తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-03-13T01:14:53+05:30 IST

తిరుమల కొండపై మళ్లీ రద్దీ పెరిగింది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న క్రమంలో టీటీడీ దాదాపు రెండేళ్ల తర్వాత మార్చి మొదటివారం నుంచి దర్శనాల సంఖ్యను

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల కొండపై మళ్లీ రద్దీ పెరిగింది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న క్రమంలో టీటీడీ దాదాపు రెండేళ్ల తర్వాత మార్చి మొదటివారం నుంచి దర్శనాల సంఖ్యను పెంచిన విషయం తెలిసిందే. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల సంఖ్యను పెంచడంతో కొండపై వారాంతాల్లో రద్దీ పెరుగుతోంది. అలిపిరి నుంచి స్వామి కొండకు వేలాదిమంది భక్తులు కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, అన్నప్రసాద భవనం, అఖిలాండం, బస్టాండు, రోడ్లు, దుకాణ సముదాయాలు, కల్యాణకట్ట, లడ్డూల జారీ కేంద్రం, ఇతర సందర్శనీయ ప్రదేశాలు భక్తులతో రద్దీగా మారాయి. 


భక్తులకు టైంస్లాట్‌ ప్రకారం టికెట్లు ఇస్తుండంతో గంట నుంచి రెండు గంటల్లోనే స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 65,192 మంది స్వామిని దర్శించుకుంటున్నట్టు టీటీడీ తెలిపింది. 32,592 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించగా.. హుండీ ద్వారా రూ.4.41 కోట్ల ఆదాయం లభించింది. భక్తుల రద్దీతో వసతికి ఇబ్బందిగా మారింది. తిరుమలలో భక్తుల బసకు9 7,500కుపైగా గదులున్నాయి. వీటిలో ప్రస్తుతం 1,500కుపైగా గదులకు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో గదుల కొర త ఏర్పడింది. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు సీఆర్వో వద్ద గదుల కోసం గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వస్తోంది.

Updated Date - 2022-03-13T01:14:53+05:30 IST