25 లక్షల ఎకరాల్లో పంట నష్టం

ABN , First Publish Date - 2021-09-18T08:18:30+05:30 IST

నిరుడు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు ఓ భయానక అనుభవం.

25 లక్షల ఎకరాల్లో పంట నష్టం

  • దెబ్బతిన్న పంటల విలువ రూ.8,633 కోట్లు.. 
  • వివరాలు తెప్పించుకుని అంచనా వేసిన ప్రభుత్వం
  • కేంద్రానికి లేఖలు రాసిన  సీఎం, సీఎస్‌
  • నష్టమే లేదని హైకోర్టుకు సమాచారం
  • రాష్ట్ర సర్కారు వైఖరిపై రైతుల్లో చర్చ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నిరుడు  ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలు ఓ భయానక అనుభవం. కుండపోత వానలు.. వరద బీభత్సం.. తెగిన చెరువులు, కుంటలు.. నీట మునిగిన పంటలు.. అన్నదాతల ఆర్తనాదాలు.. అన్నీ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా రెండు, మూడు రోజులు కాస్త భారీ వర్షాలు పడితే.. నాటి అనుభవాన్ని గుర్తుచేసుకుని బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఇప్పుడు అదంతా మరిచిపోయి రాష్ట్ర ప్రభుత్వం.. పంట నష్టమే జరగలేదని ఇప్పుడు సాక్షాత్తూ హైకోర్టుకు చెబుతుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 33 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ నిరుడు వర్షాలు కురిశాయి. 


ఆగస్టులో 78ు, సెప్టెంబరులో 94% అధిక వర్షపాతం నమోదైంది. వరి, పత్తి, మొక్కజొన్న, కంది, మిర్చి కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. 25 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నాడు నష్టం సర్వే కోసం ప్రత్యేక ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. ఏఈవో, ఏవోల నుంచి వివరాలు తెప్పించుకుని అంచనా నివేదికలు మాత్రం తయారుచేయించింది. రూ.8,633 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని ప్రకటించింది. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. కేంద్రం ఎస్డీఆర్‌ఎఫ్‌ కింద రూ.599 కోట్లు విడుదల చేసింది. 


అన్నదాతల ఎదురుచూపులకు నిరాశే..

రాష్ట్రంలో పంటల బీమా పథకాలు ఏవీ అమలులో లేకపోవడంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారంతో ఉపశమనం కలుగుతుందని రైతులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నష్టం ‘అంచనాలు’ మాత్రమే రూపొందించామని, అవి అంతిమం కాదంటోంది. అంతేగాక, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)ను ఐచ్ఛికం అని ప్రకటించినందున అందులో చేరలేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. హైకోర్టుకు చెప్పడంతో రైతులంతా ఆశ్చర్యపోతున్నారు. అంటే, సీఎం, సీఎస్‌ కేంద్రానికి రాసిన లేఖలు ఉత్తుత్తివేనా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్టం భారీగా జరిగిందని రైతులు మొత్తుకుంటుంటే.. చివరకు నయాపైసా పరిహారం ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే విషయం తేటతెల్లమైంది. 

Updated Date - 2021-09-18T08:18:30+05:30 IST