ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?: పవన్

ABN , First Publish Date - 2020-04-03T22:05:24+05:30 IST

డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించినట్లుగా.. వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్మెంట్‌ ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

ఆయుధాలు లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?: పవన్

అమరావతి: డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించినట్లుగా.. వైద్యులకు పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్మెంట్‌ ఇవ్వాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో తగిన సదుపాయాలు లేక.. వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారన్నారు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ)పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలన్నారు. వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమన్నారు. ‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పి.పి.ఈ.లు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదన్నారు. కోవిడ్-19కి వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఏ విధమైన మెడికల్ మాస్కులు, గౌన్స్, గ్లోవ్స్, కంటి అద్దాలు/ఫేస్ షీల్డ్ ధరించాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిందని.. అందుకు అనుగుణంగా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలన్నారు.



‘‘ఎన్-95 మాస్కులు కూడా సమకూర్చలేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండి. నిర్దేశించిన విధంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు, దుస్తులు ఇస్తేనే సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. వైద్యులు, సిబ్బందికి ఇస్తున్న పి.పి.ఈ.లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. తమ ప్రాణాలను, తమ కుటుంబం ప్రాణాలను పణంగాపెట్టి వైద్యం చేస్తున్నవారి సేవలను గుర్తించాలి. వారి ఆరోగ్య క్షేమాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పవన్ తెలిపారు.

Updated Date - 2020-04-03T22:05:24+05:30 IST