Abn logo
May 12 2021 @ 00:28AM

‘ప్రతికూలత’ను పక్కన పెట్టేస్తాడు

ఛతేశ్వర్‌ పుజారా... భారత టెస్ట్‌ క్రికెట్‌లో ‘ది వాల్‌’ రాహుల్‌ ద్రవిడ్‌ తరువాత అంతటి పేరు తెచ్చుకున్న బ్యాట్స్‌మన్‌. ఆ స్థాయిలో రాణించాలంటే ఒత్తిడిలెన్నింటినో తట్టుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. అందుకు అతడు ఎంచుకున్న మార్గం యోగ, ధ్యానం. ఇవే తన మనసులో ప్రతికూల ఆలోచనలు రాకుండా కట్టడి చేస్తాయంటాడు పుజారా. యువతరానికి అతడు చెప్పే పాఠం ఒక్కటే... ఏ రంగంలోనైనా సరే అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఒత్తిడిని జయిస్తేనే సాధ్యమని...  


‘‘ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఒకవేళ మీ మనసు నెగటివ్‌ జోన్‌లోకి వెళ్లిపోతే... మీ చుట్టూ ఉన్నవన్నీ ప్రతికూలంగానే మారిపోతాయి. అలాంటి ఆలోచనలేవీ రాకుండా ఉండేందుకు నేను రోజూ యోగ, ధ్యానంతో పాటు ప్రార్థనలు చేస్తాను. ఇది నా ఆలోచనా విధానం సానుకూల దృక్పథంలో సాగేందుకు దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు క్రికెట్‌ ఆడే రోజుల్లో నేను విపరీతమైన ఒత్తిడికి లోనయ్యేవాడిని. దాన్ని తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. అమ్మ దగ్గరకు వెళ్లి బిగ్గరగా ఏడుస్తూ... అదే విషయం చెప్పేవాడిని. ఇక క్రికెట్‌ ఆడననేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. 


నాకు పదిహేడేళ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆ బాధ భరించలేక ఒత్తిలోకి వెళ్లిపోయాను. దాని నుంచి బయట పడడానికి ఓ ఆధ్యాత్మిక గురువును సంప్రతించాను. ‘మీ అమ్మ లేదన్న నిజాన్ని అంగీకరించడం కష్టమే. కానీ ఇది జీవితం. అది ముందుకు సాగాలన్నా, అనుకున్న లక్ష్యాలను చేరాలన్నా ముందు నిన్ను నువ్వు నమ్మాలి’ అని ఆ గురువు చెప్పారు. ఆయన మాటలే నాకు మనోధైర్యాన్నిచ్చాయి. 

కొంతకాలానికి అర్థమైంది... ‘నమ్మకం’ అనే పదాన్ని నా జీవితంలో, నా ఆటలో, నేను పూజించే భగవంతుడి విషయంలో కూడా వాడవచ్చని! ఇప్పుడు ఆ నమ్మకమే నన్ను నడిపించే ఇంధనయమైంది. 

ఐపీఎల్‌ వేలంలో మొదట నన్ను ఎవరూ కొననప్పుడు చాలా బాధపడ్డాను. అవమానకరంగా భావించాను. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. ఎంత ప్రయత్నించినా నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాను. కానీ ఆ తరువాత నాకు నేను సర్దిచెప్పుకున్నాను. నా నియంత్రణలో ఉన్నవి మాత్రమే నేను చేయగలననే వాస్తవాన్ని గ్రహించాను. ఆటగాళ్లను కొనుక్కోవాలా వద్దా అన్నది ఫ్రాంచైజీల ఇష్టం. అంటే అది నా పరిధిలో లేనిది. అయితే పొట్టి క్రికెట్‌లో కూడా సత్తా చాటాలన్న కసితో కఠోర శ్రమ మొదలుపెట్టాను. నన్నడిగితే ఒత్తిడిని జయించేందుకు ఆటగాళ్లు తప్పనిసరిగా స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌లను సంప్రతించాలంటాడు. దేశవాళీ క్రికెట్‌ నుంచి అంతర్జాతీయ స్థాయికి వచ్చిన క్రికెటర్లు ఎంతోమంది ఒత్తిడిని తట్టుకోలేక చిత్తయ్యారు. అలాంటి క్రీడాకారులనెందరినో చూశాను. అలాగే స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ల సహకారంతో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లనూ చూశాను. అందుకే ప్రతిఒక్క క్రీడాకారుడికీ, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేవారికి సైకాలజిస్ట్‌ అవసరం తప్పనిసరిగా ఉంటుందంటాను. నేను కూడా చాలాసార్లు వారిని సంప్రతించాను. మెరుగైన ఫలితాలు సాధించాను. 

మెదడులో మెదిలే ఆలోచనలను బట్టే మన ప్రవర్తన, పనితీరు ఉంటాయి. బుర్రలో ఒక స్పష్టత అనేది లేకపోతే అయోమయంలోకి వెళ్లిపోతాం. అదే కనుక మనసు సంతోషకర స్థితిలో ఉంటే జీవితం కూడా అంతే ఆనందకరంగా సాగిపోతుంది. అంతిమంగా చెప్పేది ఒక్కటే... దృష్టి పెట్టాల్సింది ప్రయత్నం మీద... ఫలితంపై కాదు.’’ 


Advertisement