టీకా కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-04-23T09:40:01+05:30 IST

నిన్న మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపని నగర వాసులు ఇప్పుడు టీకా కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ‘ఆ వ్యాక్సిన్‌’

టీకా కోసం ఎదురుచూపులు

హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ కొరత.. పంపిణీ కేంద్రాల్లో బారులు

పలు చోట్ల వ్యాక్సినేషన్‌ బంద్‌.. కొన్నింటిలో నామమాత్రం 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపని నగర వాసులు ఇప్పుడు టీకా కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ‘ఆ వ్యాక్సిన్‌’ ఉంటేనే వేసుకుంటామని పట్టుబట్టిన జనం ఇప్పుడు ఏ వ్యాక్సిన్‌ ఉన్నా వేయాలంటూ బారులు తీరుతున్నారు. అయితే, హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు టీకా దొరకడం లేదు. గ్రేటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఈ విషయం స్పష్టమైంది. పలు పీ హెచ్‌సీలకు వ్యాక్సిన్‌ కేటాయించినా, సాధారణ ప్రజల కంటే ముందుగా పలుకుబడి కలిగిన వారికే దక్కుతోంది.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో గురువారం పలు పీహెచ్‌సీలు, ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వెళ్లిన వారిలో అత్యధికు లు నిరాశతో ఇంటి ముఖం పట్టారు. పలు పీహెచ్‌సీల వద్ద వ్యాక్సిన్‌ వస్తుంద ని టోకెన్లు తీసుకొని మధ్యాహ్నం వరకు వేచి చూసినా, ప్రయోజనం లేదు. వ్యాక్సిన్‌ రాలేదని పీహెచ్‌సీ సిబ్బంది తిరిగి ఇళ్లకు పంపించారు. కొన్ని ప్రాం తాల్లో వ్యాక్సిన్‌ వచ్చినా, అది వంద మందికి కూడా సరిపోలేదు. సికింద్రాబాద్‌ పరిధిలోని ఓ పీహెచ్‌సీలో 200 మందికి టోకెన్లు ఇవ్వగా 80 మందికి మాత్ర మే వ్యాక్సిన్‌ వేశారు మిగతా వారిని మరుసటి రోజు రమ్మని పంపించారు. వ్యాక్సిన్‌ కోసం చాలా ప్రాంతాల్లో రద్దీ పెరిగింది. పీహెచ్‌సీలతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల వద్ద వ్యాక్సిన్‌ కోసం బారులు తీరుతున్నారు.


శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో కొవాగ్జిన్‌ అందుబాటులో లేదు. కొవిషీల్డ్‌ అందుబాటులో ఉండగా వచ్చిన వారందరికీ వేశారు. సరూర్‌ నగర్‌ పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ కోసం ఉదయమే టోకెన్లు జారీ చేస్తూ రోజుకు సుమారు 300-400 మందికి వేస్తున్నారు. పలు చోట్ల ఉన్నత స్థాయి సిఫారసులతో వచ్చిన వారికి మధ్యాహ్నం టీకాలు వేస్తున్నారు.

Updated Date - 2021-04-23T09:40:01+05:30 IST