Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

‘రంజి’ల్లిన నాటి క్రికెట్

twitter-iconwatsapp-iconfb-icon
రంజిల్లిన నాటి క్రికెట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు రంజీట్రోఫీ స్థానంలో భారతదేశ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్‌గా వున్నది. ఐపిఎల్ అట్ట హాసాలు, ఆర్భాటాలు, ఆడంబరాలు ఎలా వున్నప్పటికీ తమ తమ రాష్ట్రాల టీమ్‌ల పట్ల క్రికెట్ అభిమానుల విధేయతలు ప్రగాఢంగా వున్నాయని నేను భావించడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జయాపజయాలను అనుసరిస్తున్న ఇద్దరు మిత్రులు ముప్ఫై, నలభై సంవత్సరాల అనంతరం తమ టీమ్‌ల గురించి వాదించుకుంటారా అనేది సందేహమే.


నామేధో వికాసంలో కలకత్తా (నేటి కోల్‌కతా) ఒక మైలురాయి. ఆ మహానగర మేధావులు నన్ను విశేషంగా ప్రభావితం చేశారు. నా మేధస్సును చైతన్య పరిచి, తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఆ ధీమంతులతో సంభాషించడాన్ని నాకు నేనుగా ఆపలేను. నేను వ్యక్తిగతంగాను, బహిరంగంగాను అనేక వాదోపవాదాలు చేసిన కోల్‌కతా మేధావి రాజకీయ సైద్ధాంతిక వేత్త పార్థా ఛటర్జీ. పార్థా నాకు నా మొదటి ఉద్యోగాన్ని - సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ లో- ఇచ్చారు. భారతీయుల అభిమాన క్రీడ గురించి కూడా ఆయన, నేను తరచూ వాదించుకునే వాళ్ళం. టెస్ట్ క్రికెట్ నుంచి డ్రాను రద్దు చేయదలుచుకున్నట్టు 1990 దశకంలో జగ్మోహన్ దాల్మియా ప్రకటించారు. డబ్బు చెల్లించి ఆట చూడడానికి వచ్చేవారు ఒక ‘ఫలితాన్ని’ కోరుకుంటారు కనుక టెస్ట్ మ్యాచ్‌లను లాంగర్ వెర్షన్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌గా మార్చి వేయాలని ఆయన ప్రతిపాదించారు. నేను ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాను. డ్రాలో ఒక విశిష్ట శోభ, నాటకీయ భావోద్విగ్నత వున్నాయని; ఎదుటి పక్షానికి విజయాన్ని నిరాకరిస్తూ హనీఫ్ మొహమ్మద్, సునీల్ గవాస్కర్‌లు గంటల తరబడి బ్యాటింగ్ చేయడమే అందుకొక నిదర్శనమని నేను రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నాను. పార్థా వెన్వెంటనే పత్రికా ముఖంగా ప్రతిస్పందిస్తూ క్రికెట్‌లో చోటుచేసుకుంటున్న వినూత్న మార్పులను గుర్తించలేక పోతున్నానని అంటూ నా అభిప్రాయాలను కొట్టివేశారు. 


