నకిలీ సరుకుకి.. బ్రాండెడ్‌ ‘కవరింగ్‌’

ABN , First Publish Date - 2021-06-20T09:09:48+05:30 IST

నిత్యావసర సరుకులు సహా ఇతర వస్తువుల విషయంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కంపెనీలు ఉన్నాయి. వీటి బ్రాండ్‌ పేరు కనిపిస్తే చాలు

నకిలీ సరుకుకి.. బ్రాండెడ్‌ ‘కవరింగ్‌’

విత్తనాలు, గుట్కా, టీ పొడి.. నకిలీ ఉత్పత్తులకు బ్రాండ్ల లోగోతో కవర్లు

నకిలీ కవర్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకలోనూ మోసం

రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం


కర్నూలు, జూన్‌ 19: నిత్యావసర సరుకులు సహా ఇతర వస్తువుల విషయంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొన్న కంపెనీలు ఉన్నాయి. వీటి బ్రాండ్‌ పేరు కనిపిస్తే చాలు.. వినియోగదారులు కొనేస్తారు. ఈ పరిస్థితినే తమకు అనుకూలంగా మార్చుకున్న అంతరాష్ట్ర ముఠా ఒకటి.. బ్రాండెడ్‌ కంపెనీలను పోలి ఉన్న కవర్లను తయారు చేసి.. నకిలీ సరుకులు విక్రయించేవారికి ఇస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతోంది. అంటే.. పైకి బ్రాండెడ్‌ కంపెనీ లోగో, పేరు.. వంటివి అచ్చు సదరు కంపెనీ ఉత్పత్తులే అనిపించేలా కవర్‌ ఉంటుంది. కానీ, లోపల సరుకు మాత్రం నకిలీదే! ఇలా తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటకకు చెందిన వినియోగదారులను, రైతులను మోసం చేస్తున్న ముఠా ను కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు బోగూడ సురేశ్‌, సుబ్బారెడ్డి, పెద్ద తిమ్మయ్యను అరెస్టు చేసి ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పరిచారు. 


2018 నుంచి

హైదరాబాద్‌కు చెందిన సురేశ్‌.. కపీశ్వర్‌ రోటో ప్యాకింగ్‌ ప్రై.లిమిటెడ్‌ పేరుతో 2018లో ఓ సంస్థను స్థాపించారు. దీనికి ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్నారు. పలు కంపెనీలకు చెందిన ప్యాకెట్లు తయారు చేయడం ఈ సంస్థ పని. ఇందుకోసం రెండు ప్రధాన కంపెనీల నుంచి ఆర్డర్లు తీసుకున్నారు. దీని ముసుగులో వివిధ రకాల బ్రాండెడ్‌ కంపెనీల పేర్లు, వాటి లోగోలు ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని, అదే మాదిరిగా నకిలీ ప్యాకింగ్‌ కవర్లు తయారు చేయడం మొదలు పెట్టారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఇలా పలు రాష్ట్రాలకు చెందిన నకిలీ ఉత్పత్తులు తయారు చేసే ఆర్గనైజర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని, వారికి ప్రధాన కంపెనీల కవర్లు అందిస్తున్నారు. వీటిలో నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు, గుట్కా, పాన్‌ మసాలాలు, టీ, డిటర్జెంట్లు ఇలా పలు ప్రధాన బ్రాండ్లకు చెందిన నకిలీ కవర్లు ఉన్నాయి. ఈ కవర్లు తయారు చేసేందుకు 683 సిలిండర్లు, తయారీ యంత్రాలు, ముడి సరుకులను పోలీసులు సీజ్‌ చేసుకున్నారు. సామగ్రి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T09:09:48+05:30 IST