గిఫ్ట్‌ల పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-04-17T05:58:55+05:30 IST

గిఫ్ట్‌ల పేరుతో ఘరానా మోసం

గిఫ్ట్‌ల పేరుతో ఘరానా మోసం
నిందితుల అరెస్టు చూపుతున్న సీపీ తరుణ్‌ జోషి

 కోల్‌కత్తా కేంద్రంగా కార్యకలాపాలు

  మంచిర్యాల జిల్లాకు చెందిన  13 మంది ముఠా అరెస్టు

 రూ.14.36 లక్షల నగదు, సెల్‌ఫోన్లు  స్వాధీనం

వరంగల్‌ అర్బన్‌ క్రైం, ఏప్రిల్‌ 16: ఆన్‌లైన్‌ షాపింగ్‌ లో లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్‌ వచ్చిందంటూ అమాయకుల ను మోసం చేసి డబ్బులు కాజేసిన ఘరానా మోసగాళ్లను వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 13 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.14.36 లక్షల నగదు,  15 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం వరంగల్‌ పోలీసు కమిషనరే ట్‌ కార్యాలయంలో సీపీ తరుణ్‌ జోషి విలేకరులకు వివరాలను వెల్లడించారు. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఇప్ప రాజ్‌కుమార్‌, తాళ్లపెల్లి దామోదర్‌గౌడ్‌, దాసరి హరీ్‌షగౌడ్‌, వొల్లల ప్రవీణ్‌, గంగాధరి రాజ్‌కుమార్‌, రాంచందర్‌, మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన మేకల ఆదిత్య, మంచిర్యాలకు చెందిన ఆకునూరి శ్రవణ్‌కుమార్‌, బెల్లంపల్లికి చెందిన గంగాధర్‌ రాకేశ్‌, మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన ఈద రవికుమార్‌, బెల్లంపల్లి మండలం శంషీర్‌నగకు చెందిన దార్ల గణేశ్‌, మందమర్రికి చెందిన సిరికొండ వినోద్‌కుమార్‌, పెద్దపెల్లి జిల్లా రమగిరికి చెందిన ఆడెపు సిద్ధార్థ్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. 

ఈ ముఠాలో ప్రధాన నిందితుడు ఇప్ప రాజ్‌కుమార్‌ సులువుగా డబ్బులు సంపాదించాలని కొంతమందిని పోగేసుకున్నాడు. కోల్‌కతాను అడ్డాగా చేసుకుని అమాయకులకు ఆన్‌లైన్‌లో వల వేసేవాడు. కలకత్తాకు చెందిన ప్రజీత్‌, సంజీవ్‌, ప్రకాశ్‌ (పరారీలో ఉన్నారు)లను కలుపుకుని తెలంగాణకు చెందిన 13 మందితో కలిసి అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని కార్యకలాపాలు సాగిస్తుండేవాడు. డమ్మీ నాప్‌టోల్‌ కూపన్లు తయారు చేసి అందరినీ నమ్మించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసిన వారి ఫోన్‌నెంబర్లు సేకరించారు. లక్ష్కీ డ్రాలో గిఫ్ట్‌ కూపన్‌ వచ్చిందని అతడి అనుచరుల ద్వారా ఫోన్‌కాల్స్‌ చేయించేవాడు. ఫోన్‌లో అడ్రస్‌ తెలుసుకుని గిఫ్ట్‌కూపన్‌(స్ర్కాచ్‌కార్డు) ఇంటికి పంపించారు. గెలుచుకున్న బహుమతులను పొందేందుకు రవాణా ఖర్చుల కోసం కొంత డబ్బు బ్యాంకులో జమ చేయాలని ముందుగా నమ్మిస్తారు. సాకులు చెబుతూ విడతల వారీగా డబ్బులు గుంజుతుంటారు.  ఇలా రోజుకు 30 నుంచి 40 మంది వద్ద నుంచి డబ్బులు కాజేస్తుంటారు. 

అయితే ఎన్నిరోజులైనా ఎలాంటి గిఫ్టు లు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఇంతేజార్‌గంజ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గడ్‌, గీసుగొండ, ఖానాపురం పోలీ్‌సస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ ముఠాపై వరంగల్‌ సెంట్రల్‌జోన్‌ డీసీపీ పుష్ప దృష్టిసారించారు. ఆమె పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 13మంది నిందితులు శుక్రవారం కోల్‌కతాకు వెళ్లేందుకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు వస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 13 మందిని అరెస్టుచేసి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించి విచారించారు. చేసిన తప్పును ఒప్పుకోవడంతో వారిపై చీటింగ్‌ కేసులు నమోదు చేశారు. కాగా, కర్ణాటకకు చెందిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు సీపీ వెల్లడించారు. డబ్బులు, బహుమతులు ఎవరికీ ఉచితంగా రావని, ప్రజలు ఆన్‌లైన్‌ మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని సూచించారు. ఈ సమావేశంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:58:55+05:30 IST