చరిత్ర, రాజకీయాలు, క్రికెట్ గురించి మా మధ్య జరిగే చర్చల్లో మరో కోల్‌కతా మేధావి రుద్రాంశు ముఖర్జీ కూడా పాల్గొనేవారు. క్రికెట్ అభిమానులుగా పార్థా, రుద్రాంశులకు నాకులేని రెండు గొప్ప అనుకూలతలు వున్నాయి. ఇరువురూ వయస్సులో నా కంటే పెద్దవారు. క్రికెట్ గురించిన వారి జ్ఞాపకాలు సువిస్తారమైనవి. కోల్‌కతాలో పుట్టి పెరిగినందున బాల్యం నుం చి వారికి (లార్డ్స్, మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తరువాత) గొప్ప క్రికెట్ మైదానమైన ఈడెన్ గార్డెన్స్ అందుబాటులో వుండేది. అక్కడ వారు ఎన్నో టెస్ట్ మ్యాచ్‌లు చూశారు. హజారే, ఉమ్రిగర్, సోబెర్స్, హార్వే మొదలైన మహా క్రికెటర్ల బ్యాటింగ్ ప్రతిభను బౌలింగ్ నైపుణ్యాన్ని నా మిత్రులు ప్రత్యక్షంగా వీక్షించారు. పార్థా, రుద్రాంశులకు లేని ఒక గొప్ప అనుకూలత నాకు వున్నది. నా సొంత రాష్ట్రమైన కర్ణాటక గత దశాబ్దాలలో పలుమార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్నది. నా మిత్రుల రాష్ట్రమైన బెంగాల్ చివరిసారి రంజీ ట్రోఫీని గెలుచుకున్నది బ్రిటిష్ వలసపాలకుల కాలంలో! నా కోల్‌కతా మిత్రులు తమ యవ్వనారంభ దశలో బెంగాల్ టీమ్ రంజీ ఫైనల్‌కు చేరడాన్ని కనీసం ఐదు సార్లు చూశారు. ప్రతి ఫైనల్ మ్యాచ్‌లోనూ బెంగాల్ ఓడిపోయింది. బెంగాల్‌ను నాలుగుసార్లు ఓడించిన ఘనత బొంబాయి టీమ్‌ది. ఈ టీమ్ 1958 నుంచి 1973 దాకా ప్రతి ఏటా రంజీ ట్రోఫీ విజేతగా వెలుగొందింది. నేను 1974 మార్చిలో బెంగలూరులోని చిన్నస్వామి స్టేడియంలో రంజీ సెమీ ఫైనల్‌లో బొంబాయిని కర్ణాటక ఓడించడాన్ని చూశాను. ఫైనల్‌లో రాజస్థాన్ టీమ్‌ను కర్ణాటక ఓడించింది. దరిమిలా రంజీ ట్రోఫీ కర్ణాటకకే దక్కింది.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రధాన దేశీయ టోర్నమెంట్‌గా వున్న రోజులివి. ఇప్పుడు ఆరు పదులకు పైబడిన వయస్సులో వున్న క్రికెట్ ప్రేమికులకు రంజీ ట్రోఫీ ఎటువంటి స్ఫూర్తినిచ్చేదో నేటి యువతరానికి చెప్పడం కష్టం. 1960ల్లోనూ, 1970ల్లోనూ టెస్ట్ మ్యాచ్‌లు చాలా తక్కు వ. లైవ్ టెలివిజన్ లేదు నాటి క్రికెట్ అభిమానులు తమ సొంత రాష్ట్ర టీమ్ జయాపజయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండేవారు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను చూడడానికి ఇరవై నుంచి ముప్పై వేల మంది వస్తుండేవారు. ఇంకా ఎంతో మంది రేడియో, వార్తా పత్రికల ద్వారా ఆ మ్యాచ్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేవారు. ప్రతి ఒక్కరూ తమ సొంతరాష్ట్ర ఆటగాళ్ళను ప్రగాఢంగా అభిమానిస్తుండేవారు. ప్రసన్న కంటే వెంకటరాఘవన్ మెరుగైన ఆఫ్ -స్పిన్నర్ అని తమిళులు వాదిస్తుండేవారు. ఇండియన్ టెస్ట్ టీమ్‌లో బెంగాలీలకు స్థానం దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని బెంగాలీ మిత్రులు విమర్శిస్తుండేవారు. ఎవరి వాదనలూ సహేతుకమైనవి కావని మరి చెప్పనవసరం లేదు. 


క్రికెట్ అభిమానులుగా మా అస్తిత్వాలను రంజీ ట్రోఫీ ప్రభావశీలంగా నిర్వచిస్తుండేది. 1980ల్లో పార్థా, రుద్రాంశు, నేను ఇండియన్, వెస్టిండీస్ క్రికెట్ గురించే కాకుండా బెంగాల్, కర్ణాటక క్రికెట్ గురించి కూడా చర్చించుకునే వాళ్ళం. నా మిత్రులు ఇరువురూ, తాము పుట్టక ముందు రంజీట్రోఫీలో సంభవించిన బెంగాల్ విజయం గురించిన కథలు వింటూ, చదువుతూ పెరిగినవారు. బెంగాల్‌లో బాక్స్ వాలాలుగా పనిచేస్తున్న ఇద్దరు ఇంగ్లీష్ వ్యక్తులు ఆ విజయంలో కీలక పాత్ర వహించారు. వారి పేర్లు ఎ.ఎల్. హొసియె, టి.సి.లాంగ్ ఫీల్డ్. ఈడెన్ గార్డెన్స్ గుంపులు వారిని ప్రేమాభిమానాలతో ‘అమృత్ లాల్’ అనీ, ‘తులసీ చరణ్’అనీ పిలిచేవారని పార్థా, రుద్రాంశు చెప్పారు. తమ రాష్ట్ర జట్టు ఏకైక విజయం గురించి నా మిత్రులిరువురికీ వినడం, చదవడం ద్వారా మాత్రమే తెలుసు. ఇక నా రాష్ట్రం కర్ణాటక టీమ్ పలు మార్లు విజయం సాధించింది. గెలిచిన కొన్ని మ్యాచ్‌లను నేను స్వయంగా చూసి ఆనందంలో ఓలలాడాను. 1980ల్లో నా మిత్రులతో చర్చల సందర్భంగా ఈ విషయం గురించి నేను సగర్వంగా చెప్పుకోకుండా ఎలా వుంటాను? 


