పంట.. వానపాలు కష్టం.. నీటిపాలు

ABN , First Publish Date - 2021-09-30T07:42:13+05:30 IST

అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానపాలైంది.

పంట.. వానపాలు కష్టం.. నీటిపాలు

  • భారీ వర్షం, వరదలకు కొట్టుకుపోయిన పంటచేలు
  • నిజామాబాద్‌ జిల్లాలో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
  • నిజాంసాగర్‌, ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌తో పంటల మునక
  • కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో రైతుల రాస్తారోకో
  • వాగుల ఉధృతికి మరో ఇద్దరు వ్యక్తులు, 2 ఎద్దులు మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానపాలైంది. గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి పంటచేలు వరదల్లో కొట్టుకుపోయి రైతు కష్టం నీటిపాలైంది. రాష్ట్రంలో పలు చోట్ల వాగులు ఉప్పొంగి, చెరువులు అలుగు పోయడంతో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఓ మహిళా రైతుకు చెందిన పసుపు, మొక్కజొన్న పంటలు వరదకు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.  నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో పెద్దవాగు మంగళవారం భారీగా ఉప్పొంగింది. దీంతో పెద్దవాగు చెక్‌డ్యాం కట్ట పూర్తిగా కోతకు గురై.. సమీపంలోని పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వాగు సమీపంలో కానూరు నాగమణి అనే మహిళా రైతు తన మూడెకరాల భూమిలో సాగు చేసిన పసుపు, అంతరపంట మొక్కజొన్న పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. బుధవారం పొలానికి వెళ్లి చూసిన నాగమణి.. రూ.లక్షల విలువైన పంట వరద పాలైందని గుండెలవిసేలా రోదించింది. బాధతో క్రిమిసంహారక మందు తాగేందుకు యత్నించింది. అక్కడే ఉన్న ఆమె కుటుంబ సభ్యులు చూసి అడ్డుకున్నారు. కాగా, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ వల్ల నాగిరెడ్డిపేట మండలంలో 2500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ స్థానిక రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. మరోవైపు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో నిర్మల్‌ జిల్లా బాసర మండలంలో సుమారు 900 ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో పెద్ద ఎత్తున పంటలు నీటమునగడంతో బాధిత రైతులు బ్యారేజీ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని అల్జాపూర్‌ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తెప్పపై గ్రామానికి వెళ్లి తాగునీటి బాటిళ్లు, అల్పాహారం అందించారు. 


వాగు ఉధృతికి గల్లంతై ఒకరు.. వాగులో ఎడ్లబండి మునిగి మరొకరి మృతి

భారీ వర్షాల కారణంగా వికారాబాద్‌ జిల్లా పులుసుమామిడి గ్రామంలోని మద్గుల్‌ చిట్టంవాగు ఉధృతికి ఓ పశువుల కాపరి కొట్టుకుపోయి మృతి చెందాడు. మద్గుల్‌ చిట్టెంపల్లికి చెందిన హరిజన్‌ కిష్టయ్య(50) ఈ నెల 27న పశువులను అడవికి తోలుకెళ్లి.. రాత్రి తిరిగి వస్తుండగా వాగు ఉప్పొంగింది. దీంతో వాగు దాటుతున్న క్రమంలో ఉధృతికి కొట్టుకుపోయాడు. బుధవారం ఓ పొలం సమీపంలో కిష్టయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడ్లబండి వాగులో మునిగి ఓ వ్యక్తితోపాటు రెండు ఎద్దులు మరణించాయి. టైర్లతో కూడిన ఎడ్లబండిపై ఇసుక రవాణా చేసే లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్‌నగర్‌ మామిడితోట కాలనీకి చెందిన సన్నబోయిన నాగరాజు(33) బుధవారం ఉదయం యథావిధిగా  బండిపై మొర్రేడువాగు వద్దకు వెళ్లాడు. భారీ వర్షాలకు వాగు కోతకు గురై.. లోతు పెరిగిన విషయాన్ని అతడు గుర్తించలేదు. అలాగే ఎడ్లబండిని వాగులోకి దించగా.. బండి, ఎద్దులతోపాటు తాను కూడా మునిగిపోయాడు. 


గోదావరి ఉగ్రరూపం

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద 12.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద 43 అడుగుల ఎత్తుతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 39.9 అడుగులుగా నమోదైంది. మరోవైపు కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరదనీటి ప్రవాహం మరింత పెరిగింది. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 589.90 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,59,974 కూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. పులిచింతల 89,420 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో తొమ్మిది క్రస్ట్‌గేట్లనుఉంచి 1,01,242 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 1.50 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. 


రేపు భారీ వర్ష సూచన 

అల్పపీడనం కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.

Updated Date - 2021-09-30T07:42:13+05:30 IST