‘ఏజెన్సీ సుందరయ్య’ కుంజా బొజ్జి కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-12T16:54:45+05:30 IST

మాజీ శాసనసభ్యులు, సీపీఎం సీనియర్ నాయకులు కుంజా బొజ్జి(95) కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు.

‘ఏజెన్సీ సుందరయ్య’ కుంజా బొజ్జి కన్నుమూత

భద్రాచలం: మాజీ శాసనసభ్యులు, సీపీఎం సీనియర్ నాయకులు కుంజా బొజ్జి(95) కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. ఆయన భార్య లాలమ్మ మూడేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ఆరుగురు సంతానం. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరరామచంద్రపురం మండలంలోని అడవి వెంకన్న గూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి 1952లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. 1970లో వర రామచంద్రపురం మండలం రామవరం సర్పంచిగా తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమిపాలయ్యారు. ఏజెన్సీలో నిరుపేద గిరిజన, గిరిజనేతరుల సమస్యల పరిష్కారం కోసం, తునికాకు కార్మికుల కూలీ ధరల పెంపు కోసం పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. ఎప్పుడు పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి సల్పిన కుంజా బొజ్జిని ఏజెన్సీ సుందరయ్యగా పలువురు పిలుస్తారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985లో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన బొజ్జి 1989, 94లలో సైతం విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 


కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆ మహానేతకు ఘనంగా నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-04-12T16:54:45+05:30 IST