కొద్ది రోజుల క్రితం పార్థా చటర్జీ నాకు పంపిన ఒక ఈ-మెయిల్‌ను, నాటి గర్వాతిశయ భావోద్వేగాల వ్యక్తీకరణ నేపథ్యంలో అర్థం చేసుకోవల్సి వున్నది. ఇటీవల మా ఉత్తర ప్రత్యుత్తరాలలో, దేశంలో చోటుచేసుకుంటున్న వివిధ రాజకీయ, సామాజిక పరిణామాలే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అయితే, పార్థా ఈ-మెయిల్ క్రికెట్‌కు సంబంధించినది. అది చాలా క్లుప్తంగా వున్నది. ‘కర్ణాటకను బెంగాల్ జయించింది. త్రీ చీర్స్ ఫర్ పిగ్గీ లాల్, హిప్ హిప్ హుర్రే!’ అని అందులో వున్నది. రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో కర్ణాటకను బెంగాల్ ఓడించింది-. అదీ, ఈడెన్ గార్డెన్‌్సలో. పార్థా అప్పుడు ఈడెన్ గార్డెన్‌్సలో వుండి వుంటారని నేను అనుకోను. ఆ మ్యాచ్ వార్తలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుని వుంటారరనడంలో సందేహం లేదు. నేనూ ఆ మ్యాచ్‌పై దృష్టి పెట్ట లేదు. పార్థా మెయిల్ వచ్చిన తరువాత, బెంగాల్ టీమ్ మేనేజర్ అరుణ్(పిగ్గీ)లాల్ అని తెలిసింది. నా గౌరవనీయ మిత్రుని విజయ గర్వానికి నేనేమీ అసూయ పడలేదు. సాధారణంగా కర్ణాటక టీమ్, అందునా బెంగాల్ చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు.


పాత ప్రత్యర్థి ముంబై, అంతకంటే పాత ప్రత్యర్థి తమిళనాడు చేతిలో కర్ణాటక ఓడిపోవడాన్ని నేను భరించలేను. అయితే ఒక విషయం నా అసంతృప్తిని బాగా తగ్గించింది. బెంగాల్ టీమ్ మేనేజర్ పిగ్గీలాల్ నాకు సుపరిచితుడు. 1970ల్లో ఆయన నాయకత్వంలో న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ తరపున నేను ఆడాను. పిగ్గీ పలు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడారు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ప్రతిభావంతుడు. 1974లో ఢిల్లీ తరపున రంజీ ట్రోఫీలో పిగ్గీ ఆడారు. ఉద్యోగరీత్యా కోల్‌కతాలో స్థిరపడడంతో బెంగాల్ తరఫున ఆడుతున్నారు. అమృత్ లాల్ హోసియె, తులసీచరణ్ లాంగ్ ఫీల్డ్ లాగా ఆయన కూడా సహజీకరణ అయిన బెంగాలీ. 1989–90లో బెంగాల్ రెండో సారి రంజీట్రోఫీని గెలుచుకున్నది. ఆ విజయానికి పిగ్గీలాలే కారకుడు. ఆయన పరుగులు తీస్తున్నప్పుడల్లా స్టేడియంలోని ముప్పై వేల మంది ఆయనకు ‘లాల్ సలామ్’ చెప్పారు! ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు అధికారంలో లేరు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఇప్పుడు పెద్దగా జనాలను ఆకర్షించడం లేదు. ఈ ఏడాది రంజీ పైనల్ మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరిగింది. బెంగాల్ ఓడిపోయింది. అంతిమ విజయం విషయంలో నా మిత్రులు పిగ్గీలాల్, పార్థాలకు ఆశాభంగం కలిగినందుకు నేను బాధపడ్డాను. ఇక సౌరాష్ట్ర ఇంతకు ముందు ఎన్నడూ రంజీ ట్రోఫీని గెలుచుకోలేదు. ఇప్పుడు సౌరాష్ట్ర పేరు కూడా బెంగాల్, కర్ణాటక సరసన నిలుస్తుంది. చివరగా ఒక మాట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు రంజీట్రోఫీ స్థానంలో భారతదేశ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్‌గా వున్నది. ఐపిఎల్ అట్టహాసాలు, ఆర్భాటాలు, ఆడంబరాలు ఎలా వున్నప్పటికీ తమ తమ రాష్ట్రాల టీమ్‌ల పట్ల క్రికెట్ అభిమానుల విధేయతలు ప్రగాఢంగా వున్నాయని నేను భావించడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జయాపజయాలను అనుసరిస్తున్న ఇద్దరు మిత్రులు ముప్ఫై, నలభై సంవత్సరాల అనంతరం తమ టీమ్‌ల గురించి వాదించుకుంటారా అనేది సందేహమే.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.