నేరాల కంట్రోల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-08-05T09:10:12+05:30 IST

చిత్తశుద్ధి, సంకల్ప బలం, పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే..

నేరాల కంట్రోల్‌ సెంటర్‌

  • నేర రహిత తెలంగాణను తీర్చిదిద్దాలి
  • సంకల్ప బలం ఉంటే అనుకున్నది సాధించగలం
  • అందుకు నిదర్శనమే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
  • ఈ సెంటర్‌ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాలి
  • సంస్కారవంతమైన పోలీసింగ్‌ కొనసాగించాలి
  • అమెరికా తరహా సంకల్పంతో డ్రగ్స్‌ కట్టడి సాధ్యం
  • అర్ధరాత్రి సైతం మహిళలు పని చేసుకునేలా
  • తెలంగాణలోనూ సింగపూర్‌ విధానం రావాలి
  • సైబర్‌ నేరాల నియంత్రణకు డీజీ స్థాయి అధికారి
  • ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ 
  • ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): చిత్తశుద్ధి, సంకల్ప బలం, పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే.. అనుకున్నది సాధిస్తామని, అందుకు పోలీసు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణమే నిదర్శనమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.  హైదరాబాద్‌లో ఇంతగొప్ప కమాండ్‌ కంట్రోల్‌ రూం వస్తుందని ఎవరూ భావించలేదని, కానీ సంకల్పంతో సాధించామని చెప్పారు. ఈ సెంటర్‌ పోలీసు శాఖకు మూలస్తంభంగా నిలవడమే కాక.. పరిపాలనకూ అద్భుతంగా ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు. అంతర్జాతీయస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో.. బంజారాహిల్స్‌లో ఏడెకరాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సీఎం గురువారం మధ్యాహ్నం 1.21 గంటలకు ప్రారంభించారు. ఈ సెంటర్‌ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాలని.. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశానికే ఆదర్శంగా నిలవాలని పోలీసులకు పిలుపునిచ్చారు. నేరగాళ్లు కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో మోసాలు చేస్తున్నారని..  వారిని నిలువరించేందుకు ప్రతి పోలీసూ అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు. సంస్కారం లేని చదువు వ్యర్థమన్న సీఎం.. ఫ్రెండ్లీ, సంస్కారవంతమైన పోలీసింగ్‌తో తెలంగాణ పోలీసులు దేశానికే దిక్సూచిగా మారాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. 


అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం.. అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాతే ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సెంటర్‌ సాధారణ సమయంలో ఒకలాగా ఉపయోగపడుతుందని.. విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సెంటర్‌లాగా ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు. నిజానికి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సిందని.. కానీ కరోనా, ఇతర ఆటంకాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని చెప్పారు. ‘‘ఈ భవన నిర్మాణం చేపట్టిన సమయంలో 24 అంతస్తుల్లో నిర్మాణం చేయాలనుకున్నాం. కానీ పౌర విమానయాన చట్టాలు, అనుమతుల కారణంగా 20 అంతస్తులకు పరిమితం చేశాం. భవనం పైకి వెళ్లి చూస్తున్నప్పుడు చాలా సంతోషం కలిగింది. హైదరాబాద్‌లో ఇంత మంచి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రపంచస్థాయిలో తెలంగాణ పోలీస్‌కు మంచి గుర్తింపు ఉంది. నేరాల నియంత్రణ, శిక్షల్లో మన పోలీసులు సత్తా కనబరుస్తున్నారు. వారికి అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా మరింత మెరుగైన సేవలు కొనసాగిస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. మానవ సమాజం ఉన్నంతకాలం పోలీసింగ్‌ ఉంటుందని, ఎంత ఉత్తమమైన పోలీసింగ్‌ ఉంటే సమాజానికి అంత భద్రత ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సంస్కరణలు పోలీసు శాఖ నవీకరణకు అత్యంత అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.  


మాజీల సలహాలు, సూచనలతో..

