సాగు వెలుగులు, వెట్టి చీకట్లు

ABN , First Publish Date - 2021-12-14T05:52:43+05:30 IST

నిష్క్రమిస్తోన్న 2021, భారతీయ రైతు లోకం మరచిపోలేని సంవత్సరం. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులకు ఉద్దేశించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఏడాదికి పైగా అసాధారణ స్థాయిలో...

సాగు వెలుగులు, వెట్టి చీకట్లు

నిష్క్రమిస్తోన్న 2021, భారతీయ రైతు లోకం మరచిపోలేని సంవత్సరం. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక మార్పులకు ఉద్దేశించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఏడాదికి పైగా అసాధారణ స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహించి విజయం సాధించారు. రైతులు నిరసించిన మూడు సాగు చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2020 సెప్టెంబరులో పార్లమెంటులో హడావిడిగా ఆమోదించిన మూడు సాగు చట్టాలు స్థానిక మార్కెట్ వ్యవస్థను తొలగించి కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు తమను వదిలేస్తాయని వాదిస్తూ వాటిపై రైతులు రాజీలేని పోరాటం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలన్నది కూడా ఉద్యమ రైతాంగం డిమాండ్. భారతీయ రైతులోకానికి ఇది అపూర్వ విజయమని కొందరు కొనియాడారు. అయితే ఆ మూడు చట్టాల రద్దు పట్ల వ్యవసాయ కార్మిక వర్గం నిర్లిప్తంగా ఉండిపోయింది. రెక్కల కష్టంపై బతుకులీడుస్తున్న ఈ రైతు కూలీలలో 90 శాతం పైగా ఎలాంటి భూ వసతి లేని నిరుపేదలే. మహా అయితే వారికి ఒక ఎకరం కమతం ఉండి ఉండవచ్చు సెంటు భూమి లేనివారు వ్యవసాయ శ్రామిక శ్రేణుల్లో 90 శాతం మేరకు ఉన్నట్టు ఒక అంచనా. 


ఈ వ్యవసాయ కూలీలలో కొంతమంది వెట్టి కార్మికులు. మరింత స్పష్టంగా చెప్పాలంటే తమకు తినడానికి ఏవో నాలుగు ముద్దలు వేస్తున్న యజమానుల సొంత ఆస్తులు! దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది కట్టు బానిసలున్నారని భారత ప్రభుత్వం వెల్లడించింది. నిజానికి వారు అంతకు అనేక రెట్లు ఉండవచ్చని అధ్యయనాలు ధ్రువీకరించాయి. తరాల తరబడి బానిసత్వంలో కునారిల్లుతున్న వెట్టి కార్మికుల కుటుంబాలు ఎన్నో. ముత్తాత తీసుకున్న స్వల్ప రుణాన్ని చెల్లించేందుకే తరంతరం వెట్టి చాకిరీ చేయవలసిన దుస్థితిలో వారున్నారు. రుణ విముక్తి లేక జీవితాంతం బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నవారు ఎంతో మంది. 


