3 ముక్కలకు అడ్డంకులొద్దు!

ABN , First Publish Date - 2020-08-12T09:33:10+05:30 IST

మూడు రాజధానులు (వికేంద్రీకరణ), సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం

3 ముక్కలకు అడ్డంకులొద్దు!

  • రెండు చట్టాలపై వ్యాజ్యాలకు దీటుగా కౌంటర్లు
  • రూపకల్పన బాధ్యత సీనియర్‌ ఐఏఎ్‌సకు.. అధీకృత అధికారిగా శ్యామలరావు
  • సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు


అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులు (వికేంద్రీకరణ), సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్లను దీటుగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. వీటికి ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా.. హైకోర్టు ఆదేశానుసారం దాఖలు చేయాల్సిన కౌంటర్‌ అఫిడవిట్లను పకడ్బందీగా రూపొందించే బాధ్యతను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారికి ప్రత్యేకంగా అప్పగించారు. ఈ రెండు చట్టాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పలువురు రిట్‌ పిటిషన్లు వేస్తున్నారు. వాటిల్లో వివిధ ప్రభుత్వ శాఖలను కక్షిదారులుగా పేర్కొంటున్నారు. వాటిపై ప్రభుత్వం కొద్ది రోజుల్లో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలు వేటికవే అఫిడవిట్లు దాఖలు చేస్తే.. అవి అసమగ్రంగా ఉండే అవకాశం ఉంటుందని..


అదే జరిగితే వాటిని న్యాయస్థానాలు తోసిపుచ్చేందుకు ఆస్కారం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వాటిని సాధ్యమైనంత పకడ్బందీగా, సమగ్రంగా, లోపరహితంగా రూపొందించేందుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావును అధీకృత అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. అన్ని శాఖలను సమన్వయపరచుకుని.. వాటి నుంచి సమాచారాన్ని సేకరించి కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని సీఎస్‌ ఆయన్ను ఆదేశించారు. వివిధ శాఖలతోపాటు అవసరమైతే తన నుంచి కూడా కావలసిన సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు. ఏ కారణంవల్లనైనా శ్యామలరావు సెలవుపై వెళ్తే.. కౌంటర్లు రూపొందించే బాధ్యతను పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు నిర్వర్తించాలని నిర్దేశించారు.

Updated Date - 2020-08-12T09:33:10+05:30 IST