అమరావతికి మద్దతిస్తే కులం ఆపాదిస్తారా?

ABN , First Publish Date - 2020-12-14T08:10:35+05:30 IST

రాజధాని అమరావతి ఉద్యమానికి ఎవరైనా మద్దతిస్తే వారికి కులాలు ఆపాదిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. అధికార పక్షం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతికి మద్దతిస్తే కులం ఆపాదిస్తారా?

రాజధానిని శ్మశానం చేయడానికి జగన్‌ కంకణం కట్టుకున్నారు

జగన్‌, కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలపాలి

సీపీఐ నేత నారాయణ డిమాండ్‌


అమరావతి/విజయవాడ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఉద్యమానికి ఎవరైనా మద్దతిస్తే వారికి కులాలు ఆపాదిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. అధికార పక్షం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడడం దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఉద్యమం 29 గ్రామాలకే పరిమితం కాదన్నారు. ఆనాడు రాజధాని కోసం ప్రభుత్వానికి ఆ రైతులు భూములిచ్చారని.. చంద్రబాబుకో, లోకేశ్‌కో కాదన్న సంగతి జగన్‌ ప్రభుత్వం గుర్తెరగాలని సూచించారు. అమరావతిలో నిర్మించిన ఇళ్లు మొండి గోడలుగా మిగిలాయని, భవిష్యత్‌లో దానిని శ్మశానం చేసేందుకు జగన్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. ఆంధ్ర, తెలంగాణల్లో త్రిముఖ ప్రేమాయణం కొనసాగుతోందని.. ఆంధ్రలో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు బీజేపీతో త్రికోణ ప్రేమలో పడ్డాయన్నారు. ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్‌ శక్తులకు రైతుల ప్రయోజనాలు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీ నడిబొడ్డున  రైతులు దీక్షలు చేస్తున్నారని, మోదీ గానీ, అమిత్‌షా గానీ కనీసం ఒక్కరోజు అలా చలిలో గడపగలరా అని సవాల్‌ విసిరారు. 


రైతుల ఉద్యమాన్ని బ్లాక్‌మెయిల్‌ చేసే స్థాయికి మోదీ దిగజారడడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న ఉద్యమమే కేంద్ర ప్రభుత్వ పతనానికి కౌంట్‌ డౌన్‌గా నిలుస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపకుండా, రైతుల పక్షాన పోరాడే మంచి అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ గతంలో కేంద్ర కార్మిక మంత్రిగా పని చేసిన సమయంలో వచ్చిన అవినీతి జీవోలు, కార్యకలాపాల చిట్టాను అమిత్‌షా బయటకు తీశారని, దీంతోనే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోదీని కలిశారని తెలిపారు. కానీ రైతుల దీక్షలకు కనీసం సంఘీభావం ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల సీఎంలకు నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి వారి ఆందోళనలకు సంఘీభావం తెలపాలన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బదిలీకి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని సీఎం చూస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయన్న సాకు చూపుతూ ఇప్ప ట్లో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి’ అని గుర్తుచేశారు. కేంద్రంతో లాబీయింగ్‌ చేసుకుని ముందుకు సాగడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగానే రాజ్యసభలో బలం లేని బీజేపీకి ప్రోత్సాహం అందిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-12-14T08:10:35+05:30 IST