ఫీజులిస్తేనే పై తరగతికి

ABN , First Publish Date - 2020-05-27T09:52:04+05:30 IST

లాక్‌డౌన్‌లోనూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పై తరగతికి పంపిస్తామని...

ఫీజులిస్తేనే పై తరగతికి

  • లేకుంటే ఆన్‌లైన్‌ క్లాస్‌లు కట్
  • ఆ పాఠాలు మళ్లీ చెప్పేది లేదు
  • లాక్‌డౌన్‌ కాలంలో కార్పొరేట్‌ జులుం
  • ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
  • జీతాల కోతతో కట్టలేమంటున్న తల్లిదండ్రులు

హైదరాబాద్‌ సిటీ/ అల్లాపూర్‌/ మెహదీపట్నం మే26(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లోనూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పై తరగతికి పంపిస్తామని బెదిరిస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించిన లింకులను కూడా ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేట్‌ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని భావించిన సర్కారు వారిని ఒత్తిడి చేయవద్దంటూ ప్రైవేట్‌ స్కూలు యాజమాన్యాలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ట్యూషన్‌ ఫీజును నెలవారీగా తీసుకోవాలని చెప్పింది. అయితే, ఈ సూచనలను ప్రైవేట్‌ యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఇంటర్‌ సెకండియర్‌ తరగతులను, తొమ్మిదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పదో తరగతి పాఠాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ కాలేజీలు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశంలోనే నీట్‌, ఎయిమ్స్‌, ఐఐటీ, జేఈఈ తదితర పేర్లతో చేర్చుకున్నాయి. ఆయా కాలేజీలు ప్రస్తుతం ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో నీట్‌, ఎంపీఎల్‌, ఎయిమ్స్‌, ఐఐటీ, జేఈఈ తదితర వాటికి క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించే సందర్భంలో ఫీజులు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ క్లాస్‌ ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు. రూ. 10వేలు చెల్లించి సెకండియర్‌కు రెన్యువల్‌ చేయించుకోవాలంటూ తల్లిదండ్రులకు ఫోన్‌లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్‌ తరగతులను కాలేజీకి వచ్చాక మళ్లీ బోధించేది ఉండదని, ఫీజులు చెల్లిస్తేనే ఆన్‌లైన్‌ లింకు ఇస్తామని చెబుతున్నారు.


పాత బాకీలూ చెల్లించాల్సిందే

గత విద్యాసంవత్సరానికి సంబంధించి పూర్తి ఫీజులను చెల్తిసేనే పై తరగతికి ప్రమోట్‌ చేస్తామని పలు ప్రైవేటు పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి ఫీజు చెల్లించినా పదో తరగతిలో చేరేందుకు రెన్యూవల్‌ ఫీజు చెల్లించాలని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. తొమ్మిదో తరగతి పూర్తయి పదో తరగతిలో చేరుతున్న వారికి ఆన్‌లైన్‌ క్లాస్‌లను నిర్వహిస్తున్నారు. జూన్‌ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక ఫీజును చెల్లించాలని మరికొన్ని ప్రైవేటు పాఠశాలలు కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫీజులెలా చెల్లిస్తామని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.


ఉపాధ్యాయులపైనా ఒత్తిడి

ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నందున విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసే బాధ్యతను అధ్యాపకులే తీసుకోవాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. వసూలు చేస్తేనే జీతాలుంటూ కొన్ని యాజమాన్యాలు షరతులు పెడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులు ఫోన్లు చేసి ఫీజు గురించి అడుగుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వృత్తి ధర్మంగా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నామని, ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజు అడగడం ఇబ్బందిగా ఉందని ఓ అధ్యాపకుడు వాపోయారు.


పే స్లిప్పు చూపకపోతే పూర్తి ఫీజు కట్టాల్సిందే..

ట్యూషన్‌ ఫీజులను నెలవారీగా కట్టించుకోవాలని అన్ని విద్యాసంస్థలకూ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే, నగరంలోని పలుసంస్థలు ఈ నిబంధనను పట్టించుకోవడంలేదు. జీతాలు తగ్గినట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపిస్తేనే ట్యూషన్‌ ఫీజును నెలవారీగా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెబుతున్నాయి. వేతనాలకు సంబంధించిన పే స్లిప్పులు అడుగుతున్నారని కొంతమంది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆధారాలు చూపించకపోతే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని చెబుతున్నారు.


ఫీజులు ఇప్పుడు కట్టలేం

రెండు నెలలు లాక్‌డౌన్‌తో వ్యాపారాలు లేవు. ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. ఖర్చులకు డబ్బులు లేవు. ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అంతేకాక మీలాంటి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు కూడా ఫీజులు అడగవద్దని, ఒత్తిడి తేవద్దుని ఆదేశించింది. అయినా, మెసేజ్‌ల ద్వారా, ఫోన్‌లు చేసి కూడా ఫీజులు కట్టాలని వేధించడం సరికాదు. ఇప్పట్లో అయితే ఫీజులు కట్టడం మా వల్ల కాదు. - అంజిరెడ్డి, లంగర్‌హౌజ్‌


30-40శాతం ఫీజులు మాఫీ చేయాలి 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు కట్టే పరిస్థితిలో లేరు. ఈ పరిస్థితుల్లో ఫీజులను 30నుంచి 40శాతం మేర మాఫీ చేయాలి. త్రైమాసిక ఫీజును మాఫీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలివ్వాలి.

- హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ 

(హెచ్‌ఎ్‌సపీఏ) అధ్యక్షుడు ఎన్‌.సుబ్రమణ్యం 


Updated Date - 2020-05-27T09:52:04+05:30 IST