతిరేకంమహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఛ త్తీస్‌గఢ్‌, బిహార్‌


11 రాష్ట్రాలు వ్యతిరేకం..

కేంద్రం తేనున్న ఈ బిల్లును దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాక్షికంగా మద్దతు ఇస్తోంది. బీజేపీతో పాటు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు, ఒడిశా పూర్తిగా సమర్థిస్తున్నాయి. వచ్చే ఏడాది యూపీ, పంజాబ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును ముందుకే తీసుకెళతారా... లేక తాత్కాలికంగా ఎన్నికలు పూర్తయ్యేదాకా పక్కనపెడతారా తేలాల్సి ఉంది.


విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలుతుంది 

విద్యుత్‌ సవరణ బిల్లుతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రస్తుతం 190 యూనిట్లు వినియోగించేవారు రూ.800లోపు బిల్లు కడుతుంటే... కొత్త బిల్లు ఆమోదం పొందితే రూ.1500 ముందుగా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. విద్యుత్‌ రంగం రాష్ట్ర జాబితాలో ఉంది. దీన్ని లాక్కోవడానికే కేంద్రం కొత్త బిల్లును తెస్తోంది. దీంతో పేద వినియోగదారులు బిల్లులు కట్టలేక చీకట్లోకి వెళ తారు. ఆదాయం వచ్చే (పారిశ్రామిక, వాణిజ్య) వినియోగదారులంతా ప్రైవేట్‌ ఆపరేటర్ల చేతికి వెళితే... ఆదాయం లేని వర్గాలవారే డిస్కమ్‌లకు మిగులుతారు. 70 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న విద్యుత్‌ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికే కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తెస్తోంది.

- రత్నాకర్‌రావు , పవర్‌ జేఏసీ

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.