వైసీపీ ఎంపీ మాగుంటపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-08-06T08:34:16+05:30 IST

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. జూన్‌ 21న ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదుతో

వైసీపీ ఎంపీ మాగుంటపై క్రిమినల్‌ కేసు

  • సర్వేపల్లిలో మట్టి తవ్వకాల కేసులో ‘ఏ2’
  • జూన్‌ 21నే అధికారుల ఫిర్యాదు ఆ వెంటనే కేసు.. 
  • ఆలస్యంగా వెలుగులోకి
  • తదుపరి చర్యలపై పోలీసుల తర్జనభర్జన


నెల్లూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. జూన్‌ 21న ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదుతో నమోదైన కేసులో ఎంపీని ఏ2 నిందితుడిగా పేర్కొన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపారన్న అభియోగాలతో మాగుంటపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఎంపీపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 


వివాదాస్పదంగా మట్టి తవ్వకాలు

వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి తూపిలి ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరుతో 2వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు మే 28న దరఖాస్తు చేసుకోగా, ఆ మరుసటి రోజే ఇరిగేషన్‌ అధికారులు అనుమతులు జారీ చేశారు. ఆ తర్వాత జూన్‌ 5న కనుపర్తిపాడులోని మాగుంట ఆగ్రో ఫార్మస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు మట్టి అవసరమని ఎం.శ్రీనివాసులురెడ్డి తండ్రి రాఘవరెడ్డి పేరుతో 3వేల క్యూబిక్‌ మీటర్ల తవ్వకాలకు దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకున్నారు. అలాగే జూన్‌ 18న బి.శ్రీధర్‌రెడ్డి, ఎం.శ్రీనివాసులురెడ్డి చెరో వెయ్యి క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతులు పొందారు. అయితే, ఈ మట్టిని అనుమతులు తీసుకున్న చోటకు కాకుండా మార్కెట్లోకి తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఆరోపిస్తూ వచ్చారు. రాత్రివేళల్లో తవ్వకాలు జరుగుతున్న ఫొటోలను కూడా బహిర్గతం చేశారు. ఈ వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు రిజర్వాయర్‌లో కొలతలు వేసి అనుమతులకు మించి తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. 8వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా, 18,629 క్యూబిక్‌ మీటర్లు తవ్వినట్లు తేల్చారు. 


ఎంపీ సంతకం ఫోర్జరీ?

అనుమతులకు మించి తవ్వకాలు జరిపిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన ముగ్గురిపై ఇరిగేషన్‌ డీఈ, జేఈ వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏ1గా తూపిలి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏ3గా బి.శ్రీధర్‌రెడ్డిని చేరుస్తూ 427ఐపీసీ, 21(4) ఎంఎండీఏఆర్‌ఏ సెక్షన్ల కింద జూన్‌ 21న కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ కేసును పక్కన పెట్టారు. కాగా, సర్వేపల్లి రిజర్వాయర్‌లో తవ్వకాలకు సంబంధించి అనుమతులు, కేసు నమోదు వంటి వివరాలను ఇటీవల టీడీపీ నేతలు ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించారు. ఈ క్రమంలోనే ఎంపీ మాగుంటపై కేసు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఎం. శ్రీనివాసులురెడ్డి తండ్రి రాఘవరెడ్డి అంటే ఆయన మాగుంట శ్రీనివాసులురెడ్డి అని ఇరిగేషన్‌ అధికారులు, పోలీసులకు తెలియలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి తవ్వకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నారో కూడా చూడకుండా అధికార నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అనుమతులిచ్చారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 


ఫోర్జరీ సంతకంతో ఇరికించారు: సోమిరెడ్డి

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఒంగోలు వైసీపీ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డికి తెలియకుండా ఆయన పేరుతో గ్రావెల్‌ తవ్వకాలకు వైసీపీ నేతలు ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తు పెట్టిన ఫలితంగానే కేసు నమోదైందని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారం వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హ స్తం ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం సోమిరెడ్డి మీడియాతో మా ట్లాడుతూ.. ‘సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ అక్ర మ తవ్వకాలపై మేం కొంతకాలంగా పోరాడుతున్నాం. దీంతో చుట్టుపక్కల గ్రామస్థులు తవ్వకాలను రికార్డు చేసి అధికారులకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇరిగేషన్‌ అధికారులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసులో రెండో నిందితుని గా మాగుంట పేరును చేర్చారు. మాగుంటది పెద్ద పారిశ్రామిక కుటుం బం. వాళ్లు సాధారణ మట్టి తవ్వకాలకు దరఖాస్తు చేస్తారా.. అక్రమ తవ్వకాలు చేస్తారా లేదా అన్నది ఆలోచించకుండా కేసు పెట్టారు’’ అని అన్నారు. 

Updated Date - 2021-08-06T08:34:16+05:30 IST