సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏచూరి

ABN , First Publish Date - 2022-04-11T09:45:03+05:30 IST

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టనుండడం వరుసగా మూడోదఫా కానుంది.

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏచూరి

పొలిట్‌బ్యూరో సభ్యునిగా రాఘవులు


కన్నూర్‌, ఏప్రిల్‌ 10: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిని చేపట్టనుండడం వరుసగా మూడోదఫా కానుంది. పార్టీలో అత్యున్నత వ్యవస్థ అయిన పొలిట్‌బ్యూరోకు తొలిసారిగా దళిత నేత ఎన్నిక కావడం ఇంకో విశేషం. కేరళలోని కన్నూర్‌లో నిర్వహించిన సీపీఎం 23వ కాంగ్రెస్‌ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, పార్టీలో అత్యున్నత స్థాయి కమిటీలైన పొలిట్‌బ్యూరో, సెంట్రల్‌ కమిటీల సభ్యులకు 75 ఏళ్ల గరిష్ఠ వయో పరిమితిని నిర్ధరించారు. ఆ వయస్సు సమీపించిన, దాటిన వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. 17 మంది సభ్యులు ఉండే పొలిట్‌బ్యూరోలోకి పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ దళిత నేత రామచంద్ర దోమేను తీసుకున్నారు. కేరళ ఎల్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఎ.విజయరాఘవన్‌, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ ధావలేలకు అవకాశం ఇచ్చారు. వయో పరిమితి కారణంగా ఎస్‌.రామచంద్రన్‌ పిళ్లై, హన్నన్‌ మొల్లా, బిమన్‌ బసులను తొలగించారు. ఈ కమిటీలో ప్రకాశ్‌ కారాట్‌, బృందా కారాట్‌, మాణిక్‌ సర్కార్‌, పినరయ్‌ విజయన్‌, బి.వి.రాఘవులు వంటి వారు కొనసాగుతున్నారు. సెంట్రల్‌ కమిటీ సభ్యుల సంఖ్యను 95 నుంచి 85కు తగ్గించారు. కొత్తగా 17 మందికి అవకాశం కల్పించారు. కమిటీలోకి మరో ముగ్గురు మహిళలను తీసుకోవడంతో మొత్తం స్త్రీల సంఖ్య 17కు పెరిగింది. కాగా, ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ మతతత్వ విధానాలను అనుసరిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.


తెలంగాణాకు తగ్గిన ప్రాతినిధ్యం

హైదరాబాద్‌: సీపీఎం కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం తగ్గింది. ఇప్పటివరకు నలుగురు సీనియర్‌ నాయకులు ఆ కమిటీలో ఉండగా, ఇప్పుడు ముగ్గురికే అవకాశం లభించింది. ఎస్‌.వీరయ్యకు కేంద్ర కమిటీలో చోటు దక్కలేదు. ఆయన పార్టీ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యునిగా ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జి. నాగయ్య, చెరుపల్లి సీతారాములు రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు. అఖిల భారత కోటాలో వెంకట్‌ను తీసుకున్నారు. 

Updated Date - 2022-04-11T09:45:03+05:30 IST