గతంలో పోలీస్‌ శాఖలో పనిచేసిన వారు కూడా ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి ఎంతో సహకారం అందించారని.. వారి సహకారం లేకపోతే ఇప్పుడు తాను ఇలా నిల్చుని మాట్లాడే పరిస్థితి లేదని సీఎం గుర్తుచేసుకున్నారు. ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన సమయంలో ఉన్న డీజీపీ అనురాగ్‌శర్మతో పాటు ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు. భవిష్యత్తులో కూడా మాజీ అధికారుల సూచనలు తీసుకుని ఈ భవనాన్ని పూర్తి స్థాయిగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. అలాగే..  తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఆర్టీసీ ఎండీ ఇంటికి వెళ్లి ఆయనతో సమాలోచన జరిపానని.. నాటి సమాలోచనల ఫలితంగా రూ. 13 కోట్ల అప్పుల్లో ఉన్న ఆర్టీసీని రూ. 14 కోట్ల లాభాల్లోకి తేగలిగామని సీఎం గుర్తుచేశారు. దినేశ్‌రెడ్డి, అరవింద్‌ కుమార్‌, ఏకే ఖాన్‌ తదితరుల సేవలను పేరుపేరునా ప్రస్తావించి కొనియాడారు. రిటైర్‌ అయిన అధికారులందరూ నగరంలోనే ఉండటం అదృష్టంగా భావించి వారి సలహాలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు. అదే విధంగా ఈ ఏడాది డీజీపీ మహేందర్‌ రెడ్డి రిటైరవుతున్నందున ఆయన కూడా యూనిఫాం లేకున్నా సేవలందించాలని సీఎం కోరారు. 


డ్రగ్స్‌ ముప్పు..

మాదకద్రవ్యాలు సమాజానికి అత్యంత ప్రమాదకరంగా.. సమాజ జీవికనే ప్రశ్నించే మహమ్మారిగా మారాయని సీఎం కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల భవితవ్యాన్ని నాశనం చేసే డ్రగ్స్‌ ఆటంబాంబు కంటే చాలా ప్రమాదకరమైనవని హెచ్చరించారు. మానవ జీవితాలనే సవాల్‌ చేస్తున్న డ్రగ్స్‌ నియంత్రణ దిశగా.. పాఠ్యాంశాల్లో మార్పు చేయాల్సిన అవసరంపై విద్యావేత్తలు ఆలోచించాల్సి ఉందన్నారు. అత్యంత శక్తివంతమైన దేశంగా భావించే అమెరికాలోని న్యూయార్క్‌ నగరాన్ని కొన్నేళ్ల క్రితం దాకా ఈ మాదకద్రవ్యాల సమస్య పట్టి పీడించిందని.. కానీ, ఆ నగర పోలీస్‌ కమిషనర్‌, మేయర్‌ సంకల్పం తీసుకుని 96ు మేర డ్రగ్స్‌ను నియంత్రించారని సీఎం తెలిపారు. ‘‘మనం కూడా అనుకుంటే.. న్యూయార్క్‌ సిటీ తరహాలో డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేయగలుగుతాం’’ అని ధీమా వెలిబుచ్చారు. అలాగే.. మహిళలు అర్ధరాత్రి సైతం నిర్భయంగా తమపనులు చేసుకునే విధానం సింగపూర్‌లో ఉందని రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఆ విధానం రావాలని సీఎం ఆకాంక్షించారు. 


సింగపూర్‌ పోలీసు అధికారులు చెప్పిన మాటలను పరీక్షించేందుకు.. తమతోపాటు వచ్చిన ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని అర్ధరాత్రి రోడ్డుపై ఉంచి, అది నిజమేనని నిర్ధారించుకున్నామని తెలిపారు. ‘‘అలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా రావాలి. అనుకుంటే వస్తది. హైదరాబాద్‌లో నేరాలు చాలావరకూ తగ్గాయి’’ అని సీఎం చెప్పారు. ఇక.. సైబర్‌ నేరాలు తీవ్రస్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల్ని గుర్తించి అమలు చేయాల్సిందిగా డీజీపీ మహేందర్‌ రెడ్డికి సూచించినట్లు తెలిపారు. డీజీ, ఏడీజీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి సైబర్‌ నేరాలను కట్టడి చేయాలని నిర్ణయించామని వివరించారు. రాష్ట్రంలో గతంలో పేటకో పేకాట క్లబ్బు, పూటకో గబ్బు ఉండేదని.. దాన్ని తాము కట్టడి చేశామని పేకాట నిర్మూలనలో 99ు విజయం సాధించామని చెప్పారు.


