ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ‘రసాయన’ నోబెల్‌

ABN , First Publish Date - 2020-10-08T09:54:33+05:30 IST

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను

ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు ‘రసాయన’ నోబెల్‌

  • జన్యు సవరణ ప్రక్రియపై పరిశోధనలకు గుర్తింపు
  • ఇద్దరిలో ఒకరు అమెరికన్‌.. మరొకరు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త
  • కెమిస్ట్రీలో నోబెల్‌ ఇద్దరు మహిళలకు రావడం ఇదే తొలిసారి
  • నోబెల్‌ విజేతలు జెన్నిఫర్‌ ఎ డౌడ్నా, ఎమ్మాన్యుయెల్లే చార్పెంటియర్‌


స్టాక్‌హోం, అక్టోబరు 7: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్‌ బహుమతి ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించింది. వారిలో ఒకరు ఫ్రాన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్లే చార్పెంటియర్‌ (51), మరొకరు అమెరికన్‌ శాస్త్రవేత్త జెన్నిఫర్‌ ఎ డౌడ్నా (56). వారసత్వంగా సంక్రమించే వ్యాధులను నివారించి, భవిష్యత్తులో కేన్సర్‌ను సైతం నయం చేయగల సత్తా ఉన్న జన్యుసవరణ ప్రక్రియ క్రిస్పర్‌-కాస్‌9 (CRISPR-CAS9 క్లస్టర్డ్‌ రెగ్యులర్లీ ఇంటర్‌స్పే్‌సడ్‌ షార్ట్‌ పాలిండ్రోమిక్‌ రిపీట్స్‌ అండ్‌-క్రిస్పర్‌ అసోసియేటెడ్‌ ప్రొటీన్‌ 9)ను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. నిజానికి పలువురు శాస్త్రవేత్తలు ఈ విధానానికి సంబంధించిన కీలకమైన కృషి చేశారు. కానీ.. చాలా సులభంగా వినియోగించడానికి వీలుగా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చినందుకుగాను డౌడ్నా, చార్పెంటియర్‌లకు ఈ పురస్కారం లభించింది.


రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి ఇద్దరు మహిళలకు ప్రకటించడం ఇదే తొలిసారి. జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డీఎన్‌ఏలో మార్పుచేర్పులను ఈ విధానంలో అత్యంత కచ్చితత్వంతో చేయవచ్చు. వారు రూపొందించిన ఈ జన్యు ఉపకరణం ఎంతో శక్తిమంతమైనదని నోబెల్‌ కమిటీ సభ్యుడొకరు పేర్కొన్నారు. ఇది కొత్తరకం పంటల సృష్టికి దారిచూపిందని, భవిష్యత్తులో సరికొత్త వైద్య చికిత్సల రూపకల్పనకు కారణం కానుందని ఆయన వివరించారు. దెబ్బతిన్న జన్యువులను సరిచేయడానికి ఈ జన్యు సవరణ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఉపకరణం మానవాళికి ఎన్నో గొప్ప అవకాశాలను అందించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


2018లో వెలుగులోకి..

చైనాకు చెందిన హిజియాన్‌కుయి అనే శాస్త్రవేత్త క్రిస్పర్‌ పరిజ్ఞానం ద్వారా 2018లో ప్రపంచంలోనే తొలిసారి జన్యుసవరణ శిశువులను సృష్టించి తీవ్ర విమర్శలపాలయ్యారు. ఎలాంటి అనుమతులూ లేకుండా ఈ ప్రయోగం చేశారు. హెచ్‌ఐవీ సోకిన పురుషుణ్ని, హెచ్‌ఐవీ లేని మహిళను ఎంచుకుని,  వారి శిశువులకు హెచ్‌ఐవీ సోకకుండా నిరోధించేలా జన్యుసవరణ చేశారాయన. ఈ ప్రయోగంలో ఆయన ఉపయోగించిన క్రిస్పర్‌ జన్యుసవరణ విధానం గురించి ప్రపంచం మొత్తానికీ తెలిసింది. ఆయన చేసిన పనివల్ల అవాంఛిత మార్పులు చోటు చేసుకుంటే.. అది భవిష్యత్‌ తరాలకు ముప్పంటూ ఆగ్రహం వ్యక్తమైంది. చైనా ప్రభుత్వం ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.


Updated Date - 2020-10-08T09:54:33+05:30 IST