తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-02-27T00:35:09+05:30 IST

దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న క్రమంలో టీటీడీ ఇటీవల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుపతిలో

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల: దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న క్రమంలో టీటీడీ ఇటీవల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా ఇచ్చే టైంస్లాట్‌ సర్వదర్శనాల టోకెన్ల సంఖ్యను పెంచింది. రూ.300 దర్శన టికెట్లు 25 వేలు, సర్వదర్శన టోకెన్లు దాదాపు 30 వేలు ఇస్తుండంతో భక్తుల రద్దీ  పెరిగింది. పైగా శని, ఆదివారాలు కావడంతో శ్రీవారి ఆలయంతో పాటు క్యూకాంప్లెక్సులు, మాడవీధులు, అన్నదాన భవనం, అఖిలాండం, బస్టాండ్‌ వద్ద భక్తుల సందడి నెలకొంది. శుక్రవారం 56,559మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.


ఇన్నాళ్లు కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే దర్శన టికెట్లు జారీ చేస్తున్న క్రమంలో తమిళనాడు గ్రామీణ ప్రాంత భక్తులు స్వామి దర్శనానికి దూరమయ్యారు. సాధారణంగా వీరితో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది. తిరిగి తిరుపతిలో టోకెన్లు భారీగా ఇస్తున్న క్రమంలో వారు తిరుమల కొండకు చేరుకుని స్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. ప్రత్యేకించి శనివారం తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో తిరుమలలో కనిపించారు. దుకాణ సముదాయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొవిడ్‌ కారణంగా వ్యాపారాలు లేక ఇబ్బంది పడిన దుకాణదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తిరుమలకు రద్దీ పెరగడంతో అలిపిరి చెక్‌పాయింట్‌ వద్ద తనిఖీల నేపథ్యంలో శనివారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల సంఖ్య పెరగడంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని భద్రతాధికారులు వేగంగా తనిఖీలు చేసి తిరుమలకు పంపారు.

Updated Date - 2022-02-27T00:35:09+05:30 IST