వ్యాక్సిన్‌తో ‘రక్షణ’

ABN , First Publish Date - 2021-03-04T08:39:58+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తగిన ఫలితాలను ఇస్తోంది. టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీస్‌ భారీగా వృద్ధి చెందుతున్నాయి. తొలి దశ టీకా కార్యక్రమంలో భాగంగా

వ్యాక్సిన్‌తో ‘రక్షణ’

టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీస్‌ 

రెండో డోసు తర్వాత భారీగా పెరుగుదల

వ్యాక్సిన్‌తో 8-12 నెలలు రక్షణ: వైద్యులు


హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ తగిన ఫలితాలను ఇస్తోంది. టీకా తీసుకున్నవారిలో యాంటీబాడీస్‌ భారీగా వృద్ధి చెందుతున్నాయి. తొలి దశ టీకా కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న పలువురు వైద్యనిపుణులు చేయించుకున్న పరీక్షల్లో ఈ విషయం తేలింది. వారిలో కొందరు తొలి డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత టెస్టు చేయించుకోగా.. మరికొందరు రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత చేయించుకున్నారు. తొలి డోసుకే దాదాపు అందరిలోనూ యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు వెల్లడైంది.


రెండో డోసు తర్వాత.. వాటి సంఖ్య భారీగా పెరిగినట్లు స్పష్టమైంది. ఉదాహరణకు.. జనవరి 16న హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో టిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విమలాఽథామస్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. టీకా తీసుకున్న 15 రోజుల తర్వాత ఆమె యాంటీబాడీస్‌ టెస్టు చేయించుకున్నారు. అందులో ఐజీజీ యాంటీబాడీస్‌ 5.2గా వచ్చినట్లు తేలింది. అంటే తొలి డోసు తర్వాత దాదాపు ప్రతి ఒక్కరిలోనూ యాంటీబాడీస్‌ కనీసస్థాయిలో వృద్ది చెందుతున్నాయన్నమాట. వైరస్‌ బారిన పడినవారిలో సహజంగానే యాంటీబాడీస్‌ వృద్ధిచెందుతాయి. కానీ, ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువగా ఉంటే.. యాంటీబాడీస్‌ సంఖ్య ఎక్కువగా ఉండదు. కరోనా తీవ్రత కారణంగా ఆరోగ్యంగా బాగా దెబ్బతిని ఆస్పత్రి పాలైన వారిలోనేయాంటీబాడీస్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. కొవిడ్‌ వచ్చిన వారు టీకా తీసుకుంటే ఇంకా ఎక్కువగా యాంటీ బాడీస్‌ వస్తాయి. అలాగే అసలు రాని వారు తీసుకుంటే కనీసస్థాయిలో ప్రతి రక్షకాలు వృద్ధి చెందుతున్నట్లు తేలింది. యాంటీబాడీస్‌ శరీరంలో ఉండటం వల్ల.. ఒకవేళ మన శరీరంలోకి కరోనా వైరస్‌ ప్రవేశించినా రోగనిరోధక వ్యవస్థ దానిపై సమర్థంగా పోరాడగలుగుతుంది. ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉండదు. ఆస్పత్రి పాలయ్యే ప్రమాదం కూడా దాదాపుగా తగ్గిపోతుంది. ప్రధానంగా ప్రాణహాని ఉండదు. వైర్‌సను మరొకరికి వ్యాప్తి చేసే అవకాశం కూడా ఉండదు. వ్యాక్సిన్‌ వల్ల 8 నుంచి 12 నెలల రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.


యాంటీ బాడీస్‌ ఎన్ని కావాలంటే...

కొవిడ్‌ వైర్‌సను ఎదుర్కొవాలంటే శరీరంలో కనీసం 3-5 ఇమ్యూనోగ్లోబలిన్‌(ఐజీజీ) ఉంటే చాలు. ఈ మేరకు ప్రతి రక్షకాలు ఉంటే వైర్‌సను సమర్థంగా ఎదుర్కోగలవు. టీకా తీసుకున్న వారిలో తొలి డోసు తర్వాతే ఈ స్థాయిలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతున్నట్లు కొందరు వైద్యనిపుణులు చేయించుకున్న పరీక్షల్లో తేలింది. అయితే, అవి ఎక్కువ కాలం శరీరంలో ఉండాలంటే బూస్టర్‌ డోసు (రెండో డోసు) తప్పని సరిగా వేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-03-04T08:39:58+05:30 IST