సాగు చట్టాలకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు తమ జీవితాన్ని ఎలా మార్చనున్నాయో నాకు తెలియదని పంజాబ్‌కు చెందిన ఫకీర్ అనే వెట్టి కార్మికుడు నిస్పృహ వ్యక్తం చేశాడు. ఫకీర్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు. అతని యజమాని ఒక భూస్వామి. ఫకీర్ పుట్టకముందే అతని తల్లిదండ్రులు రూ.500 రుణం తీసుకున్నారు. ఆ రుణం తీర్చేందుకు ఫకీర్ కూడా తన ఐదేళ్ళ వయస్సు నుంచి (ఇప్పుడు అతని వయస్సు 25 ఏళ్లు) కట్టుబానిసగా మగ్గిపోయాడు. ఈ ఇరవై ఏళ్ళలో అతను అనేక మార్లు ఒక పశువు వలే విక్రయింపబడ్డాడు. కొనుక్కున్న ఏ యజమానీ అతన్ని మనిషిగా చూడలేదు. అతనికి భూమి లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు. యజమాని మాత్రమే ఉన్నాడు.  భారతీయ కుల వ్యవస్థలో అట్టడుగు వర్గానికి చెందిన 20కోట్ల మందిలో ఫకీర్ ఒకడు. వీరిలో 70 శాతం మందికి జీవనాధారం వ్యవసాయ రంగమే అయినప్పటికీ మొత్తం వ్యవసాయ భూమిలో 9 శాతం మాత్రమే వారి యాజమాన్యంలో ఉంది. వ్యవసాయరంగంలో పనిచేసే దళితులు అందరూ కూలీలే. వారిలో చాలా మంది కట్టు బానిసలు. ఆరుగాలమూ శ్రమించి రాజనాలు పండించే దళితులకు కనీస భూ వసతి లేకపోవడానికి చారిత్రక నేపథ్యం ఉంది. కుల వ్యవస్థ తోబాటు కొన్ని ప్రాంతాల్లో అధికారిక నిబంధనలు కూడా అందుకు కారణంగా ఉన్నాయి. పంజాబ్ లో బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1900 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ‘పంజాబ్ ల్యాండ్ ఎలియనేషన్ యాక్ట్’ దళితులు సొంత భూమి కలిగి ఉండడాన్ని నిషేధించింది. వెట్టిచాకిరి నుంచి విముక్తమయ్యేందుకు వీలు లేని విధంగా భూస్వాములు వారిపై ఆర్థిక నియంత్రణను కలిగి వున్నారు. అనారోగ్యం పాలయితే చికిత్సకు అయ్యే వ్యయాన్ని కూడా వారి రుణ భారానికి అదనంగా కలుపుతారు (కట్టు బానిసలు అని సమాజానికి చాటేందుకు వెట్టి కార్మికులకు శిరో ముండనం చేయించడం ఒక ఆనవాయితీ). వెట్టిచేసే మహిళలకు ఆరునెలలకుగాను కొద్దిపాటి గోధుమలు, అదే పురుషులకైతే రోజుకు నూరు, నూటయాభై రూపాయల కూలీ ఇస్తారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు కృషి చేస్తున్న ‘వలంటీర్స్ ఫర్ సోషల్ జస్టిస్’ అనే స్వచ్ఛంద సంస్థ గత అక్టోబర్ లో అతడిని వెట్టి విముక్తం చేసింది. నలుగురు సభ్యులు గల ఒక కుటుంబం ఒక నిర్దిష్ట వ్యవసాయ క్షేత్రంలో వెట్టి బానిసలుగా పని చేస్తున్నారని స్థానికులు అందించిన సమాచారం మేరకు ఫకీర్, అతని కుటుంబాన్ని ఈ సంస్థ రక్షించింది. 1985లో ప్రారంభమయిన ‘వలంటీర్స్ ఫర్ సోషల్ జస్టిస్’ ఇంతవరకు పంజాబ్, ఉత్తర భారతావని రాష్ట్రాలలో 30 వేల మందికి వెట్టి చాకిరీ, బాల కార్మికత నుంచి విముక్తి కలిగించారు. ఫకీర్ యజమానిపై ఈ సంస్థ కేసు కూడా పెట్టింది. అతనిపై ఇంకా న్యాయపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంది. న్యూఢిల్లీ శివారులో మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నిరసన కారులలో ఫకీర్ యజమాని కూడా ఒకరు. 


దళితులలో చాలా మంది ఎలాంటి భూ వసతి లేనివారే. ఒక కుంట భూమి సాధించుకునేందుకు కూడా వారు బతుకంతా పోరాడవలసిందే. ఈ కారణంగానే వారిని భూస్వాములు తమ సాగు చట్టాల వ్యతిరేక నిరసనల్లో కలుపుకొనిపోలేదు. ‘అయినా... తమ జీవితాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేని ఆందోళనకు దళిత వ్యవసాయ కూలీలు ఎందుకు మద్దతు నివ్వాలని’ ‘వలంటీర్స్ ఫర్ సోషల్ జస్టిస్’ ప్రధాన కార్యదర్శ గగన్ దీప్ కౌర్ ప్రశ్న. ‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైతే ఆందోళన చేశారో వారే దళితులను తమ కట్టు బానిసలుగా ఉంచుకున్నారు’ అని ‘జమీన్ ప్రాప్తి సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు ముకేశ్ మలౌధ్ వ్యాఖ్యానించారు. ఆ భూస్వాములలో అత్యధికులు జాట్ కులస్తులే. ‘పంజాబ్, హర్యానాలలో జాట్ రైతులు అందరూ దళితులను ఏదో ఒక విధంగా పీడించేవారే. ఈ రైతుల్లో చాలా మందికి దళిత బానిసలు ఉన్నారు. ఈ కారణంగానే దళిత రైతు సంఘాలు ఏవీ సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనలేదు’ అని ముకేశ్ చెప్పారు. అయితే, తమ ఆందోళనకు మద్దతు ఇచ్చి తీరాలని దళితులను భూస్వాములు ఒత్తిడి చేశారు. దళిత వర్గానికి చెందిన ప్రతి కుటుంబం నుంచి ఒకరు సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో పాల్గొనాలని, లేని పక్షంలో జరిమానా, సామాజిక వెలిని ఎదుర్కోవలసి ఉంటుందని భూస్వాములు తమను హెచ్చరించారని పంజాబ్ కు చెందిన విముక్త వెట్టి కార్మికుడు అర్జున్ అన్నాడు. ‘అధికార బీజేపీ వారూ, అగ్రకులస్తులైన భూస్వాములు దళితుల పీడకులే. వారు మమ్ములను కట్టు బానిసలుగా ఏళ్ళ తరబడి పని చేయించుకొని, ఇప్పుడు తమ ఆందోళనకు మద్దతు ఇవ్వమంటున్నారు’ అని ఈ దళిత భూ హక్కుల కార్యకర్త వ్యాఖ్యానించాడు.