సీఎం ఆలోచనలకు రూపమే: డీజీపీ మహేందర్‌రెడ్డి

ఎన్నో ఏళ్ల నుంచి తాము కలలుగంటున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావడం పట్ల డీజీపీ మహేందర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు రూపమే కమాండ్‌ కంట్రోల్‌ రూం అని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం ఆదేశాల మేరకు న్యూయార్క్‌, లండన్‌, వాషింగ్టన్‌ డీసీ నగరాలను సందర్శించి.. అక్కడ సేకరించిన సమాచారంతోనే దీనికి రూపకల్పన చేశామని ఆయన వివరించారు. సీఎం కేసీఆర్‌ పోలీస్‌ శాఖకు అవసరమైన వనరులను అందించి, సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నాణమైన సేవలందించేందుకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో.. నిరంతరం ఈ సెంటర్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 


దేశానికే రోల్‌ మోడల్‌: సీఎస్‌

తెలంగాణలో ప్రారంభమైన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. అన్ని శాఖల అధికారులూ ఇక్కడ నుంచి సమన్వయం చేసుకొని, మెరుగైన సేవలందించాలని ఆయన కోరారు.


ముత్యాల నగరం సిగలో నీలి ముత్యం: సీవీ ఆనంద్‌

ముత్యాల నగరంగా పేరుగాంచిన నగరం సిగలో నీలి ముత్యంలా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిలిచిపోతుందని.. సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు. పోలీస్‌ శాఖ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి నిధులు అందించి సహకరించిన సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


మహేందర్‌ రెడ్డి వల్లే..

‘‘కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి ముఖ్య ప్రేరణ, కర్త, రూపకర్త డీజీపీ మహేందర్‌ రెడ్డి’’ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ‘‘గొప్ప పనితనాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఒక గొప్ప వేదిక నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఉపయోగంలోకి తెచ్చుకున్నందుకు పోలీస్‌  శాఖకు అభినందనలు. ఆర్‌ అండ్‌ బీ, నిర్మాణ సంస్థకు, టెక్నాలజీని సమకూర్చిన సంస్థకు అభినందనలు. భవన నిర్మాణంలో పనిచేసిన ప్రతి కార్మికుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.


మూడున్నర గంటలకుపైగా అక్కడే సీఎం

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్దకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. 1.21 గంటలకు రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. అనంతరం దాదాపు మూడున్నర గంటలపాటు అక్కడే ఉన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల అనంతరం.. 1.35 గంటలకు టవర్‌-ఏలోని 18వ అంతస్తులో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆ తర్వాత హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌కు సీఎం బొకే ఇచ్చారు. అనంతరం సీపీని సీటులో కూర్చోబెట్టిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులతో కలిసి సెంటర్‌లోని అన్ని టవర్లనూ కలియదిరిగారు. ఒక్కో టవర్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు, వాటి పని తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసు మ్యూజియంలో ఏర్పాటు చేసిన పాతకాలం నాటి, ఆధునిక పోలీసు సమాచార వ్యవస్థను ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత.. నగర పోలీసు శాఖలో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూశారు. 2.15 గంటలకు ఆడిటోరియానికి చేరుకున్న సీఎంకు.. కమాండ్‌ కంట్రోల్‌ పనితీరు గురించి, సీసీ కెమెరాల వ్యవస్థ గురించి అధికారులు వివరించారు. అంతేకాదు.. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు, భద్రాచలం ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అక్కడి పరిస్థితిని నేరుగా చూపించారు. కాళేశ్వరం, గిడ్డెన్న, తదితర ప్రాజెక్టుల వద్ద, హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను కూడా సీఎం ఈ సందర్భంగా గమనించారు. సాయంత్రం 4.40 నిమిషాలకు అక్కడి నుంచి వెనుదిరిగారు.

Updated Date - 2022-08-05T09:10:12+05:30 IST