ప్రభుత్వ సీట్లకే కౌన్సెలింగ్‌!

ABN , First Publish Date - 2020-05-31T09:32:01+05:30 IST

పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందా? ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ అవుతాయా? ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారుల వద్ద సమాధానాలు కనిపించడం లేదు. తమ కాలేజీల్లో కన్వీనర్‌

ప్రభుత్వ సీట్లకే కౌన్సెలింగ్‌!

  • ప్రైవేటు కాలేజీ సీట్ల భర్తీ డౌటే
  • 618 మెడికల్‌ పీజీ సీట్ల భర్తీపై సందిగ్ధత 

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): పీజీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ జరుగుతుందా? ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ అవుతాయా? ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ అధికారుల వద్ద సమాధానాలు కనిపించడం లేదు. తమ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీ చేయవద్దని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యం స్పష్టం చేశాయి. భర్తీ చేసినా.. విద్యార్థులను జాయిన్‌ చేసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నాయి. రాష్ట్రంలో 2,210పీజీ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లలో 475సీట్లు నేషనల్‌ కోటాకు ఇచ్చారు. మిగిలిన 508 సీట్లను హెల్త్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తుంది. ఇవి కాకుండా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 1,226లో 618 సీట్లు కన్వీనర్‌ కోటా కింద వర్సిటీనే భర్తీ చేస్తుంది. వీటన్నింటినీ తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేసేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమయ్యారు. పీజీ వైద్య విద్య ఫీజుల అంశంపై ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు గుర్రుగా ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీలకు చెందిన కన్వీనర్‌ కోటా 618సీట్లు భర్తీ అవుతాయా? లేదా? అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వర్సిటీ అధికారులు సీట్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఈలోగా ప్రైవేటు కాలేజీల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. శనివారం కొంతమంది కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలిశారు. సోమవారం నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-31T09:32:01+05:30 IST