బాబుపై క్రిమినల్‌ కేసు

ABN , First Publish Date - 2021-05-08T08:38:13+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలులో శుక్రవారం క్రిమినల్‌ కేసు నమోదైంది. ఆయన ఎన్‌-440కే కరోనా స్ట్రెయిన్‌ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా పలు టీవీ చానళ్లలో

బాబుపై క్రిమినల్‌ కేసు

కరోనా స్ట్రెయిన్‌పై భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఓ లాయరు ఫిర్యాదు

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కర్నూలు పోలీసులు


కర్నూలు, మే 7 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలులో శుక్రవారం క్రిమినల్‌ కేసు నమోదైంది. ఆయన ఎన్‌-440కే కరోనా స్ట్రెయిన్‌ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా పలు టీవీ చానళ్లలో మాట్లాడారంటూ మాసపోగు సుబ్బయ్య అనే న్యాయవాది కర్నూలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ 188, 505(1)బి,(2) సెక్షన్లతో పాటు ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్షన్‌ 54 కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.


ప్రజలను కాపాడటం చేతగాక బాబుపై కేసులా?: టీడీపీ

‘‘కరోనా విలయ తాండవం నుంచి ప్రజలను కాపాడటం చేతగాక మాజీ సీఎం చంద్రబాబుపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. ఈ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప ప్రజలు పట్టడం లేదు’’ అని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, నిమ్మకాయల చిన రాజప్ప, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు తదితరులు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో దీనిపై స్పందించారు. ‘‘కరోనా వైర్‌సలో పరివర్తన చెందిన ఎన్‌ 440 కే రకాన్ని కర్నూలులో కనుగొన్నారని, 15 రెట్ల వేగంతో అది విజృంభించి, వ్యాపిస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ ఈ నెల 4వ తేదీన ఒక వార్త ప్రచురించింది. 


ఆ వైర్‌సతో చనిపోయిన వ్యక్తి ఫొటోను కూడా ఆ పత్రిక ప్రచురించింది. టైమ్స్‌ ఆఫ్‌ఇండియా, డీసీ దిన పత్రికలు కూడా ఇవే తరహా వార్తలను ప్రచురించాయి. కొన్ని జాతీయ టీవీ చానళ్ళు ఈ కొత్త వైర్‌సపై చర్చా గోష్టులు కూడా నిర్వహించాయి. ఇదే సమాచారాన్ని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం చంద్రబాబు ఈ విషయం తెలిపారు. ప్రభుత్వం వద్ద ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఉంటే చెప్పవచ్చు. కాని సమాచారం చెప్పినందుకు ఆయనపై కేసు పెట్టడం దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం’’ అని వారు వ్యాఖ్యానించారు.  

Updated Date - 2021-05-08T08:38:13+05:30 IST