పంజాబ్ లో ప్రతి జూన్ లో జరిగే నిమాని ఏకాదశి అనే పండుగ వేడుకల సందర్భంగా వ్యవసాయ వెట్టి కార్మికులను భూస్వాములు కొనుగోలు చేయడం పరిపాటి. ఈ వేడుకలు వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి ఉద్దేశించినవే అయినప్పటికీ అక్కడ వెట్టి కార్మికుల క్రయ విక్రయాలు కూడా జరుగుతాయి. ఒక్కో వెట్టికార్మికుడిని ఒక సంవత్సర కాలానికిగాను కొనుగోలు చేస్తారు. చాలా మంది వెట్టి కార్మికులను గొలుసులతో బంధించి నిమాని ఏకాదశి వాణిజ్య సంతకు తీసుకు వస్తారని, తాము స్వయంగా చూశామని గగన్ దీప్ కౌర్ చెప్పారు.


వెట్టి చాకిరీని 1976 నాటి ‘వెట్టిచాకిరీ వ్యవస్థ (నిషేధం) చట్టం’ అధికారికంగా రద్దుచేసింది. అయితే ఆ దుర్మార్గ ఆచారం ఇప్పటికీ అమలులో ఉంది. సామాజిక సంస్థలు, ప్రజా సంఘాలు జోక్యం చేసుకుంటే తప్ప అధికారులు ఆ చట్టాన్ని అమలుపరచేందుకు శ్రద్ధ చూపడం లేదు. వెట్టి కార్మికులు అందరూ నిరక్షరాస్యులే. వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమనే విషయం వారికి తెలియదు. వెట్టిచాకిరీ నుంచి విముక్తమయిన వారు సామాజిక సంస్థల మద్దతుతో ఆ దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించగలుగుతున్నారు. అర్జున్ వంటివారికి ఇప్పటికీ నిత్యం అనేక బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తమపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని మాజీ యజమానులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. 


గ్రామాల్లోని ఉమ్మడి భూములను అన్ని కులాల వారికి సమానంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1961లో ప్రభుత్వం ‘పంజాబ్ గ్రామీణ ఉమ్మడి భూముల క్రమబద్ధీకరణ చట్టం’ తీసుకువచ్చింది. ఈ ఉమ్మడి భూముల్లో 33 శాతాన్ని దళితులకు రిజర్వ్ చేశారు. అయితే చట్టం అమలులో చిత్త శుద్ధి కొరవడడం వల్ల అగ్ర కుల భూస్వాములే ఉమ్మడి భూములను ఉపయోగించుకుంటున్నారు. దళితులకు రిజర్వ్ చేసిన ఉమ్మడి భూములను పెత్తందారులే సాగు చేసుకుంటున్నారని  హక్కుల కార్యకర్తలు ఏకకంఠంతో చెబుతున్నారు. . 


వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే నిరసనోద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త్ కిసాన్ మోర్చా తమ డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించింది. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలన్నది ఆ డిమాండ్లలో ప్రధానమైనది. అయితే వ్యవసాయ కార్మికుల సమస్యలు, భూ పంపిణీ, వెట్టిచాకిరీ వ్యవస్థ రద్దు గురించిన ప్రస్తావన ఏ డిమాండ్ లోనూ లేదు! తాము నేరుగా తీసుకోని రుణాలను చెల్లించేందుకు తమవిగాని భూములలో అమానుష చాకిరీ చేస్తున్న రెండు లక్షల మందికి పైగా దళితులు వెట్టి చాకిరీ నుంచి విముక్తికై ఆశావహ దృక్పథంతో అలా ఎదురు చూస్తూనే ఉంటారు. 

సూర్యప్రకాశ్ మజుందార్

(‘ఫారిన్‌ పాలసీ.కామ్‌’)

Updated Date - 2021-12-14T05:52:43+05:30 IST