ఒక్క నెలలోనే 30 వేల కేసులు

ABN , First Publish Date - 2022-01-17T08:09:50+05:30 IST

రాష్ట్రంలో నెల రోజుల్లోనే ఏకంగా 30 వేల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబరు 16 నుంచి జనవరి 15 మధ్యకాలంలో కొత్తగా 30,145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

ఒక్క నెలలోనే 30 వేల కేసులు

ఆస్పత్రుల్లో చేరికలూ రెట్టింపు.. కొత్తగా 2,047 కేసులు

స్పీకర్‌ పోచారం, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, దివాకర్‌కు రెండోసారి..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్‌

కొత్తగా 2,047 కేసులు 


హైదరాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నెల రోజుల్లోనే ఏకంగా 30 వేల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. డిసెంబరు 16 నుంచి జనవరి 15 మధ్యకాలంలో కొత్తగా 30,145 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ వ్యవధిలో కరోనాతో 45 మంది మరణించారు. డిసెంబరు చివరి వారం నుంచి ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగుల చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గత నెల 16 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 1,197 మంది రోగులు చికిత్స పొందుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 2,158కి చేరింది. ఆదివారం సాయంత్రం వరకు ఆక్సిజన్‌పై 900 మంది, ఐసీయూపై 548 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ కొవిడ్‌ బులెటిన్‌లో వెల్లడించింది. ఇక ఆదివారం తెలంగాణలో కొత్తగా 2047 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు చనిపోయారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 55,883 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. మరో 1.53 లక్షలమంది టీకా తీసుకోగా,  5366 మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చారు. 15-17 మధ్యవయస్కులలో ఇప్పటివరకు 49 శాతం (9 లక్షల) మంది టీకాలు తీసుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. కేవలం 13 రోజుల్లోనే ఈ రికార్డును సాధించినట్లు ప్రకటించింది.   


హైదరాబాద్‌లోని పోలీసు స్టేషన్లలో..  

శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి రెండోమారు కొవిడ్‌ బారినపడ్డారు. శనివారం ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావులకు కూడా రెండోసారి కరోనా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు సతీమణి రాజకుమారి, కోడలు ఉదయశ్రీలకూ కొవిడ్‌ నిర్ధారణ అయింది. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు కొవిడ్‌ సోకడంతో హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌  పరిధిలో 15 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని మైలార్‌దేవుపల్లి, శివరాంపల్లి, హసన్‌నగర్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆదివారం 135 మంది కొవిడ్‌ పరీక్షలు చేసుకోగా 22 మందికి పాజిటివ్‌ వచ్చింది. జీడిమెట్ల పోలీసు స్టేషన్‌లో 9 మంది, జగద్గిరిగుట్ట స్టేషన్‌లో నలుగురు కరోనా బారినపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే చిలకలగూడ పోలీసు స్టేషన్‌ సిబ్బంది ఒకరికి కొవిడ్‌ తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసుస్టేషన్‌లో ఎస్సైతో పాటు ఆరుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.


Updated Date - 2022-01-17T08:09:50+05:30 IST