విడివిడిగా ఆడుకుందాం కలసికట్టుగా పోరాడుదాం!

ABN , First Publish Date - 2020-10-16T05:38:21+05:30 IST

కొవిడ్‌-19తో తీవ్ర సంక్షుభిత కాలాన్ని ఎదురీదుతూ, నిన్న మొన్నటి అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోతున్న ప్రజలకు, ప్రత్యేకించి రైతాంగానికి బహుజన బతుకమ్మ నిర్వాహణ....

విడివిడిగా ఆడుకుందాం కలసికట్టుగా పోరాడుదాం!

కొవిడ్‌-19తో తీవ్ర సంక్షుభిత కాలాన్ని ఎదురీదుతూ, నిన్న మొన్నటి అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోతున్న ప్రజలకు, ప్రత్యేకించి రైతాంగానికి బహుజన బతుకమ్మ నిర్వాహణ కమిటి తరపున ప్రగాఢ సానుభూతి. కోవిడ్‌ కారణంగా మరణించిన కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు, సామాన్య ప్రజలందరికి వినమ్ర నివాళులు. మనదేశంలో ఆన్‌లాక్‌ 5.0 పూర్తికాబోతున్న తరుణంలో రాష్ట్ర పండుగ బతుకమ్మపై రాష్ట్రప్రభుత్వం నుండి ప్రత్యేక మార్గదర్శకాలు ఏమీ వెలువడనందున ‘‘బతుకమ్మ సంబురాలను ఎక్కడికక్కడే జరుపుకుందాం. కోవిడ్‌తో ఉత్పన్నమైన సమస్యలపై కల్సికట్టుగా పోరాడుదామని’’ పిలుపునిస్తున్నాం.


గడిచిన పుష్కర కాలంగా ‘బహుజన బతుకమ్మ’ ప్రకృతిని, పర్యావరణాన్ని, భూమిని, నవధాన్యాలతో  కూడిన తెలంగాణ ఆహార సంస్కృతిని, స్వావలంబనను కాపాడుకుందామని పిలుపునిస్తున్నది. నేడేమో కరోనా లాంటి అంటువ్యాధితో జరిగే పోరాటంలో ప్రతి మనిషి భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. పండుగరోజుల్లోనూ విడివిడిగా ఉండి, ఎక్కడికక్కడే కుటుంబాలకు, పరిమిత వీధులకు లోబడి ఆడుకోవాలి. ఈ మేరకు గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా మాస్కులు, శానిటైజర్లతో జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్‌-19 కారణంగా ఉపాధి కోల్పోయిన వలసకూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎంతో మంది తీవ్రంగా సతమతమవుతున్నారు. మక్కలు తదితర ఆహారపంటలపై దిగుమతి సుంకాలు తగ్గడంతో దేశీయ మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కావున దేశీయ పంటలను అభివృద్ధి చేసుకోవడం, గ్రామీణ ఉపాధిని పెంచుకోవడం, వ్యవసాయరంగంలో స్వావలంబణను ప్రోత్సహించడం లాంటి అంశాలపై పాలకులు దృష్టిపెట్టాలి. ప్రజారోగ్య  వ్యవస్థను మెరుగుపరుస్తూ ఊతమివ్వాలి. ఇందుకు భిన్నంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కావున కరోనాతో ఉత్పన్నమైన సమస్యలపై కలిసి కట్టుగా పోరాడటానికి ముందుకు రావాలని తెలంగాణ ప్రజలందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.బహుజన బతుకమ్మ ఉత్సవమే కాదు, ఉద్యమమంటూ చాటుదాం. బహుజన బతుకమ్మ కార్యక్రమాలను నేటినుంచి జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుందాం.


విమలక్క, విమల కటికనేని, జయధీర్‌ తిరుమలరావు, భూపతి వెంకటేశ్వర్లు, పోతుల రమేష్‌, టి. హన్మాండ్లు, పద్మ,  మన్నారం నాగరాజు, ఆవుల నాగరాజు, ఆత్రం సుగుణ, జూపాక సుభద్ర తదితరులు 

(బహుజన బతుకమ్మ నిర్వాహణ కమిటి)

Updated Date - 2020-10-16T05:38:21+05:30 IST