పరిషత్‌ పోరు లేనట్లే!?

ABN , First Publish Date - 2021-03-10T09:03:13+05:30 IST

‘పనిలో పనిగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా జరిపేయండి’ అని ప్రభుత్వం కోరినప్పటికీ... ఇప్పట్లో ఆ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు. పరిషత్‌ ఎన్నికల పాత నోటిఫికేషన్‌

పరిషత్‌ పోరు లేనట్లే!?

16 నుంచి విదేశీ పర్యటనకు ఎస్‌ఈసీ

అసెంబ్లీ సమావేశాల పనిలో ప్రభుత్వం

కొనసాగింపా? కొత్త నోటిఫికేషనా?

హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు

ఈ నెలాఖరుకు రిటైర్‌ కానున్న నిమ్మగడ్డ

కొత్త ఎస్‌ఈసీ ఆధ్వర్యంలోనే పరిషత్‌ ఎన్నికలు?


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘పనిలో పనిగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు కూడా జరిపేయండి’ అని ప్రభుత్వం కోరినప్పటికీ... ఇప్పట్లో ఆ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడంలేదు. పరిషత్‌ ఎన్నికల పాత నోటిఫికేషన్‌ రద్దు చేయాలని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై తీర్పు రిజర్వు అయ్యింది. మరోవైపు... మునిసిపల్‌ ఎన్నికల ప్రక్రియ ముగించుకుని, ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇంకోవైపు... ఈనెల 19 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  అలాగే... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, పోలింగ్‌ తేదీకి నెల ముందు నుంచి ప్రవర్తనా నియమావళి అమలు చేయాల్సి ఉంది.ఈనెలాఖరుతో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పదవీకాలం ముగుస్తోంది. తన పదవీకాలం తర్వాత జరిగే ఎన్నికలకు... తాను రీనోటిఫికేషన్‌ జారీ చేయడం కొత్తగా, వింతగా ఉంటుంది. మొత్తానికి.. ఎవరికి వారు ఇతర పనుల్లో నిమగ్నమవుతున్న నేపథ్యంలో.. ఇప్పట్లో పరిషత్‌ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. తర్వాత కొత్త ఎస్‌ఈసీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే పరిషత్‌ పోరుకు తెరలేచే అవకాశముంది.


నిమ్మగడ్డ అదే కోరుకున్నారా...

గతేడాది మొదలుపెట్టిన మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాలపై స్వయంగా ఎస్‌ఈసీయే కేంద్రానికి లేఖ రాశారు. ఈ అక్రమాలను అలాగే వదిలేసి.. ఆపిన చోటి నుంచే మళ్లీ ఎన్నికలు ప్రారంభిస్తే విమర్శలకు గురికావాల్సి వస్తుందని నిమ్మగడ్డ భావించారు. ఇప్పటిదాకా జరిగిన ప్రక్రియను రద్దు చేసి.. తిరిగి నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ.. అందుకు భిన్నంగా గతఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యాయనిపుణుల సలహాయే దీనికి కారణమని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తుండటంతో పరిషత్‌ ఎన్నికల నిర్వహణ బాధ్యతను తదుపరి ఎస్‌ఈసీకి వదిలేసినట్లేనని భావించవచ్చు. తన ఆధ్వర్యంలో నిర్వహించలేని ఎన్నికలకు తాను నోటిఫికేషన్‌ ఇవ్వడం కన్నా కొత్తగా నియమించే ఎస్‌ఈసీకే ఈ తంతును వదిలేయడమే మేలన్న భావనకొచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం... రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పరిషత్‌ ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్న ఒత్తిడి కనిపించడం లేదు.

Updated Date - 2021-03-10T09:03:13+05:30 IST