క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్‌ ఇస్తుంటే?

ABN , First Publish Date - 2020-03-29T06:00:27+05:30 IST

వ్యాపార రంగంలో క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్లు జారీ చేయటం అనేది సర్వ సాధారణ విషయం. ముఖ్యంగా పరిశ్రమల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు లేదా హోల్‌సేల్‌ వ్యాపారి నుంచి రిటైల్‌ వ్యాపారికి మధ్య జరిగే...

క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్‌ ఇస్తుంటే?

వ్యాపార రంగంలో క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్లు జారీ చేయటం అనేది సర్వ సాధారణ విషయం. ముఖ్యంగా పరిశ్రమల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు లేదా హోల్‌సేల్‌ వ్యాపారి నుంచి రిటైల్‌ వ్యాపారికి మధ్య జరిగే లావాదేవీల్లో ఇవి సాధారణంగా చోటు చేసుకుంటాయి. దీనికి అనుగుణంగా జీఎ్‌సటీ చట్టంలో క్రెడిట్‌ నోట్‌, డెబిట్‌ నోట్లకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించటం జరిగింది. అంటే క్రెడిట్‌ నోట్‌ లేదా డెబిట్‌ నోట్‌ జారీ చేసినప్పుడు సరఫరాదారుడు, గ్రహీతలు.. ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌, పన్ను చెల్లింపులకు సంబంధించి కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 


ముందుగా క్రెడిట్‌ నోట్‌ జారీ చేసే సందర్భాలు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, ఇతర వ్యక్తికి సరుకు లేదా సేవలను అందజేసినప్పుడు అంటే సరఫరా చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేసిన వ్యక్తి కొంత సరుకు వెనక్కు పంపవచ్చు. లేదా పంపిన సరుకు విలువ కంటే ఇన్వాయిస్‌ విలువ పొరపాటు ఎక్కువ వేయవచ్చు. దానికి తగ్గట్టుగానే జీఎ్‌సటీ కూడా ఎక్కువ చూపించవచ్చు. ఉదాహరణకు ఒక హోల్‌సేల్‌ వ్యాపారి.. రిటైల్‌ వ్యాపారికి ఒక లక్ష రూపాయల విలువైన సరుకును పంపాడనుకుందాం. దీని మీద పన్ను 12 శాతం అంటే రూ.12,000. అయితే పొరపాటున ఇన్వాయి్‌సలో రూ.లక్షకు బదులు రూ.1,50,000.. అలాగే పన్ను రూ.12,000కు బదులు రూ.18,000 చూపించాడనుకుందాం. లేదా సరుకు పొందిన రిటైల్‌ వ్యాపారి రెండు నెలల తర్వాత రూ.50,000 సరుకు వెనక్కు పంపాడనుకుందాం. ఇలాంటి సందర్భాల్లో హోల్‌సేల్‌ వ్యాపారి, రిటైల్‌ వ్యాపారికి ఈ తేడాకు సరిపోను అంటే రూ.50,000 సరుకు విలువ, రూ.6,000 పన్ను మేరకు ఒక క్రెడిట్‌ నోట్‌ జారీ చేయటం జరుగుతుంది. అంటే, హోల్‌సేల్‌ వ్యాపారి డబ్బు చెల్లించే బదులు క్రెడిట్‌ నోట్‌ జారీ చేస్తాడు. దీన్ని తదుపరి జరిగే లావాదేవీల్లో సర్దుబాటు చేసుకుంటారు. కానీ, సదరు హోల్‌సేల్‌ వ్యాపారి ప్రభుత్వానికి మొదటి విలువ మీద అంటే ఇన్వాయిస్‌ విలువ మీద అప్పటికే పన్ను చెల్లించి ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే క్రెడిట్‌ నోట్‌ను జారీ చేస్తాడో ఆ నెలలో అతను కట్టాల్సిన పన్ను నుంచి క్రెడిట్‌ నోట్‌లో చూపిన పన్ను అంటే రూ.6,000 తగ్గించుకోవచ్చు. 


అయితే మొదటి ఇన్వాయిస్‌ ఆధారంగా అప్పటికీ రిటైల్‌ వ్యాపారి మొత్తం ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ తీసుకుని ఉంటాడు. కాబట్టి ఒకసారి క్రెడిట్‌ నోట్‌ పొందిన తర్వాత సదరు రిటైల్‌ వ్యాపారి అందులోని పన్నుకు సరిపోను ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను అంటే రూ.6,000 రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే, క్రెడిట్‌ నోట్‌ జారీ చేసిన వ్యక్తి రూ.6,000 మేర పన్ను భారాన్ని తగ్గించుకుంటాడు. అలాగే క్రెడిట్‌ నోట్‌ పొందిన వ్యక్తి తన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను రూ.6,000 మేరకు రివర్స్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఒక నియమం ఉంది. 


ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీకి సంబంధించి జారీ చేసే క్రెడిట్‌ నోట్‌ తదుపరి ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నెల రిటర్న్‌ దాఖలు చేసే తేదీ వరకు లేదా ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక  రిటర్న్‌ దాఖలు చేసే వరకు (ఏది ముందు అయితే అది) చెల్లుబాటు అవుతుంది. అంటే క్రెడిట్‌ నోట్‌కు సంబంఽధించి జీఎ్‌సటీ సర్దుబాటు ఈ లోపులోనే జరగాలి. ఆ తర్వాత క్రెడిట్‌ నోట్‌ ఇచ్చినప్పటికీ.. జీఎ్‌సటీకి సంబంధించిన ఎలాంటి సర్దుబాటు కుదరదు. 


ఇక డెబిట్‌ నోట్‌ జారీ చేసిన సందర్బాలు దీనికి వ్యతిరేక సందర్భాలుగా చెప్పవచ్చు. అంటే పంపిన సరుకు విలువ రూ.2 లక్షలు కాగా ఇన్వాయి్‌సలో పొరపాటున రూ.లక్ష మాత్ర మే చూపారు అని అనుకుందాం. అంటే రూ.24,000 పన్నుకు బదులు ఇన్వాయి్‌సలో రూ.12,000 పన్ను మాత్రమే చూపారనుకుందాం. ఇలాంటి సందర్భంలో సరుకు పంపిన హోల్‌సేల్‌ వ్యాపారి మిగతా మొత్తానికి అంటే రూ.లక్ష అసలు, రూ. 12,000 పన్నుకు కలిపి ఒక డెబిట్‌ నోట్‌ను రిటైల్‌ వ్యాపారికి ఇస్తాడు. అలాగే, హోల్‌సేల్‌ వ్యాపారి ఏ నెలలో అయితే డెబిట్‌ నోట్‌ను జారీ చేస్తాడో ఆ నెల లావాదేవీల మొత్తానికి డెబిట్‌ నోట్‌ విలువను కలిపి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్‌ నోట్‌ అందుకున్న రిటైల్‌ వ్యాపారి దానిలో చూపించిన పన్ను మొత్తాన్ని ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ కింద తీసుకోవచ్చు. అయితే, డెబిట్‌ నోట్‌ బదులు కొంతమంది సప్లిమెంటరీ ఇన్వాయిస్‌ జారీ చేస్తారు. దానికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయి. 


గమనిక : ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి.

Updated Date - 2020-03-29T06:00:27+05:30 IST