సొంత వాహనాల్లో ఆస్పత్రికి వచ్చేయండి!

ABN , First Publish Date - 2020-04-03T07:31:20+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. అనుమానితుల విషయంలో అంత పకడ్బందీగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమానితుడైనా...

సొంత వాహనాల్లో ఆస్పత్రికి వచ్చేయండి!

అనుమానితుల తరలింపులో నిర్లక్ష్య వైఖరి

వాహనాల కొరత వల్లేనంటున్న అధికారులు 

ముప్పు మరింత పెరిగితే పరిస్థితి ఏంటి?


హైదరాబాద్‌సిటీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటున్న అధికారులు.. అనుమానితుల విషయంలో అంత పకడ్బందీగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమానితుడైనా... పాజిటివ్‌ రోగి అయినా.. అధికారులు ఒకే తీరుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, అనుమానితులను ఆస్పత్రులకు తరలించే క్రమంలో వాహనాలు లేవని, వైద్యులు లేరన్న సాకులతో నేరుగా ఆస్పత్రులకు వచ్చేయమని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది మరింత ప్రమాదకర పరిస్థితికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ మర్కజ్‌కు హాజరై నగరానికి తిరిగ్చొన పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తిని క్వారంటైన్‌ చేయాలని వైద్య సిబ్బంది ఆదివారం ఉదయం చేరుకున్నారు. ఎంత సేపు వేచి ఉన్నా వాహనం అందుబాటులోకి రాలేదు. దీంతో అతడినే ఎలాగోలా ఆస్పత్రికి చేరుకోవాలని కోరగా... ఆ రోజు సాయంత్రం ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇతనొక్కడే కాదు.. గతంలోనూ పలువురు అనుమానితులు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. అనుమానితుల్ని గుర్తించగానే వెంటనే క్వారంటైన్‌కు తరలించాలి. కానీ, చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లు, ఇతర వైద్య వాహనాల సంఖ్యకు మించి అనుమానితులు పెరుగుతుండటంతో సమస్య ఏర్పడి ఉండవచ్చు కానీ.. వారినే నేరుగా ఆస్పత్రి లేదా క్వారంటైన్‌కు వచ్చేయమంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయన్న విషయాన్ని అధికారులు గుర్తించాల్సి ఉంది. 


నిర్ధారణలోనూ ఆలస్యమే

అనుమానితులను క్వారంటైన్‌ చేసి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫలితాలు వెల్లడించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతో్‌షనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలో ఆదివారం క్వారంటైన్‌ చేసి నమూనాలు సేకరించగా బుధవారం వరకూ ఫలితం చెప్పలేదు. ఈ విషయమై బాధితుడు పలుమార్లు అధికారులను ప్రశ్నించగా.. ఇంకా రిజల్ట్‌ రాలేదని చెప్పారు. పాజిటివ్‌ లేకున్నా అకారణంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని ఇలాంటి వారు వాపోతున్నారు. టెస్టుల ఫలితాలు వెంటనే చెప్పెస్తే అనుమానితుడి కుటుంబీకులు, ఇతర సంబంధీకులు అప్రమత్తమయ్యే అవకాశముంది.

Updated Date - 2020-04-03T07:31:20+05:30 IST